రైలు కిందపడి యువకుని ఆత్మహత్య
Published Wed, Sep 18 2013 2:19 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కోనేరుసెంటర్( మచిలీపట్నం), న్యూస్‌లైన్ : కడుపునొప్పి తాళలేక పట్టణానికి చెందిన ఓ యువకుడు మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ డి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన తాడికొండ వెంకటకిరణ్‌కుమార్ (20) రామానాయుడుపేటలో ప్రియాంక పేరుతో ఫొటోస్టూడియో నడుపుతున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం యథావిధిగా షాపునకు బయలుదేరిన కిరణ్ నేరుగా రాడార్‌కేంద్రం సమీపాన ఉన్న రైలు ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
స్థానికులకు అనుమానం రాకుండా కాసేపు ఆ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్నట్లు నటించాడు. సుమారు 9.30 గంటల సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వైపు రైలు వస్తుండగా అప్పటి వరకు ఫొటోలు తీస్తున్న కిరణ్ స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా రైలు కిందపడిపోయాడు. ఈ ఘటనలో కిరణ్ తల, చేతులు, మొండెం వేర్వేరు భాగాలుగా విడిపోయి చూసేందుకు కూడా వీలులేని విధంగా తయారయ్యాయి. జరిగిన సంఘటనపై తెలిసిన వారు కుటుంబసభ్యులకు తెలియజేయటంతో అక్కడకు చేరుకున్న తండ్రి వెంకటవరప్రసాద్ కిరణ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. బంధువులు బోరున విలపించారు. కాగా కిరణ్ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని రైల్వే హెచ్‌సీ శ్రీనివాస్ తెలిపారు.
యువకుని మృతిపై భిన్న కథనాలు...
కాగా కిరణ్‌కుమార్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కడుపునొప్పి తాళలేకే కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు వెల్లడించగా... ప్రేమ వ్యవహారం కారణంగానే కిరణ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్నేహితులు మాట్లాడుకోవటంపై పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
Advertisement