బరం పార్కుకు కొత్తకళ | A new development in Baram Green Park | Sakshi
Sakshi News home page

బరం పార్కుకు కొత్తకళ

Published Sun, Jul 5 2015 2:32 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

బరం పార్కుకు కొత్తకళ - Sakshi

బరం పార్కుకు కొత్తకళ

కల్యాణమండపం నిర్మాణం రూముల ఆధునికీకరణకొత్త బోట్లకు ప్రతిపాదనలు ఏపీటీడీపీ సరికొత్త నిర్ణయాలు
సాక్షి, విజయవాడ :
భవానీపురంలోని బరం పార్కుకు మహర్దశ పట్టనుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో హరిత బరం పార్కుకు కొత్త సొబగులు అద్దేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రూమ్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో గదులను పూర్తిగా మార్చేస్తున్నారు. బరం పార్కులో ఐదు బ్లాక్‌లలో మొత్తం 30 గదులున్నాయి. దశాబ్దంన్నర కిందట నిర్మించినది కావడంతో వీటిని ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.1.56 కోట్ల నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ గంగరాజు ‘సాక్షి’కి తెలిపారు.

వీటితో గదులకు మరమ్మతులు చేయడంతో పాటు ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటుచేయడం, ఏసీలకు మరమ్మతులు చేయించడం, గదుల్లో బెడ్స్‌ను మార్పులు చేయడం చేస్తారు. బరం పార్కులో జీ+2 పద్ధతిలో ఐదు బ్లాక్‌లు నిర్మించారు. పర్యాటకులు పై అంతస్తుకు వెళ్లేందుకు లిప్టు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదు బ్లాక్‌లకు లిప్టు సౌకర్యం కల్పించనున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆధునికీకరించి పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.
 
వెయ్యిమంది కూర్చునేలా కల్యాణమండపం
ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తమ సిబ్బందితో కలిసి కృష్ణానదిలో బోటింగ్, భవానీ ఐలాండ్ సందర్శనకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే సెమినార్లు నిర్వహిస్తున్నారు. అలాగే, దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుపుకొంటున్నారు. దీంతో బరం పార్కులోనే కల్యాణమండపం (బ్యాంకెట్ హాల్) నిర్మించనున్నారు. బరం పార్కులో ముందు వైపు ఉన్న విశాలమైన స్థలంలో సుమారు వెయ్యిమంది కూర్చునేందుకు వీలుగా దీన్ని నిర్మించనున్నారు.
 
పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకే..
బరం పార్కులో బస చేసిన పర్యాటకులు ఉదయం పూట మార్నింగ్ వాక్ చేసేందుకు వీలుగా పచ్చిక బయళ్లను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఉదయం పూట బోటులో బ్రేక్‌ఫాస్ట్‌ను ఉచితంగా ఏర్పాటుచేస్తున్నారు.   రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
 
మరో రెండు బోట్లకు సిఫారసు
ప్రస్తుతం బరం పార్కు నుంచి భవానీ ద్వీపానికి ప్రయాణికుల్ని తీసుకువెళ్లేందుకు ఎనిమిది బోట్లు ఉన్నాయి. ఇందులో బోధిసిరి అతిపెద్ద బోటు కాగా, ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా జట్ స్కీ, స్పీడుబోట్లు ఉన్నాయి.
ఈ బోట్లలో ఒకేసారి 300 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే, గత కార్తీకమాసంలో ఈ బోట్లు ఏమాత్రం సరిపోలేదు. దీనికితోడు కొన్ని బోట్లు పాడైపోయి మధ్యలో మోరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు కొత్త బోట్లు మంజూరు చేయమంటూ ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు సిఫారసు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement