హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్న తెలంగాణ నేతలు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నారు. రేపట్నుంచి ఆరంభం కానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా తమ నిరసన వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే టి.మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చురుగ్గా చర్చలు సాగుతున్నాయి. సీఎం కిరణ్ , స్పీకర్ మనోహర్ ల వైఖరిపై టి.నేతలు నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు పనిదినాలు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు అమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10.08 గంటలకు సభ సమావేశం కాగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పిస్తారు.