పడకేసిన ‘ప్రజ్ఞ’
గూడూరు : వసతిగృహాల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు గతంలో జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన శ్రీధర్ ప్రజ్ఞ కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకుని, తదనుగుణంగా చర్యలు చేపట్టేలా ప్రజ్ఞ రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని 87 బీసీ, 156 ఎస్సీ, 25 ఎస్టీ వసతిగృహాలకు కంప్యూటర్లు అందజేశారు. ప్రతి వసతిగృహానికి నెట్ సౌకర్యం కల్పించారు. కానీ కంప్యూటర్, నెట్ వినియోగంపై వార్డెన్లకు శిక్షణ మాత్రం ఇవ్వలేదు. దీంతో అవి మూలనపడి పథకం అమలు లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.
తప్పని పడిగాపులు
కంప్యూటర్లు వినియోగించే విధానం తెలియకపోయినా ప్రతి వసతిగృహానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. దీంతో వార్డెన్లు నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్ కోతలు, నెట్ పనిచేయకపోవడం, కంప్యూటర్లు ఖాళీగా లేకపోవడం తదితర కారణాలతో గంటల కొద్ది అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కంప్యూటర్లు అందజేసినపుడే శిక్షణ కూడా ఇచ్చివుంటే ఈ పడిగాపులు తప్పేవని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చాలా పోస్టులు ఖాళీ
వసతిగృహాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి వసతి గృహానికి ఒక వార్డెన్‌తో పాటు కుక్, కామాటి, వాచ్‌మన్ ఉండాలి. కానీ చాలా వసతి గృహాల్లో తగినత మంది సిబ్బంది లేని పరిస్థితి. జిల్లాలోని 87 బీసీ వసతిగృహాల్లో 150 పోస్టులు ఖాళీనే. ఎస్సీ వసతిగృహాలు 156 ఉండగా, వాటిలో సుమారు 200 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. 25 ఎస్టీ వసతిగృహాల్లోనూ 20 పోస్టులు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. పలు వసతిగృహాల్లో వార్డెన్ ఒక్కరే ఉన్నారు. ఆయన నెట్ సెంటర్‌కు వెళితే గంటల తరబడి విద్యార్థులను పర్యవేక్షించే వారు కరువవుతున్నారు. వార్డెన్లకు కంప్యూటర్ల ఆపరేటింగ్‌పై శిక్షణ ఇస్తే ఈ సమస్యకు చెక్ పడుతుంది. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.