ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి..
నాటిన వాటిని సంరక్షించండి.. పర్యావరణాన్ని కాపాడండి..
ఇదీ మనకు పర్యావరణ వేత్తలు చేస్తున్న హితబోధ..
ఆచరణలో.. ప్రతి ఒక్కరూ ఓ నర్సరీని పెంచండి.. వచ్చిన నిధులు భోంచేయండి
మొక్కల పెంపకాన్ని గాలికొదిలేయండి..
ఇదీ మన పాలకులు చూపుతున్న రాచమార్గం.
జిల్లాలోని నర్సరీ నిర్వాహకులు, అధికారులు ఈ మార్గాన్నే పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల నుంచి కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నా క్షేత్ర స్థాయిలో అవెక్కడా ఖర్చుచేసిన దాఖలాలు కనిపించడంలేదు. వచ్చిన నిధులు వచ్చినట్టే భోంచేయడం.. మొక్కల పెంపకం.. సంరక్షణను గాలికొదిలేయడం క్షేత్ర స్థాయిలో రివాజుగా మారతోంది.. అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని నర్సరీలపై ‘సాక్షి’ ఫోకస్.
తిరుపతి :సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే మొక్కల పెంపకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. లక్షల మొక్కలు నర్సరీల్లో పెంచుతున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు ఎక్కడా కానరావడంలేదు. ఉపాధి హామీ, నీరు-చెట్టు నిధులు వెచ్చిస్తున్నా మొక్కల సంరక్షణ అంతంతమాత్రమే.
మొక్కలు పెంచేది ఇక్కడే
జిల్లాలోని గోపాలకృష్ణాపురం, రెడ్డివారిపల్లె, సంతపేట, అవిలాల, గంధపునేనిపల్లె, మద్దివేడు, పరపాలపట్టు, కొత్తపల్లె, తిమ్మారెడ్డిపల్ల్లెలో నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు ఎవరెవరు..
ఎక్కడ నాటారంటే?
చిత్తూరు ఈస్టు పారెస్టు విభాగం పరిధిలో.. చిత్తూరు, కార్వేటినగరం, పుత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, పీలేరు, సత్యవేడు రేంజ్‌ల పరిధిలో 465 హెక్టార్లలో మొక్కలు నాటారు. పశ్చిమ అటవీశాఖ పరిధిలో.. మదనపల్లి, కుప్పం, బంగారుపాళ్యం, పలమనేరు, చిత్తూరు పడమర ప్రాంతాల్లో 300 హెక్టార్ల ర్లలో మొక్కలు నాటినట్లు రికార్డులద్వారా తెలుస్తోంది. ఈ రెండు చోట్లా మొక్కలు నాటడానికి ప్రభుత్వం రూ.20.57 కోట్లు వెచ్చించింది. అందులో రూ.15.04 కోట్ల నిధులు ఖర్చు చేశారు.
కనిపించని మొక్కలు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 4.10 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబున్నాయి. అందులో 50 వేల మొక్కలను అడవిలో నాటినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కులేక ఎండిపోతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఎక్కడున్నాయో కనిపించని పరిస్థితి. పీలేరు నియోజకవర్గంలోని గుండాల మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో 15 హెక్టార్లలో 17వేల మొక్కలు నాటారు. అక్కడ కనీసం 30 శాతం మొక్కలు కూడా కనిపించడంలేదు. మదనపల్లె నియోజకవర్గంలోని నర్సరీలో 2 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నా అక్కడ కవర్లు, మట్టితప్ప మొక్కలు కనిపించడంలేదు.
చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం మండలాల్లో 1.56 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నా అందులో 50 శాతం మొక్కలు కూడా కనిపించడంలేదు. శ్రీకళాహస్తి నియోజకవర్గంలో నీరు - చెట్టు కింద 67,500 మొక్కలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇందులో పది వేలలోపు మొక్కలు కూడా పంపిణీచేయలేదు.పలమనేరులోని బేలుపల్లె క్రాస్ వద్ద వంద ఎకరాల్లో మొక్కలు నాటినా అక్కడ నీరు లేక పూర్తిస్థాయిలో ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
‘మొక్క’వోని నిర్లక్ష్యం!
Published Mon, Mar 21 2016 3:37 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
Advertisement
Advertisement