Wardens
-
ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్
– 19 మందికి పోస్టింగ్‌లు కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమశాఖలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 19 మంది వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. శనివారం ఉదయం సంక్షేమభవన్‌లోని డీడీ చాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్ ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతుకు ముందు జరిగిన సమావేశంలో డీడీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు తమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్, కళాశాల వసతి గృహాలతో పాటు, బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వసతి గృహాలకు పోస్టింగ్‌లు ఇస్తున్నామన్నారు. ఖాళీలన్నింటిని ముందుగానే తెలియజేశామని, సంబంధిత వార్డెన్లు తమకు ఇష్టమున్న హాస్టళ్లను ఎంపిక చేసుకొని ఇచ్చిన ప్రొఫార్మలో ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా హాస్టళ్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన జాబితాను జిల్లా కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపుతామన్నారు. తుది నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓ ప్రకాష్‌రాజు, ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామచంద్రుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్ దొరస్వామి, కే బాబు, కోశాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గ్రేడ్–1 వార్డెన్లకు ఏబీసీడబ్ల్యూఓలుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు గ్రేడ్–1 బీసీ వసతి గృహ సంక్షేమాధికారులకు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూరు ఐడబ్ల్యూహెచ్ వసతి గృహ సంక్షేమాధికారిణి లక్ష్మిదేవికి పదోన్నతి కల్పించి నంద్యాలకు, మీదివేముల వసతి గృహ సంక్షేమాధికారి రోషన్నకు పదోన్నతి కల్పించి వైఎస్సార్ జిల్లా పులివెందులకు బదిలీ చేశారన్నారు. నిర్ణీత గడువులోగా వీరు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపడతారని సంజీవరాజు తెలిపారు. -
గూండాల్లా కొట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్ వార్తలు తరచుగా వినేవే. వారి మధ్య ఘర్షణలు, హత్యలు సర్వ సాధారణమే. అయితే జైల్లోని ఖైదీలకు కాపలాగా ఉండాల్సిన వార్డెన్ల మధ్య వార్ అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. గత రాత్రి తప్పతాగి, గూండాల్లా చెలరేగిపోయారు. ఓ వాహనంలో రక్తమోడేలా కొట్టుకున్న ఈ దృశ్యాలు ఇపుడు ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి. జానక్‌పురి ఏరియాలో స్థానికులందరూ చూస్తుండగానే విండ్ షీల్డ్ మీద ఢిల్లీ పోలీసు స్టిక్టర్ ఉన్న కారుల్లో పోలీసులు పరస్పరం ఎగబడి కొట్టుకున్న వైనం పోలీస్ వ్యవస్థకే అవమానకరంగా నిలిచింది. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు గుర్తు తెలియని వ్యక్తి ఈ ఉదంతాన్ని మొత్తం వీడియో చిత్రీకరించి నెట్లో పెట్టాడు. దీంతో జైల్లో ఉండాల్సిన నేరగాళ్లు బయట ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
జువైనల్ హోం వార్డెన్ల సస్పెన్షన్
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని జువైనల్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వార్డెన్లు సస్పెండయ్యారు. వివరాలు.. జువైనల్ హోమ్ లోని నలుగురు బాల నేరస్తులు ఈనెల 2వ తేదీన పరారయ్యారు. వారు పారిపోయి నాలుగు రోజులైనా ఆచూకి లభించకపోవటంతో హోమ్ వార్డెన్లు నాగేంద్ర, ప్రభాకర్‌లను ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు. -
18 గ్రహాలు
* ‘సంక్షేమాన్ని’ పట్టి పీడిస్తున్న వార్డెన్లు * వారు చెప్పిందే వేదం...లేదంటే టార్గెట్ * ఎంతటి వారైనా సరే వదిలిపెట్టరు * అధికారులు సైతం వారి చెప్పుచేతలలోనే * మెనూ తయారీలోనూ వీరిదే ‘కీ’ రోల్ * ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ వార్డెన్ ఇందూరు: వసతి గృహాల నిర్వాహకులు కొందరు విద్యార్థుల సంక్షేమాన్ని అటకెక్కించి, తమ జేబులు నింపుకుంటున్నారు. తమ శాఖకు వచ్చిన ఉన్నతాధికారి ఎవరైనా, ఎంతటి వారైనా సరే వెంటనే ముగ్గులోకి దింపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారి అండదండలతో అధికారాన్ని చేతుల లోకి తీసుకుని ఏకంగా ఆ శాఖనే శాసిస్తున్నారు 18 మంది వార్డెన్లు. వారు చెప్పినట్లు వినకపోతే, అధికారులని కూడా చూడకుండా టార్గెట్ చేస్తారని, పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయిస్తారనే విమర్శలున్నాయి విద్యా ర్థు లకందించే మెనూలోనూ వారు చేతివాటం చూపుతున్నారు. వార్డెన్ల సంఘం కూడా వారి కనుసన్నలలోనే నడుస్తుంది. వారు అంగీకరించినవారే నాయకులుగా ఎన్ని కవుతారు. గెలిపించిన నాయకుడు మాట వినకపోతే పదవి నుంచి దింపేస్తారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులలో అదనపు బాధ్యతలు ఎవరికి ఇవ్వలనేది కూడా వీరే నిర్ణ యి స్తారు. కాదని వేరేవారికి ఇస్తే ఆ అధికారితోపాటు అదనపు బాధ్యతలు తీసుకున్నవారిని వేధింపులకు గురి చేస్తారు. బెదిరింపులకు పాల్పడుతారు. ఇందుకు ఉదాహరణలెన్నో ఉన్నాయి. భయపెడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 141 సంక్షేమ వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్నింటికి వార్డెన్లు లేకపోవడంతో ఇతర వార్డెన్లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. మోర్తాడ్ మండలం బీసీ బాలుర వసతిగృహం బాధ్యతలను చౌట్పల్లి వార్డెన్ కు ఇచ్చారు. ఇది నచ్చని వార్డెన్ల సంఘం నాయకుడొకరు సదరు వార్డెన్‌ను భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ బాధ్యతలను తను తీసుకున్నారు. 18 మందిలో ఈయన కూడా ఒకరు. మెనూ తయారీ వీరి చేతిలోనే సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు పెట్టే భోజన మెనూను ప్రభుత్వం తయారు చేస్తుంది. కానీ, జిల్లాలో అమలు చేసే మెనూను మాత్రం ఈ 18 మంది వార్డెన్లే నచ్చిన విధంగా, అనుకూలంగా తయారు చేస్తున్నారు. మెనూలో కోతలు విధించి జేబులు నింపుకోవడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిజ ధరలు పెరిగాయనే సాకుతో మూడు నెలల క్రితం మెనూలోంచి ఒక గుడ్డు, ఒక అరటి పండును తగ్గించారు. ప్రస్తుతం ధరలు తగ్గినా అదే మెనూను కొనసాగిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నిం చడానికి వీలు లేకుండా వారికి నెలనెలా మూమూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ అధికారికి ఎంతివ్వాలి, సెక్షన్ ఉద్యోగికి ఎంతెంత ఇవ్వాలనేది కూడా 18 మంది వార్డెన్లే నిర్ణయించినట్లుగా తెలిసింది. సంఘ ఎన్నికలు వీరి కనుసన్నలలోనే వార్డెన్ల సంఘం ఎన్నికలు జరగాలన్నా, అందులో పోటీ చేసి గెలువాలన్నా వీరి అండదండలు ఉండాల్సిందే. సదరు వార్డెన్లు చెప్పిన వారికే ఓటు వేయాలి. తమకు అనుకూలంగా ఉన్న వారిని నాయకుడిగా ఎన్నుకుని, అతని వెనుకుండి కథంతా నడిపిస్తారు. వినకపోతే పదవీ బాధ్యతల నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ 18 మందిలో కొందరు సంఘ నాయకులుగా మారి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు అంటున్నారు. -
వసతి గృహాల్లో బయో మెట్రిక్
బద్వేలు అర్భన్: జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని 99 వసతి గృహాలకు బయోమెట్రిక్ మిషన్లతో పాటు ల్యాప్‌ట్యాప్‌లు అందజేశారు. ఈ మేరకు వీటిని ఎలా వినియోగించాలనే అంశంపై వార్డన్లకు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ విధానాన్ని అమలు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల శిక్షణ పూర్తికాగా శనివారం బద్వేలు నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ వసతిగృహ వార్డన్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రైనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఎలా సేకరించాలి, విద్యార్థుల ఆధార్‌కార్డుల అనుసంధానం ఎలాచేయాలి తదితర విషయాలపై వార్డన్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. -
పడకేసిన ‘ప్రజ్ఞ’
