సాక్షి, నల్లగొండ: బీసీ సంక్షేమశాఖ వార్డెన్లు మహిళా సంఘాల సభ్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బిల్లులు ఇచ్చేందుకు కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంల బిల్లులపై సంతకాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే సంతకాల పని పూర్తవుతుందని మొహమాటం లేకుండా చెబుతున్నారు. జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 20 బాలికల, 48 బాలుర వసతి గృహాలున్నాయి. ఈ 68 హాస్టళ్లలో మొత్తం మూడు నుంచి పదోతరగతి చదివే విద్యార్థులు 7,025మంది వసతి పొందుతున్నారు.
ఒక్కో విద్యార్థికి ఏడాదికి నాలుగు జతల యూనిఫాంలు అందించాల్సి ఉంది. అయితే అందుకు సంబంధించిన వస్త్రం పూర్తిగా సకాలంలో జిల్లాకు రాకపోవడంతో ముందుగా మూడు జతలు అందజేశారు. వీటిని కుట్టే బాధ్యత మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల సభ్యులకు అప్పజెప్పారు. స్వయం ఉపాధి కల్పించేందుకు సంఘం సభ్యులకు గతంలో ఉచితం గా కుట్టుశిక్షణ ఇచ్చి యూనిఫాంలు కుట్టేపని అప్పగించారు. జతకు బీసీ సంక్షేమశాఖ నుంచి *40, మెప్మా నుంచి *4 ఇవ్వాల్సి ఉంది.
కష్టాలకోర్చి....
హాస్టళ్ల వద్దే పిల్లల కొలతలు తీసుకుని, అక్కడే యూనిఫాంలు కుట్టాలని నిబంధన పెట్టారు. కొంచెం కష్టమైనా సంఘాల సభ్యులు దీనికి అంగీకరించారు. ఇంటి నుంచి పని ప్రదేశానికి నిత్యం రాకపోకలు సాగించేందుకు రవాణా చార్జీలు కూడా స్వతహాగా భరించారు. ఇవన్నీ ఖర్చులు పోయినా కొద్దోగొప్పో డబ్బులు మిగిలితే కుటుంబానికి కొంత ఆసరా అవుతుందని భావించారు. వీటన్నింటినీ భరించి నిబంధన ప్రకారమే యూనిఫాంలు కుట్టి సంబంధిత వార్డెన్లకు అప్పగించారు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నాయి. ఇంతవరకు వీరికి ఒక్కపైసా అందజేయలేదు.
తిరకాసు...
బిల్లులపై సంతకాలు చేయడానికి వార్డెన్లు అవస్థల పాలు చేస్తున్నారు. వచ్చే కొద్ది మొత్తంలోనే వార్డెన్లు కమీషన్లు అడుగుతున్నారని సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి కారణాలు చూపి రోజుల తరబడి హాస్టళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే డబ్బుల మాటేమోగానీ, వారికోసం తిరిగేందుకు ఆటో చార్జీలు చెల్లించి పర్సు గుల్ల చేసుకుంటున్నారు. వార్డెన్లు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెప్మా అధికారులు నోరు మెదపకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పర్సెంటేజీలకు కక్కుర్తి పడి మహిళలని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూనిఫాంల డబ్బులు చెల్లించేందుకు వార్డెన్ల కొర్రీలు
Published Fri, Dec 13 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement