Tourism organization
-
ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం
బుధవారం ఉదయం 6 గంటలు.. అది హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ ప్రాంతం.. ఆకాశం నుంచి ఏదో భారీ వస్తువు.. మెల్లగా ఖాళీ ప్రదేశంలో దిగింది. చూస్తుంటే ఏదో వ్యోమనౌకలా ఉంది. ఆదిత్య 369 సినిమాలోని ‘టైమ్ మెషీన్’లా ఉందని కొందరు.. ఏదో గ్రహాంతర నౌక కావొచ్చని కొందరు.. ఒక్కసారిగా కలకలం రేగింది. అదేమిటో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరి అక్కడ ల్యాండ్ అయింది ఏమిటో తెలుసా..? అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే స్పేస్ క్యాప్సూల్. అది ఇక్కడెందుకు దిగింది? మనకు ఏమిటి సంబంధం? ఆ వివరాలు మీకోసం.. సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/మర్పల్లి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న స్పేస్ టూరిజం అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన హాలో స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో, సులువుగా కొన్ని గంటల పాటు అంతరిక్షంలో తిరిగి వచ్చేందుకు వీలుగా హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను రూపొందించింది. సుమారు ఎనిమిది మనుషులు, కొంత సామగ్రి దీనిద్వారా ఆకాశంలో సుమారు 40 కిలోమీటర్ల ఎత్తుకు పంపవచ్చు. అక్కడే ఐదారు గంటల పాటు మెల్లగా ప్రయాణిస్తూ.. భూమి అంచులను, దిగువన మేఘాలను, వందలు–వేల కిలోమీటర్ల కొద్దీ దూరాలను వీక్షించవచ్చు. టీఐఎఫ్ఆర్ కేంద్రం నుంచి.. హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) సహకారంతో హాలో స్పేస్ సంస్థ తమ ప్రయోగాన్ని చేసింది. మంగళవారం సాయంత్రం టీఐఎఫ్ఆర్లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ నుంచి హాలో స్పేస్ హాట్ ఎయిర్‌బెలూన్ క్యాప్సూల్‌ను ప్రయోగించారు. అది అంతరిక్షంలో చాలా ఎత్తుకు చేరి, చక్కర్లు కొట్టిన తర్వాత.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగిద్ద గ్రామ శివార్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ల్యాండ్ అయింది. అలా పెద్ద పరికరం ఆకాశం నుంచి వస్తుండటంతో మొగిలిగిద్దతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు కూడా. శాస్త్రవేత్తలు వచ్చి రికవరీ చేసుకుని.. హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను ప్రయోగించిన హాలోస్పేస్, టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు దానిని నిరంతరం పరిశీలిస్తూ వచ్చా రు. భూమి నుంచి ఎంత ఎత్తుకు వెళ్లింది, ఎలా సంచరించినదీ ప్రత్యేక పరికరాలతో ట్రాక్ చేశారు. లక్ష్యం మేరకు ప్రయాణం పూర్తయ్యాక నిర్జన ప్రదేశంలో ల్యాండ్ చేశా రు. సాధారణంగా ఈ క్యాప్సూల్‌లో మనుషు లు వెళ్లవచ్చు. అయితే ఇది ప్రయోగాత్మక పరిశీలన కావడంతో వెయ్యి కిలోల బరువున్న వస్తువులను పెట్టి ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం కావడంతో క్యాప్సూల్ 10 కిలోమీటర్లకుపైగా ఎత్తులో 40 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ల్యాండ్ అయిందని వివరించారు. స్పేస్ క్యాప్సూల్‌లోని పరికరాల డేటాను విశ్లేశించాల్సి ఉందని.. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా? అంత ఎత్తులో క్యాప్సూల్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులను పంపేందుకు ఏమేం మార్పులు అవసరం అనేది తేల్చుతామని వెల్లడించారు. తొలి ప్రయోగం మన వద్దే.. హాలో స్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు కార్లోస్ మీరా. స్పేస్ క్యాప్సూల్ రూపకల్పన, ప్రయోగాలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కాస్ట్రిల్లో ఆధ్వర్యంలోని 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్ష పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన స్పేస్ క్యాప్సూల్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లోనే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించే డేటా ఆధారంగా మరింతగా అభివృద్ధి/ మార్పులు చేస్తారు. తర్వాత స్పెయిన్‌లో మరో ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేఅంతరిక్షంలోకి మనుషులను పంపుతామని వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.కోటిపైనే.. హాలో స్పేస్ క్యాప్సూల్ 800 కిలోల బరువుతో 5 మీటర్ల వ్యాసం, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ సాయంతో అంతరిక్షంలోకి ఎగుస్తుంది. దీనికితోడుగా ప్యారాచూట్ సాయంతో ల్యాండ్ అవుతుంది. స్పేస్ క్యాప్సూల్‌కు చుట్టూ పెద్ద పెద్ద గాజు అద్దాలను బిగించారు. ఇందులో ప్రయాణించేవారు చుట్టూరా అంతరిక్షాన్ని, భూమిని వీక్షించవచ్చు. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ప్రయాణించవచ్చు. అత్యవసర సామగ్రి, ఆక్సిజన్, రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు) ఖర్చవుతుందని హాలో స్పేస్ సంస్థ చెప్తోంది. 2025లో వాణిజ్యపరంగా పర్యటనలను ప్రారంభిస్తామని పేర్కొంది. 2029 నాటికల్లా 400 అంతరిక్షల యాత్రలతో 3 వేల మందిని అంతరిక్షంలోకి తీసుకెళతామని అంటోంది. ఇందులో టూరిస్టులు ఆరు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని హైదరాబాద్ నేషనల్ బెలూన్ ఫెసిలిటీ టెక్నికల్ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌తో ఎలా? వేడిగాలి చల్లటి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో పైకి వెళ్తుంది. ఈ సూత్రం ఆధారంగానే హాట్ ఎయిర్ బెలూన్ పనిచేస్తుంది. భారీ బెలూన్‌లో వేడి గాలిని నింపి, ఆ వేడిని నియంత్రిస్తూ ఉండటం వల్ల.. ఆకాశంలోకి వెళ్లే ఎత్తు, ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. నాణ్యమైన, భారీ బెలూన్లు వందల కిలోల బరువును అంతరిక్షంలోకి కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలవు. తర్వాత బెలూన్‌లో గాలిని చల్లార్చడం, తగ్గించడం ద్వారా మెల్లగా కిందికి దిగివచ్చేలా చేయవచ్చు. హాలో స్పేస్ క్యాప్సూల్ ఈ విధానంలోనే పనిచేస్తుంది. మన హైదరాబాదే ఎందుకు? హాలో స్పేస్ సంస్థ రూపొందించిన క్యాప్సూల్ హాట్ ఎయిర్ బెలూన్ సాయంతోనే అంతరిక్షంలోకి వెళుతుంది. అంత ఎత్తులోకి బెలూన్లను ప్రయోగించగల సదుపాయం ఆసియా ఖండం మొత్తంలో మన హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి బెలూన్ ఫెసిలిటీ సెంటర్లో మాత్రమే ఉంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ఈ కేంద్రం ఉంది. మన దేశంతోపాటు వివిధ దేశాల వాతావరణ, భూసమీప అంతరిక్ష ప్రయోగాల కోసం ఈ ఫెసిలిటీని వినియోగించుకుంటారు. -
బరం పార్కుకు కొత్తకళ
కల్యాణమండపం నిర్మాణం రూముల ఆధునికీకరణకొత్త బోట్లకు ప్రతిపాదనలు ఏపీటీడీపీ సరికొత్త నిర్ణయాలు సాక్షి, విజయవాడ : భవానీపురంలోని బరం పార్కుకు మహర్దశ పట్టనుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో హరిత బరం పార్కుకు కొత్త సొబగులు అద్దేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రూమ్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో గదులను పూర్తిగా మార్చేస్తున్నారు. బరం పార్కులో ఐదు బ్లాక్‌లలో మొత్తం 30 గదులున్నాయి. దశాబ్దంన్నర కిందట నిర్మించినది కావడంతో వీటిని ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.1.56 కోట్ల నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ గంగరాజు ‘సాక్షి’కి తెలిపారు. వీటితో గదులకు మరమ్మతులు చేయడంతో పాటు ఎల్ఈడీ టీవీలు ఏర్పాటుచేయడం, ఏసీలకు మరమ్మతులు చేయించడం, గదుల్లో బెడ్స్‌ను మార్పులు చేయడం చేస్తారు. బరం పార్కులో జీ+2 పద్ధతిలో ఐదు బ్లాక్‌లు నిర్మించారు. పర్యాటకులు పై అంతస్తుకు వెళ్లేందుకు లిప్టు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదు బ్లాక్‌లకు లిప్టు సౌకర్యం కల్పించనున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆధునికీకరించి పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. వెయ్యిమంది కూర్చునేలా కల్యాణమండపం ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తమ సిబ్బందితో కలిసి కృష్ణానదిలో బోటింగ్, భవానీ ఐలాండ్ సందర్శనకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే సెమినార్లు నిర్వహిస్తున్నారు. అలాగే, దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుపుకొంటున్నారు. దీంతో బరం పార్కులోనే కల్యాణమండపం (బ్యాంకెట్ హాల్) నిర్మించనున్నారు. బరం పార్కులో ముందు వైపు ఉన్న విశాలమైన స్థలంలో సుమారు వెయ్యిమంది కూర్చునేందుకు వీలుగా దీన్ని నిర్మించనున్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకే.. బరం పార్కులో బస చేసిన పర్యాటకులు ఉదయం పూట మార్నింగ్ వాక్ చేసేందుకు వీలుగా పచ్చిక బయళ్లను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఉదయం పూట బోటులో బ్రేక్‌ఫాస్ట్‌ను ఉచితంగా ఏర్పాటుచేస్తున్నారు. రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. మరో రెండు బోట్లకు సిఫారసు ప్రస్తుతం బరం పార్కు నుంచి భవానీ ద్వీపానికి ప్రయాణికుల్ని తీసుకువెళ్లేందుకు ఎనిమిది బోట్లు ఉన్నాయి. ఇందులో బోధిసిరి అతిపెద్ద బోటు కాగా, ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా జట్ స్కీ, స్పీడుబోట్లు ఉన్నాయి. ఈ బోట్లలో ఒకేసారి 300 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే, గత కార్తీకమాసంలో ఈ బోట్లు ఏమాత్రం సరిపోలేదు. దీనికితోడు కొన్ని బోట్లు పాడైపోయి మధ్యలో మోరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు కొత్త బోట్లు మంజూరు చేయమంటూ ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు సిఫారసు చేశారు. -
ఇదేం ప్రత్యేకత!?
వనసమారాధనల కోసం కేవలం లక్ష మంజూరు మొక్కుబడిగా నిధుల కేటాయింపు సరిపోదంటున్న అధికారులు సాక్షి, విజయవాడ : పర్యాటకుల్ని ఆకట్టుకునేలా రాష్ట్ర నూతన రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా కార్తీకమాసంలో ప్రజలు వన సమారాధనలు, శైవక్షేత్ర దర్శనాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడం రివాజు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా కార్తీక వనసమారాధనలు జరుగుతున్నందున భవానీద్వీపంలో అధికారులు పలు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేస్తారనుకున్న పర్యాటకులకు నిరాశే మిగిలింది. జిల్లాకో లక్ష : కార్తీకమాసంలో దేవాలయాల సందర్శన, వనసమారాధనల ఏర్పాట్లు, పర్యాటకుల్ని ఆకట్టుకోవడం తదితర అంశాలపై హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాది కంటే ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకట్టుకోవాలంటూ హితబోధ చేశారు. ఈ సమావేశంలో ఒక్కొక్క జిల్లాకు రూ.లక్ష మంజూరు చేశారు. ఈ డబ్బుతోనే పర్యాటకులకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలి. ఆదివారాల్లో చిన్నారులకు ఆటల పోటీలు, సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం, పర్యాటక ప్రదేశాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భవానీద్వీపం వంటి అవసరమైన చోట మీడియా పబ్లిసిటీ కూడా ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి పి.బి.ఎస్.మోహన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. నవంబర్ రెండో తేదీ ఆదివారం నుంచి వీటిని అమలు చేయమని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఇచ్చిన లక్ష రూపాయలతో పర్యాటకులకు సౌకర్యాలు ఏం కల్పిస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అటువంటి సమయాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే నిధుల కొరత ఉండకూడదని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. డివిజనల్ మేనేజర్లు బదిలీ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ల బదిలీ జరిగింది. విజయవాడ డివిజనల్ మేనేజర్ బాబూజీని కాకినాడ వేశారు. అక్కడి మేనేజర్‌ను హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు విభాగానికి బదిలీ చేశారు. విజయవాడ డివిజన్‌కు గతంలో పనిచేసిన సూర్యప్రకాశరావును ఓఎస్డీగా నియమించారు. ఆయన చార్జి తీసుకోకపోవడంతో బాబూజీకి కాకినాడ బాధ్యతలతో పాటు విజయవాడ డివిజన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యాటకుల నుంచి విశేష స్పందన భవానీద్వీపంలో ఏపీటీడీసీ అధికారులు అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పర్యాటకుల నుంచి స్పందన బాగానే ఉన్నట్లు తెలిసింది. గత ఏడాది రూ.15 లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.18 లక్షలు రాబట్టాలని టార్గెట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. అయితే పర్యాటకుల నుంచి వస్తున్న స్పందన బట్టి కనీసం రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే రూ. 