జీహెచ్ఎంసీకి రూ. 4.33 కోట్లు మిగులు
సాక్షి,సిటీబ్యూరో: వాహనాల డీజిల్, విడిభాగాల ఖర్చులకు సంబంధించి మే, జూన్,జూలై మూడు మాసాల వ్యవధిలోనే జీహెచ్‌ఎంసీకి గత సంవత్సరం కంటే రూ. 4.33 కోట్లు ఆదా అయ్యాయి. అధికారాల వికేంద్రీకరణతో ఇది సాధ్యమైంది. జీహెచ్‌ఎంసీ రవాణా విభాగంలో ఎక్కువ దుబారా, అవినీతి జరుగుతోందని మీడియాలో వెలువడిన కథనాలతో కొద్ది నెలల క్రితం రవాణా విభాగం నిర్వహణను వికేంద్రీకరించారు. తద్వారా మూడు నెలల్లోనే రూ.4.33 కోట్లు ఆదా అయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వివరించారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 773 వాహనాలు రవాణా విభాగంలో ఉన్నాయి. వీటిలో 134 అధికారుల కోసం వినియోగిస్తున్నవి కాగా, మిగతావి చెత్త తరలింపు కోసం వినియోగిస్తున్నవి.
వీటిలో చాలా వాహనాలు పాతవి కావడంతో నిర్వహణ పేరిట నెలనెలా భారీగా ఖర్చులయ్యేవి, ఇంధనం ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. కేంద్రీకృతమైన రవాణా విభాగాన్ని వికేంద్రీకరించడం ద్వారా అవినీతి, దుబారా తగ్గుతాయని భావించిన కమిషనర్ సర్కిళ్లు/జోన్లకే అధికారాలు బదలాయించారు. కేవలం డీజిల్ వినియోగానికి సంబంధించే నార్త్‌జోన్‌లో రూ. 93 లక్షలు, సౌత్‌జోన్‌లో రూ. 1.10 కోట్లు, ఈస్ట్‌జోన్‌లో రూ. 33.40 లక్షలు, వెస్ట్‌జోన్‌లో రూ. 25 లక్షలు, సెంట్రల్ జోన్‌లో రూ.1.83 కోట్లు ఆదా అయినట్టు కమిషనర్ పేర్కొన్నారు.
సౌత్‌జోన్‌లో వాహనాల మరమ్మతులకు 2015లో రూ. 2,17,29,228 ఖర్చుకాగా, ఈ ఏడాది రూ. 1,48,43,476కు పరిమితమైంది. ఈస్ట్‌జోన్‌లో వాహనాల క్రమబద్ధీకరణ, జేసీబీలను తగ్గించడం ద్వారా నెలకు రూ. 4 లక్షలు, 5 డంపర్ ప్లేసర్లు తగ్గించడం ద్వారా నెలకు రూ.7.50 లక్షలు, ఆదా అయినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్‌లో రికార్డుస్థాయిలో రూ. 1.83 కోట్లు ఆదా అయినట్లు పేర్కొన్నారు. గ్రేటర్‌లోని 1,116 ఓపెన్ గార్బేజీ పాయింట్లను ఎత్తివేయడం వల్ల కూడా నిర్వహణ ఖర్చులు తగ్గాయని పేర్కొన్నారు.