మా ప్రాణాలకు ముప్పు
జమ్మలమడుగు: టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. అధికారులు కూడా అధికార పార్టీకే వత్తాసుపలుకుతున్నారు. బయటికి వెళితే తాము సురక్షితంగా ఇంటికి చెరుతామో లేదో అనే భయముంది అంటూ జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వాపోయారు. మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవగుడి గ్రామంలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లను, ఎంపీటీసీలను కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్‌మోహన్‌రెడ్డితో తమ బాధను చెప్పుకున్నారు.
మా పరిస్థితి అగమ్యగోచరం..
తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మా వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 3,4 తేదీల్లో జమ్మలమడుగులో టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న తమపై రాళ్లు విసిరారు.పట్టణంలో భయోత్పాతం సృషించారు. కౌన్సిలర్ల ఇళ్ల వద్దకు వెళ్లి భయపెడుతున్నారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆయన చెప్పారు.
ప్రజా ప్రతినిధులపైనే దాడి చేస్తున్నారు...
మున్సిపల్ ఛైర్మన్,వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపైనే కారం పొడి చల్లారు. అంతేకాకుండా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తాము వీధుల్లోకి రావాలన్నా రాలేని పరిస్థితి. వారందరూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని 15వార్డు కౌన్సిలర్ మార్తమ్మ తన ఆవేదనను వివరించారు.
ఇళ్ల ముందు కాపుకాస్తున్నారు..
టీడీపీకి చెందిన నాయకులు తమ ఇళ్లముందుకు వచ్చి కాపుకాస్తున్నారు. తమపై నిఘా పెట్టారు. తమని ఎక్కడ ఏమిచేస్తారో అనే భయంతో బతుకుతున్నాం. ఇంట్లో ఎవ్వరూ ఉండకుండా బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. అందరూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ 8వార్డు కౌన్సిలర్ వెంకటేష్ వివరించారు.
కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి..
కార్యకర్తల్లో భరోసా నింపుతూ వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరగవచ్చు. ఐదేళ్లపాటు టీడీపీ వారి అరాచకాలను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సన్నద్ధంగా ఉండాలి.
మున్సిపల్ ఛైర్మన్,వైస్‌ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి, పోలీసులు కలిసికట్టుగా అధికార పార్టీకి వత్తాసు పలికి ఎన్నికలను వాయిదా వేయించారు. రాజ్యాంగంలో ఎక్కడాలేనివిధంగా టీడీపీ నాయకులు ఫోన్‌లు చేసి చెప్పినట్లు అధికారులు కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నిక లు నిర్వహించాల్సిన అధికారి అనారోగ్యమంటూ డ్రామాలాడి ఎన్నికలు వాయిదావేస్తున్నట్లు ప్రకటించకుండా వెళ్లిపోయారు అని ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
అధైర్యపడవద్దు.. మంచి రోజులు వస్తాయి
వేంపల్లె : మంచి రోజులు వస్తాయి.. అధైర్యపడవద్దని.. దేవుని ఆశీస్సులు ఉంటే అంతా మేలు జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు చెందిన జెడ్పీటీసీలతో అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో వారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈనెల 13వ తేదీ నెల్లూరు జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో జగన్ వారితో సుదీర్ఘంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీలకు మంచి భవిష్యత్ రానుందన్నారు. డీడీఆర్‌సీ రద్దు చేయనున్నారని..జెడ్పీటీసీలదే ప్రధాన పాత్రగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని.. అధైర్యపడవద్దని చెప్పారు.