గూడూరు : వసతిగృహాల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు గతంలో జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన శ్రీధర్ ప్రజ్ఞ కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకుని, తదనుగుణంగా చర్యలు చేపట్టేలా ప్రజ్ఞ రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని 87 బీసీ, 156 ఎస్సీ, 25 ఎస్టీ వసతిగృహాలకు కంప్యూటర్లు అందజేశారు. ప్రతి వసతిగృహానికి నెట్ సౌకర్యం కల్పించారు. కానీ కంప్యూటర్, నెట్ వినియోగంపై వార్డెన్లకు శిక్షణ మాత్రం ఇవ్వలేదు. దీంతో అవి మూలనపడి పథకం అమలు లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తప్పని పడిగాపులు కంప్యూటర్లు వినియోగించే విధానం తెలియకపోయినా ప్రతి వసతిగృహానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. దీంతో వార్డెన్లు నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్ కోతలు, నెట్ పనిచేయకపోవడం, కంప్యూటర్లు ఖాళీగా లేకపోవడం తదితర కారణాలతో గంటల కొద్ది అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కంప్యూటర్లు అందజేసినపుడే శిక్షణ కూడా ఇచ్చివుంటే ఈ పడిగాపులు తప్పేవని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పోస్టులు ఖాళీ వసతిగృహాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి వసతి గృహానికి ఒక వార్డెన్‌తో పాటు కుక్, కామాటి, వాచ్‌మన్ ఉండాలి. కానీ చాలా వసతి గృహాల్లో తగినత మంది సిబ్బంది లేని పరిస్థితి. జిల్లాలోని 87 బీసీ వసతిగృహాల్లో 150 పోస్టులు ఖాళీనే. ఎస్సీ వసతిగృహాలు 156 ఉండగా, వాటిలో సుమారు 200 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. 25 ఎస్టీ వసతిగృహాల్లోనూ 20 పోస్టులు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. పలు వసతిగృహాల్లో వార్డెన్ ఒక్కరే ఉన్నారు. ఆయన నెట్ సెంటర్‌కు వెళితే గంటల తరబడి విద్యార్థులను పర్యవేక్షించే వారు కరువవుతున్నారు. వార్డెన్లకు కంప్యూటర్ల ఆపరేటింగ్పై శిక్షణ ఇస్తే ఈ సమస్యకు చెక్ పడుతుంది. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
గాలికొదిలేశారు
గోదావరిఖనిలోని ఓ హాస్టల్లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని ఒకరు పాపకు జన్మనిచ్చిన సంఘటన వెలుగులోకి రాకుండా హాస్టల్ సిబ్బంది, అధికారులు నానాతంటాలు పడుతున్నారు. విచారణ పూర్తి చేసినా, ఏమీ జరగనట్లు గుంభనంగా ఉండిపోయారు. ఈ సంఘటనకు బాధ్యుడు ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతోనే బయటకు పొక్కనీయడం లేదని సంక్షేమ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. వారం రోజుల క్రితం కరీంనగర్‌లోని గిరిజన బాలికల వసతిగృహంలో పనిచేసే వర్కర్ గంగూబాయి కుమారుడు రఘు ఇద్దరు విద్యార్థినులను తీసుకొని అదృశ్యమయ్యాడు. తిరిగివచ్చి అందులో ఒక విద్యార్థినిని తీసుకొని మరోసారి పారిపోయాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమ అధికారులు వార్డెన్లతో కుమ్మక్కై వారి తప్పులను కప్పిపెడుతున్నారు. ఫలితంగా సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల భద్రత గాలిలో దీపంగా మారింది. - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : వార్డెన్లు స్థానికంగా నివాసం ఉంటూ విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా జిల్లాలో పరిస్థితి మారడం లేదు. జిల్లాలోని చాలామంది వార్డెన్లు పట్టణాల్లో నివాసం ఉంటూ చుట్టపు చూపుగా హాస్టళ్లకు వచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. కొంతమంది వారాల తరబడి హాస్టల్ మొహం చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తికాదు. శంకరపట్నంలోని ఓ హాస్టల్ వార్డెన్ కరీంనగర్‌లోనే ఉంటూ, హాస్టల్ బాధ్యతను స్థానిక వర్కర్‌కు అప్పగించడం.. వార్డెన్ల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. స్థానికంగా ఉండకున్నా.. వర్కర్లపై ఆధారపడి విధులు నిర్వర్తిస్తున్నా.. వార్డెన్లపై చర్యలు లేకపోవడానికి కారణం ఊహించడం కష్టం కాదు. కాగితాల్లోనే పర్యవేక్షణ జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమశాఖ అధికారులు వార్డెన్లతో కుమ్మక్కు కావడంతో కాగితాలపైనే పర్యవేక్షణ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలలో కనీసం 20 రోజులపాటు సహాయ సంక్షేమశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో హాస్టళ్లకు వెళ్లి పర్యవేక్షించాలి. జిల్లా అధికారులు కూడా హాస్టళ్లను తనిఖీ చేయాలి. కానీ, ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. వార్డెన్లను తమవద్దకే పిలిపించుకుని ప్రతి నెలా కార్యాలయాల్లోనే ‘పర్యవేక్షణ’ చేస్తున్నారు. జిల్లా అధికారులైతే ఏదైనా సంఘటన జరిగితే తప్ప క్షేత్రస్థాయి అనే విషయమే మరిచిపోయారు. కంచే చేను మేస్తోంది.. హాస్టల్ విద్యార్థినులను కాపాడాల్సినవారే లైంగికదాడులకు దిగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో వరుసగా జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు పరిశీలిస్తే, హాస్టల్ సిబ్బంది, వార్డెన్లు, వారి బంధువులు, సన్నిహితులే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాలికలపై లైంగికదాడులకు పాల్పడడం, బయటకు పొక్కనీయకుండా బాధితులను, విద్యార్థినులను బెదిరించడం, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడం మామూలైపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొనకపోతే విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొన్ని సంఘటనలు కొన్ని నెలల క్రితం జమ్మికుంట సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో వర్కర్ చాంద్‌పాషా ఓ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరం తెలిసినా, కప్పిపుచ్చేందుకు సంబంధిత అధికారులు బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో వార్డెన్, సహాయ అధికారి, అధ్యాపకులతోపాటు లైంగికదాడికి పాల్పడిన వర్కర్‌ను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశారు. అంతకుముందు రామడుగులోని బీసీ బాలికల వసతిగృహం పరిసరాల్లో పోకిరీలు విద్యార్థినులను నిత్యం వేధింపులకు గురిచేశారు. వార్డెన్ పట్టించుకోకపోవడంతో పోకిరీల బెడద నుంచి రక్షించాలంటూ విద్యార్థినులు రాస్తారోకో చేపట్టడంతో అధికారులు మేల్కొన్నారు. జూలపల్లి బీసీ బాలికల వసతిగృహంలో సంబంధిత వార్డెన్ సమీప బంధువొకరు విద్యార్థినులపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను బయటకు పొక్కకుండా చూసినప్పటికీ... ఆ నోటా ఈ నోటా వెలుగుచూడడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. -
యూనిఫాంల డబ్బులు చెల్లించేందుకు వార్డెన్ల కొర్రీలు
సాక్షి, నల్లగొండ: బీసీ సంక్షేమశాఖ వార్డెన్లు మహిళా సంఘాల సభ్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బిల్లులు ఇచ్చేందుకు కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంల బిల్లులపై సంతకాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే సంతకాల పని పూర్తవుతుందని మొహమాటం లేకుండా చెబుతున్నారు. జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 20 బాలికల, 48 బాలుర వసతి గృహాలున్నాయి. ఈ 68 హాస్టళ్లలో మొత్తం మూడు నుంచి పదోతరగతి చదివే విద్యార్థులు 7,025మంది వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి నాలుగు జతల యూనిఫాంలు అందించాల్సి ఉంది. అయితే అందుకు సంబంధించిన వస్త్రం పూర్తిగా సకాలంలో జిల్లాకు రాకపోవడంతో ముందుగా మూడు జతలు అందజేశారు. వీటిని కుట్టే బాధ్యత మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల సభ్యులకు అప్పజెప్పారు. స్వయం ఉపాధి కల్పించేందుకు సంఘం సభ్యులకు గతంలో ఉచితం గా కుట్టుశిక్షణ ఇచ్చి యూనిఫాంలు కుట్టేపని అప్పగించారు. జతకు బీసీ సంక్షేమశాఖ నుంచి *40, మెప్మా నుంచి *4 ఇవ్వాల్సి ఉంది. కష్టాలకోర్చి.... హాస్టళ్ల వద్దే పిల్లల కొలతలు తీసుకుని, అక్కడే యూనిఫాంలు కుట్టాలని నిబంధన పెట్టారు. కొంచెం కష్టమైనా సంఘాల సభ్యులు దీనికి అంగీకరించారు. ఇంటి నుంచి పని ప్రదేశానికి నిత్యం రాకపోకలు సాగించేందుకు రవాణా చార్జీలు కూడా స్వతహాగా భరించారు. ఇవన్నీ ఖర్చులు పోయినా కొద్దోగొప్పో డబ్బులు మిగిలితే కుటుంబానికి కొంత ఆసరా అవుతుందని భావించారు. వీటన్నింటినీ భరించి నిబంధన ప్రకారమే యూనిఫాంలు కుట్టి సంబంధిత వార్డెన్లకు అప్పగించారు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నాయి. ఇంతవరకు వీరికి ఒక్కపైసా అందజేయలేదు. తిరకాసు... బిల్లులపై సంతకాలు చేయడానికి వార్డెన్లు అవస్థల పాలు చేస్తున్నారు. వచ్చే కొద్ది మొత్తంలోనే వార్డెన్లు కమీషన్లు అడుగుతున్నారని సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి కారణాలు చూపి రోజుల తరబడి హాస్టళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే డబ్బుల మాటేమోగానీ, వారికోసం తిరిగేందుకు ఆటో చార్జీలు చెల్లించి పర్సు గుల్ల చేసుకుంటున్నారు. వార్డెన్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెప్మా అధికారులు నోరు మెదపకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పర్సెంటేజీలకు కక్కుర్తి పడి మహిళలని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.