18 గ్రహాలు
* ‘సంక్షేమాన్ని’ పట్టి పీడిస్తున్న వార్డెన్‌లు
* వారు చెప్పిందే వేదం...లేదంటే టార్గెట్
* ఎంతటి వారైనా సరే వదిలిపెట్టరు
* అధికారులు సైతం వారి చెప్పుచేతలలోనే
* మెనూ తయారీలోనూ వీరిదే ‘కీ’ రోల్
* ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ వార్డెన్
ఇందూరు: వసతి గృహాల నిర్వాహకులు కొందరు విద్యార్థుల సంక్షేమాన్ని అటకెక్కించి, తమ జేబులు నింపుకుంటున్నారు. తమ శాఖకు వచ్చిన ఉన్నతాధికారి ఎవరైనా, ఎంతటి వారైనా సరే వెంటనే ముగ్గులోకి దింపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారి అండదండలతో అధికారాన్ని చేతుల లోకి తీసుకుని ఏకంగా ఆ శాఖనే శాసిస్తున్నారు 18 మంది వార్డెన్‌లు. వారు చెప్పినట్లు వినకపోతే, అధికారులని కూడా చూడకుండా టార్గెట్ చేస్తారని, పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయిస్తారనే విమర్శలున్నాయి విద్యా ర్థు లకందించే మెనూలోనూ వారు చేతివాటం చూపుతున్నారు.
వార్డెన్‌ల సంఘం కూడా వారి కనుసన్నలలోనే నడుస్తుంది. వారు అంగీకరించినవారే నాయకులుగా ఎన్ని కవుతారు. గెలిపించిన నాయకుడు మాట వినకపోతే పదవి నుంచి దింపేస్తారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులలో అదనపు బాధ్యతలు ఎవరికి ఇవ్వలనేది కూడా వీరే నిర్ణ యి స్తారు. కాదని వేరేవారికి ఇస్తే ఆ అధికారితోపాటు అదనపు బాధ్యతలు తీసుకున్నవారిని వేధింపులకు గురి చేస్తారు. బెదిరింపులకు పాల్పడుతారు. ఇందుకు ఉదాహరణలెన్నో ఉన్నాయి.
భయపెడుతూ
జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 141 సంక్షేమ వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్నింటికి వార్డెన్‌లు లేకపోవడంతో ఇతర వార్డెన్‌లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. మోర్తాడ్ మండలం బీసీ బాలుర వసతిగృహం బాధ్యతలను చౌట్‌పల్లి వార్డెన్ కు ఇచ్చారు. ఇది నచ్చని వార్డెన్‌ల సంఘం నాయకుడొకరు సదరు వార్డెన్‌ను భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ బాధ్యతలను తను తీసుకున్నారు. 18 మందిలో ఈయన కూడా ఒకరు.
మెనూ తయారీ వీరి చేతిలోనే
సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు పెట్టే భోజన మెనూను ప్రభుత్వం తయారు చేస్తుంది. కానీ, జిల్లాలో అమలు చేసే మెనూను మాత్రం ఈ 18 మంది వార్డెన్‌లే నచ్చిన విధంగా, అనుకూలంగా తయారు చేస్తున్నారు. మెనూలో కోతలు విధించి జేబులు నింపుకోవడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిజ ధరలు పెరిగాయనే సాకుతో మూడు నెలల క్రితం మెనూలోంచి ఒక గుడ్డు, ఒక అరటి పండును తగ్గించారు. ప్రస్తుతం ధరలు తగ్గినా అదే మెనూను కొనసాగిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నిం చడానికి వీలు లేకుండా వారికి నెలనెలా మూమూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ అధికారికి ఎంతివ్వాలి, సెక్షన్ ఉద్యోగికి ఎంతెంత ఇవ్వాలనేది కూడా 18 మంది వార్డెన్‌లే నిర్ణయించినట్లుగా తెలిసింది.
సంఘ ఎన్నికలు వీరి కనుసన్నలలోనే
వార్డెన్‌ల సంఘం ఎన్నికలు జరగాలన్నా, అందులో పోటీ చేసి గెలువాలన్నా వీరి అండదండలు ఉండాల్సిందే. సదరు వార్డెన్‌లు చెప్పిన వారికే ఓటు వేయాలి. తమకు అనుకూలంగా ఉన్న వారిని నాయకుడిగా ఎన్నుకుని, అతని వెనుకుండి కథంతా నడిపిస్తారు. వినకపోతే పదవీ బాధ్యతల నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ 18 మందిలో కొందరు సంఘ నాయకులుగా మారి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు అంటున్నారు.