బద్వేలు అర్భన్: జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని 99 వసతి గృహాలకు బయోమెట్రిక్ మిషన్లతో పాటు ల్యాప్‌ట్యాప్‌లు అందజేశారు. ఈ మేరకు వీటిని ఎలా వినియోగించాలనే అంశంపై వార్డన్లకు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ విధానాన్ని అమలు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలోని వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి రూపకల్పన చేసింది. ఇప్పటికే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల శిక్షణ పూర్తికాగా శనివారం బద్వేలు నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ వసతిగృహ వార్డన్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రైనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఎలా సేకరించాలి, విద్యార్థుల ఆధార్‌కార్డుల అనుసంధానం ఎలాచేయాలి తదితర విషయాలపై వార్డన్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.