25 లక్షలు వచ్చే అవకాశం ఉంది. భవానీద్వీపం వంటి ప్రదేశాలకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఒక్క భవానీద్వీపమే కాకుండా కొండపల్లి ఖిల్లాను కలుపుతూ వనభోజనాల ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
చూసొద్దాం రండి..
పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్యాకేజీ రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 వరకు ప్రత్యేక బస్సు విజయవాడ-గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శన పర్యాటకాభివృద్ధే ధ్యేయం.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రాంతాల్లో పర్యాటక రంగాభివృద్ధికి అధికారులు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెడుతున్నారు. దీనిద్వారా రెండు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడ-గుంటూరులోని ముఖ్యమైన ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టారు. ఇందుకోసం 18 సీట్ల బస్సును కూడా సిద్ధం చేశారు. ప్యాకేజీ వివరాలివీ.. ఈ బస్సు రోజూ సాయంత్రం 4 గంటలకు బందరురోడ్డులోని ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయల్దేరుతుంది. 4.45 మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తీసుకెళ్తుంది. స్వామివారి దర్శనానంతరం అక్కడే ఉన్న హ్యాండ్లూమ్ బజార్‌కు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు హ్యాండ్లూమ్ బజార్ నుంచి బయల్దేరి 6.30 గంటలకు హాయ్‌ల్యాండ్ చేరుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు హాయ్‌ల్యాండ్ నుంచి భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న బరంపార్కుకు వస్తుంది. 8.15 నుంచి 9.15 గంటల వరకు కృష్ణానదిలో బోటు విహారం, బోటులోనే భోజనాలు ఏర్పాటుచేస్తారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి ఏపీటీడీసీ కార్యాలయూనికి చేరుకుంటుంది. ఒక్కొక్కరికీ రూ.400 పెద్దలు ఒక్కొక్కరికీ రూ.400, చిన్నారులకైతే రూ.250 చొప్పున టికెట్ చెల్లించాలి. ప్రయాణికుల ట్రాన్స్‌పోర్టేషన్, బోటింగ్, ప్రతిచోటా ఎంట్రీ టికెట్లు, గైడ్, ఉచిత భోజనం కల్పిస్తారు. మూడురోజుల్లో 20 మంది సందర్శన నగరంలో మూడు రోజులుగా ఈ టూరిస్టు ప్యాకేజీ కొనసాగుతోంది. సుమారు 20 మంది పర్యాటకులు దీనిని వినియోగించుకున్నారు. కొన్ని మార్పులు చేస్తే ఉపయుక్తమే.. టూర్ ప్యాకేజీ అంతా బాగానే ఉన్నా.. కొన్ని లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నారుు. రోజూ సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 9.30 గంటలకు తిరిగివచ్చే విధంగా టూర్ ఏర్పాటు చేయడంపై పర్యాటకుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమయం తక్కువగా ఉన్నందున హాయ్‌ల్యాండ్, బోటు షికారు హడావుడిగా చేయూల్సి వస్తోందంటున్నారు. కనీసం ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేలా ప్యాకేజీలో మార్పులు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. అలాగే, మంగళగిరి కొండపై ఉన్న పానకాలస్వామి దేవాలయ సందర్శనకు మరింత సమయం కేటాయిస్తే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, సాయంత్రం కొద్దిసేపు భవానీద్వీపంలోనూ విహరించే సౌకర్యం కల్పిస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు. ప్రచారం అవసరం ఏపీటీడీసీ అధికారులు ప్యాకేజీ ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంటే సరిపోదు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మార్కెటింగ్ సిబ్బందిని ఏర్పాటుచేస్తే మంచిది. ఇలా.. 18 సీట్ల బస్సు పూర్తిగా నిండేలా అధికారులు ప్రయత్నిస్తే ఏపీటీడీసీకి ఆదాయం రావడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. -
కొనేద్దాం.. పడుంటాయ్!
పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రజాధనం దుబారా అవసరానికి మించి కాగితపు కప్పులు, టిష్యూ పేపర్ల కొనుగోళ్లు కమీషన్ల కోసం ఓ ఉన్నతాధికారి కక్కుర్తి సాక్షి, హైదరాబాద్: సరుకులు కొనేప్పుడు ఏం చేస్తాం... ఆ నెలలో అవసరమైనవేంటో జాబితా రాసుకుని, బడ్జెట్ చూసుకుని కొంటాం. ప్రజలకవసరమైన సేవల విషయంలో ప్రభుత్వ విభాగాలు కూడా ప్రణాళిక వేసుకోవటం సహజం. కానీ... ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతున్న పర్యాటకశాఖలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. కమీషన్ల కోసం క క్కుర్తి పడుతున్న అధికారులు... అవసరం, బడ్జెట్‌లాంటి వాటితో సంబంధం లేకుండా ఎడాపెడా కొనుగోళ్లతో ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇటీవల పర్యాటకాభివృద్ధి సంస్థలో రెస్టారెంట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇది అవసరమైన చర్యేఅయినా, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విచ్చలవిడితనమే ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఈ రెస్టారెంట్లకోసం అవసరానికి మించి ఎడాపెడా పేపర్ కప్పులు, టిష్యూ పేపర్లను కొని ప్రజాధనాన్ని భారీగా వృథా చేసేందుకు సిద్ధమయ్యారు. కాగితంతో తయారు చేసినందున సంవత్సరంలోపు కప్పులను వాడేయాల్సి ఉం టుంది. లేనిపక్షంలో, వాటిల్లో వేడి టీ పోయగానే... జిగురుతో అతికించిన భాగం ఊడిపోయి అందులోని పదార్థం ఒలికిపోయే ప్రమాదం ఉంటుంది. అం దుకోసం ఏడాదికి సరిపడా స్టాకు మాత్రమే నిల్వ ఉండేలా చూస్తారు. కానీ ఇప్పుడు ఐదారేళ్లకు సరిపడా స్టాకు కొనేస్తున్నారు. టిష్యూపేపర్లు కూడా మన్నిక కోల్పోయే అవకాశం ఉంటుంది. కాగా, ఇదంతా ఒక కాంట్రాక్టర్ నుంచే కొంటున్నారు. ఇలా ఇప్పటికే విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, శ్రీశైలం సహా మరికొన్ని ప్రాంతాల్లోని రెస్టారెంట్లకు కొనేసినట్టు తెలిసింది. ప్రధాన కార్యాలయంలో ఉండే ఓ ఉన్నతాధికారి కమీషన్లకు కక్కుర్తిపడి ఇలా కొనుగోళ్లకు తెరతీశాడని సమాచారం. స్థానిక రెస్టారెంట్ల సిబ్బంది వారించినా కూడా కొనాల్సిందేనన్న ఆదేశాలు రావటంతో కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. ఇందుకోసం దాదాపు అరకోటి వరకు వ్యయం చేసేందుకు సిద్ధమయ్యారు. కొన్నంతమేర సరుకుకు చెల్లింపులు కూడా జరిగిపోయినట్టు తెలిసింది. మిగతా సరుకును సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ సిద్ధమైన తరుణంలో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో దాన్ని కొద్ది రోజుల తర్వాత కొనాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.