ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం  | Space Balloon Flight: Strange Device Fell From Sky In Fields Of Vikarabad | Sakshi
Sakshi News home page

ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం 

Published Thu, Dec 8 2022 3:06 AM | Last Updated on Thu, Dec 8 2022 6:41 AM

Space Balloon Flight: Strange Device Fell From Sky In Fields Of Vikarabad - Sakshi

బుధవారం ఉదయం 6 గంటలు.. అది హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్‌ ప్రాంతం.. ఆకాశం నుంచి ఏదో భారీ వస్తువు.. మెల్లగా ఖాళీ ప్రదేశంలో దిగింది. చూస్తుంటే ఏదో వ్యోమనౌకలా ఉంది. ఆదిత్య 369 సినిమాలోని ‘టైమ్‌ మెషీన్‌’లా ఉందని కొందరు.. ఏదో గ్రహాంతర నౌక కావొచ్చని కొందరు.. ఒక్కసారిగా కలకలం రేగింది. అదేమిటో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరి అక్కడ ల్యాండ్‌ అయింది ఏమిటో తెలుసా..? అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే స్పేస్‌ క్యాప్సూల్‌. అది ఇక్కడెందుకు దిగింది? మనకు ఏమిటి సంబంధం? ఆ వివరాలు మీకోసం.. 

సాక్షి, హైదరాబాద్‌/ వికారాబాద్‌/మర్పల్లి:  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న స్పేస్‌ టూరిజం అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన హాలో స్పేస్‌ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో, సులువుగా కొన్ని గంటల పాటు అంతరిక్షంలో తిరిగి వచ్చేందుకు వీలుగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ను రూపొందించింది. సుమారు ఎనిమిది మనుషులు, కొంత సామగ్రి దీనిద్వారా ఆకాశంలో సుమారు 40 కిలోమీటర్ల ఎత్తుకు పంపవచ్చు. అక్కడే ఐదారు గంటల పాటు మెల్లగా ప్రయాణిస్తూ.. భూమి అంచులను, దిగువన మేఘాలను, వందలు–వేల కిలోమీటర్ల కొద్దీ దూరాలను వీక్షించవచ్చు. 

టీఐఎఫ్‌ఆర్‌ కేంద్రం నుంచి.. 
హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) సహకారంతో హాలో స్పేస్‌ సంస్థ తమ ప్రయోగాన్ని చేసింది. మంగళవారం సాయంత్రం టీఐఎఫ్‌ఆర్‌లోని నేషనల్‌ బెలూన్‌ ఫెసిలిటీ నుంచి హాలో స్పేస్‌ హాట్‌ ఎయిర్‌బెలూన్‌ క్యాప్సూల్‌ను ప్రయోగించారు.

అది అంతరిక్షంలో చాలా ఎత్తుకు చేరి, చక్కర్లు కొట్టిన తర్వాత.. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగిద్ద గ్రామ శివార్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ల్యాండ్‌ అయింది. అలా పెద్ద పరికరం ఆకాశం నుంచి వస్తుండటంతో మొగిలిగిద్దతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు కూడా. 

శాస్త్రవేత్తలు వచ్చి రికవరీ చేసుకుని.. 
హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ స్పేస్‌ క్యాప్సూల్‌ను ప్రయోగించిన హాలోస్పేస్, టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు దానిని నిరంతరం పరిశీలిస్తూ వచ్చా రు. భూమి నుంచి ఎంత ఎత్తుకు వెళ్లింది, ఎలా సంచరించినదీ ప్రత్యేక పరికరాలతో ట్రాక్‌ చేశారు. లక్ష్యం మేరకు ప్రయాణం పూర్తయ్యాక నిర్జన ప్రదేశంలో ల్యాండ్‌ చేశా రు. సాధారణంగా ఈ క్యాప్సూల్‌లో మనుషు లు వెళ్లవచ్చు.

అయితే ఇది ప్రయోగాత్మక పరిశీలన కావడంతో వెయ్యి కిలోల బరువున్న వస్తువులను పెట్టి ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం కావడంతో క్యాప్సూల్‌ 10 కిలోమీటర్లకుపైగా ఎత్తులో 40 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ల్యాండ్‌ అయిందని వివరించారు. స్పేస్‌ క్యాప్సూల్‌లోని పరికరాల డేటాను విశ్లేశించాల్సి ఉందని.. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా? అంత ఎత్తులో క్యాప్సూల్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులను పంపేందుకు ఏమేం మార్పులు అవసరం అనేది తేల్చుతామని వెల్లడించారు. 

తొలి ప్రయోగం మన వద్దే.. 
హాలో స్పేస్‌ సంస్థ వ్యవస్థాపకుడు కార్లోస్‌ మీరా. స్పేస్‌ క్యాప్సూల్‌ రూపకల్పన, ప్రయోగాలకు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కాస్ట్రిల్లో ఆధ్వర్యంలోని 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్ష పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన స్పేస్‌ క్యాప్సూల్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లోనే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించే డేటా ఆధారంగా మరింతగా అభివృద్ధి/ మార్పులు చేస్తారు. తర్వాత స్పెయిన్‌లో మరో ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేఅంతరిక్షంలోకి మనుషులను పంపుతామని వెల్లడించారు. 

ఒక్కొక్కరికి రూ.కోటిపైనే.. 
హాలో స్పేస్‌ క్యాప్సూల్‌ 800 కిలోల బరువుతో 5 మీటర్ల వ్యాసం, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సాయంతో అంతరిక్షంలోకి ఎగుస్తుంది. దీనికితోడుగా ప్యారాచూట్‌ సాయంతో ల్యాండ్‌ అవుతుంది. స్పేస్‌ క్యాప్సూల్‌కు చుట్టూ పెద్ద పెద్ద గాజు అద్దాలను బిగించారు. ఇందులో ప్రయాణించేవారు చుట్టూరా అంతరిక్షాన్ని, భూమిని వీక్షించవచ్చు. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్‌ ప్రయాణించవచ్చు. అత్యవసర సామగ్రి, ఆక్సిజన్, రక్షణ ఏర్పాట్లు ఉంటాయి.

ఇందులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు) ఖర్చవుతుందని హాలో స్పేస్‌ సంస్థ చెప్తోంది. 2025లో వాణిజ్యపరంగా పర్యటనలను ప్రారంభిస్తామని పేర్కొంది. 2029 నాటికల్లా 400 అంతరిక్షల యాత్రలతో 3 వేల మందిని అంతరిక్షంలోకి తీసుకెళతామని అంటోంది. ఇందులో టూరిస్టులు ఆరు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని హైదరాబాద్‌ నేషనల్‌ బెలూన్‌ ఫెసిలిటీ టెక్నికల్‌ టీం లీడర్‌ ప్రసాద్‌ తెలిపారు.  

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌తో ఎలా? 
వేడిగాలి చల్లటి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో పైకి వెళ్తుంది. ఈ సూత్రం ఆధారంగానే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ పనిచేస్తుంది. భారీ బెలూన్‌లో వేడి గాలిని నింపి, ఆ వేడిని నియంత్రిస్తూ ఉండటం వల్ల.. ఆకాశంలోకి వెళ్లే ఎత్తు, ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. నాణ్యమైన, భారీ బెలూన్‌లు వందల కిలోల బరువును అంతరిక్షంలోకి కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలవు. తర్వాత బెలూన్‌లో గాలిని చల్లార్చడం, తగ్గించడం ద్వారా మెల్లగా కిందికి దిగివచ్చేలా చేయవచ్చు. హాలో స్పేస్‌ క్యాప్సూల్‌ ఈ విధానంలోనే పనిచేస్తుంది. 

మన హైదరాబాదే ఎందుకు? 
హాలో స్పేస్‌ సంస్థ రూపొందించిన క్యాప్సూల్‌ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సాయంతోనే అంతరిక్షంలోకి వెళుతుంది. అంత ఎత్తులోకి బెలూన్లను ప్రయోగించగల సదుపాయం ఆసియా ఖండం మొత్తంలో మన హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి  బెలూన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో మాత్రమే ఉంది. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)లో ఈ కేంద్రం ఉంది. మన దేశంతోపాటు వివిధ దేశాల వాతావరణ, భూసమీప అంతరిక్ష ప్రయోగాల కోసం ఈ ఫెసిలిటీని వినియోగించుకుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement