సాక్షి, గుంటూరు : జిల్లాలో రెండేళ్ళపాటు మద్యం దుకాణాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నెల 22న మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నగరంలోని మహిమాగార్డెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్‌లను ఎక్సైజ్ అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం వరకు ఒక్క దరఖాస్తు కూడా బాక్సుల్లో పడలేదు. గురువారం 14 షాపులకుగానూ 21 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తెనాలి డివిజన్ నుంచి 3, గుంటూరు డివిజన్ నుంచి 6, నరసరావుపేట డివిజన్ నుంచి 12 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా రెండురోజుల గడువు మాత్రమే ఉంది. శుక్ర, శనివారాల్లో దరఖాస్తులు అధిక సంఖ్యలో రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది దరఖాస్తు ఫీజు రూ. 25వేలు ఉండగా, ఈ ఏడాది మూడు శ్లాబులుగా విభజించి రూ. 30, రూ.40, రూ.50 వేలు చొప్పున నిర్ణయించారు. లెసైన్స్ ధరలు పెంచడంతోపాటు దరఖాస్తు ఫీజు కూడా పెంచడంతో దరఖాస్తు చేసుకోవడానికి అంతగా ఆసక్తి సూపడంలేదని మద్యం వ్యాపారులే చెబుతున్నారు.
ప్రభుత్వ దుకాణాలు ఇవే..
గుంటూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో గుంటూరులోని 8, 31, 27 డివిజన్‌లలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరి, తాడికొండ, తుళ్ళూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, అమరావతిలలో ఏర్పాటు చేస్తారు. నరసరావుపేట ఎక్సైజ్ పరిధిలో నరసరావుపేట 19వ డివిజన్, నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో, చిలకలూరిపేట 3వ డివిజన్, సత్తెనపల్లి 12వ డివిజన్, కొండమోడు, క్రోసూరు, అచ్చంపేట, పిడుగురాళ్ల, కారంపూడి, గురజాల, మాచర్ల, దుర్గి, వినుకొండలోని 10వ డివిజన్, నూజెండ్ల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. తెనాలి ఎక్సైజ్ జిల్లా పరిధిలో తెనాలిటౌన్, నారాకోడూరు, వేమూరు, కొల్లిపర మండలంలోని దావులూరు, కొల్లూరు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం, బాపట్ల, కర్లపాలెం, పొన్నూరు, కాకుమాను గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు.
అధికార పార్టీకి అనుకూలంగా..
ప్రభుత్వం కూడా తమ పార్టీ నాయకుల సూచనల ప్రకారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం దుకాణాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తుందని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు తక్కువ ధరలు ఉండగా, ప్రస్తుతం వాటిని మండల, మున్సిపల్ కేంద్రానికి 2 కి.మీ లోపు దూరంలో ఉన్నట్లు చూపుతూ వాటితో సమానంగా రేట్లు నిర్ణయించడం సమంజసం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు దాచేపల్లి మండలం నడికుడి మేజర్ గ్రామపంచాయితీలో ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 17 వేల మందికి పైగా జనాభా ఉన్నారు.
ఇక్కడ ఒక్క మద్యం దుకాణం మాత్రమే ఉంది. ఇక్కడ మద్యం దుకాణం లెసైన్స్ ఫీజు నిబంధనల ప్రకారం * 37 లక్షలు ఉంది. గతంలో ఈ షాపును రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా * 5.20 కోట్లకు టెండర్ వేసి దక్కించుకున్నారు. హైవే పక్కనే ఉండటంతో వ్యాపారం కూడా ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. దీంతో ఈ షాపునకు పోటీ సైతం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ మరో షాపు రాకుండా కనీసం ప్రభుత్వ మద్యం దుకాణాన్ని సైతం పెట్టకుండా అధికారపార్టీ ముఖ్యనేత అడ్డుకోగలిగారు. ఈ షాపునకు ఎవరూ దరఖాస్తు చేసుకున్నా ఒప్పుకునేది లేదంటూ ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది.
మద్యం దుకాణాలకు నామమాత్రపు స్పందన
Published Fri, Jun 26 2015 2:47 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement