కొనేద్దాం.. పడుంటాయ్!
పర్యాటకాభివృద్ధి సంస్థలో ప్రజాధనం దుబారా
అవసరానికి మించి కాగితపు కప్పులు, టిష్యూ పేపర్ల కొనుగోళ్లు
కమీషన్ల కోసం ఓ ఉన్నతాధికారి కక్కుర్తి
సాక్షి, హైదరాబాద్: సరుకులు కొనేప్పుడు ఏం చేస్తాం... ఆ నెలలో అవసరమైనవేంటో జాబితా రాసుకుని, బడ్జెట్ చూసుకుని కొంటాం. ప్రజలకవసరమైన సేవల విషయంలో ప్రభుత్వ విభాగాలు కూడా ప్రణాళిక వేసుకోవటం సహజం. కానీ... ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతున్న పర్యాటకశాఖలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. కమీషన్ల కోసం క క్కుర్తి పడుతున్న అధికారులు... అవసరం, బడ్జెట్‌లాంటి వాటితో సంబంధం లేకుండా ఎడాపెడా కొనుగోళ్లతో ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇటీవల పర్యాటకాభివృద్ధి సంస్థలో రెస్టారెంట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇది అవసరమైన చర్యేఅయినా, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విచ్చలవిడితనమే ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఈ రెస్టారెంట్లకోసం అవసరానికి మించి ఎడాపెడా పేపర్ కప్పులు, టిష్యూ పేపర్లను కొని ప్రజాధనాన్ని భారీగా వృథా చేసేందుకు సిద్ధమయ్యారు.
కాగితంతో తయారు చేసినందున సంవత్సరంలోపు కప్పులను వాడేయాల్సి ఉం టుంది. లేనిపక్షంలో, వాటిల్లో వేడి టీ పోయగానే... జిగురుతో అతికించిన భాగం ఊడిపోయి అందులోని పదార్థం ఒలికిపోయే ప్రమాదం ఉంటుంది. అం దుకోసం ఏడాదికి సరిపడా స్టాకు మాత్రమే నిల్వ ఉండేలా చూస్తారు. కానీ ఇప్పుడు ఐదారేళ్లకు సరిపడా స్టాకు కొనేస్తున్నారు. టిష్యూపేపర్లు కూడా మన్నిక కోల్పోయే అవకాశం ఉంటుంది. కాగా, ఇదంతా ఒక కాంట్రాక్టర్ నుంచే కొంటున్నారు. ఇలా ఇప్పటికే విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, శ్రీశైలం సహా మరికొన్ని ప్రాంతాల్లోని రెస్టారెంట్లకు కొనేసినట్టు తెలిసింది. ప్రధాన కార్యాలయంలో ఉండే ఓ ఉన్నతాధికారి కమీషన్లకు కక్కుర్తిపడి ఇలా కొనుగోళ్లకు తెరతీశాడని సమాచారం. స్థానిక రెస్టారెంట్ల సిబ్బంది వారించినా కూడా కొనాల్సిందేనన్న ఆదేశాలు రావటంతో కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. ఇందుకోసం దాదాపు అరకోటి వరకు వ్యయం చేసేందుకు సిద్ధమయ్యారు. కొన్నంతమేర సరుకుకు చెల్లింపులు కూడా జరిగిపోయినట్టు తెలిసింది. మిగతా సరుకును సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ సిద్ధమైన తరుణంలో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో దాన్ని కొద్ది రోజుల తర్వాత కొనాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.