‘ఆధార్’ తెచ్చిన తంటా | 'Aadhaar' brought the Troubles | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ తెచ్చిన తంటా

Published Thu, Nov 21 2013 2:42 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

'Aadhaar' brought the Troubles

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా తయారైంది ‘తెల్ల’దొరల పరిస్థితి. తలసరి ఆదాయం అధికంగా ఉన్నా నిరుపేదలమని డిక్లరేషన్ ఇచ్చి పలువురు ప్రముఖులు తెల్ల రేషన్‌కార్డులు పొందారు. వీరిలో కొందరు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందారు. మరి కొందరు ఇతర రూపాల్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. నగదు బదిలీ రూపంలో గ్యాస్ రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే వ్యవహారంపై ఐటీ(ఆదాయపు పన్ను శాఖ) విభాగం కన్నేసింది. 1532 మంది తెల్లకార్డు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.పది లక్షలకుపైగా నగదు నిల్వ ఉన్నట్లు గుర్తించింది. వారందరికీ పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తోండడంతో ‘తెల్ల’దొరలు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీని నగదు బదిలీ పథకం కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి జూన్ ఒకటిన సర్కారు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. నగదు బదిలీ పథకం కింద గ్యాస్ కనెక్షన్ నెంబర్, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నెంబరు.. ఆధార్‌కార్డు నెంబర్‌ను సెంట్రల్ సర్వర్‌తో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో దీపం పథకంతోపాటు వివిధ చమురు సంస్థల నుంచి 5,69,958 మంది లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లను పొందారు. ఇందులో 4,91,687 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లను గ్యాస్ డీలర్లు, బ్యాంకు అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సేకరించా రు.
 
 వాటిలో 4,23,102 మంది వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబరుతో.. బ్యాంకు ఖాతా నెంబరును అను సంధానం చేశా రు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబ ర్లు ఇచ్చిన 68,585 మందికి గ్యాస్ కనెక్షన్లను అనుసంధానం చేయనట్లు స్పష్టమవుతోంది. ఇక ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించని వినియోగదారులు 78,271 మంది ఉన్నా రు. అంటే.. ఇప్పటికీ 1,46,856 మందికి సంబంధించిన ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లను అనుసంధానం చేయనట్లు స్పష్టమవుతోంది. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకున్న రెండు రోజుల్లోగానే అడ్వాన్స్ కింద రాయితీ మొత్తం జమ అవుతుంది.
 
 గత ఆర్నెల్ల కాలంలో 3.23 లక్షల మంది లబ్ధిదారులు రీఫిల్లింగ్‌కు బుక్ చేసిన సమయంలో.. రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేసినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఐటీ విభాగం అధికారులు డేగ కన్ను వేశారు. ఎవరెవరి ఖాతాలో ఎంత మొత్తం నిల్వ ఉందన్న అంశాన్ని లోతుగా పరిశీలించారు. ఇప్పటిదాకా ఐటీ విభాగం చేసిన పరిశీలనలో 1532 మంది తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.పది లక్షలకన్నా ఎక్కువ మొత్తం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. తలసరి ఆదాయం రూ.రెండు లక్షలకన్నా అధిక మొత్తం ఉన్న వారి నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో ఎవరైనా రూ.పది లక్షలకు మించి నిల్వ చేసి ఉంటే.. ఆ సమాచారాన్ని బ్యాంకు అధికారులు తక్షణమే రిజర్వు బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు ద్వారా ఐటీ విభాగం సమాచారం సేకరించి.. సంబంధిత వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేస్తారు.
 
 ఐటీ విభాగం కన్ను కప్పడం కోసం బడా బాబులు అనేక బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలో పన్ను చెల్లించే సమయంలో ఆదాయపు పన్ను శాఖకు ఓ బ్యాంకు ఖాతా నెంబరు.. గ్యాస్ నగదు బదిలీ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులకు మరొక బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చారు. ఇప్పుడు తమకు ఇచ్చిన బ్యాంకు ఖాతా నెంబరుతోపాటూ పౌరసరఫరాల శాఖకు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో నిల్వ చేసిన మొత్తాలను ఐటీ విభాగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఈ పరిశీలనలో ఇప్పటిదాకా 1532 మంది లబ్ధిదారులు రూ.పది లక్షలకన్నా ఎక్కువ మొత్తం బ్యాంకుల్లో నిల్వ చేసినట్లు గుర్తించింది. వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు ఉన్నట్లు కూడా తేలింది. పన్ను ఎగ్గొట్టిన తెల్ల‘దొర’లకు ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తోంది. తక్షణమే పన్ను చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోండటంతో వారు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ 1532 మంది తెల్లకార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఐటీ విభాగం లేఖ రాసినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement