ఇదేం ప్రత్యేకత!?
- వనసమారాధనల కోసం కేవలం లక్ష మంజూరు
- మొక్కుబడిగా నిధుల కేటాయింపు
- సరిపోదంటున్న అధికారులు
సాక్షి, విజయవాడ : పర్యాటకుల్ని ఆకట్టుకునేలా రాష్ట్ర నూతన రాజధాని నగరాన్ని తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా కార్తీకమాసంలో ప్రజలు వన సమారాధనలు, శైవక్షేత్ర దర్శనాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడం రివాజు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా కార్తీక వనసమారాధనలు జరుగుతున్నందున భవానీద్వీపంలో అధికారులు పలు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేస్తారనుకున్న పర్యాటకులకు నిరాశే మిగిలింది.
జిల్లాకో లక్ష : కార్తీకమాసంలో దేవాలయాల సందర్శన, వనసమారాధనల ఏర్పాట్లు, పర్యాటకుల్ని ఆకట్టుకోవడం తదితర అంశాలపై హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాది కంటే ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకట్టుకోవాలంటూ హితబోధ చేశారు.
ఈ సమావేశంలో ఒక్కొక్క జిల్లాకు రూ.లక్ష మంజూరు చేశారు. ఈ డబ్బుతోనే పర్యాటకులకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలి. ఆదివారాల్లో చిన్నారులకు ఆటల పోటీలు, సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం, పర్యాటక ప్రదేశాల్లో మ్యూజిక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భవానీద్వీపం వంటి అవసరమైన చోట మీడియా పబ్లిసిటీ కూడా ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి పి.బి.ఎస్.మోహన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. నవంబర్ రెండో తేదీ ఆదివారం నుంచి వీటిని అమలు చేయమని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఇచ్చిన లక్ష రూపాయలతో పర్యాటకులకు సౌకర్యాలు ఏం కల్పిస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శని, ఆదివారాలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అటువంటి సమయాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే నిధుల కొరత ఉండకూడదని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం.
డివిజనల్ మేనేజర్లు బదిలీ
పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ల బదిలీ జరిగింది. విజయవాడ డివిజనల్ మేనేజర్ బాబూజీని కాకినాడ వేశారు. అక్కడి మేనేజర్‌ను హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు విభాగానికి బదిలీ చేశారు. విజయవాడ డివిజన్‌కు గతంలో పనిచేసిన సూర్యప్రకాశరావును ఓఎస్‌డీగా నియమించారు. ఆయన చార్జి తీసుకోకపోవడంతో బాబూజీకి కాకినాడ బాధ్యతలతో పాటు విజయవాడ డివిజన్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
పర్యాటకుల నుంచి విశేష స్పందన
భవానీద్వీపంలో ఏపీటీడీసీ అధికారులు అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పర్యాటకుల నుంచి స్పందన బాగానే ఉన్నట్లు తెలిసింది. గత ఏడాది రూ.15 లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.18 లక్షలు రాబట్టాలని టార్గెట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. అయితే పర్యాటకుల నుంచి వస్తున్న స్పందన బట్టి కనీసం రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే రూ. 25 లక్షలు వచ్చే అవకాశం ఉంది. భవానీద్వీపం వంటి ప్రదేశాలకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఒక్క భవానీద్వీపమే కాకుండా కొండపల్లి ఖిల్లాను కలుపుతూ వనభోజనాల ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.