కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి అని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావు తెలిపారు. ఆధార్‌కార్డుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను నమోదు చేసుకున్న తర్వాతే ప్రవేశం కల్పించాలన్నారు.
స్థానిక అంబేద్కర్ భవన్‌లో జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతు విద్యార్థుల రెండు ఫొటోలు, రేషన్‌కార్డులు తీసుకోవాలన్నారు. వసతి గృహాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఆయా వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలదేనన్నారు. అందరు వసతి గృహ సంక్షేమాధికారులు, నాల్గవ తరగతి సిబ్బంది, విద్యార్థులు తప్సనిసరిగా బయోమెట్రిక్ మిషన్ల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. బదిలీలకు సంబంధించి 3 నుంచి 5 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారి జాబితాలను, 5 సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారి జాబితాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.
విలీనమయ్యే హాస్టళ్లలో ప్రవేశాలు వద్దు
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23 వసతి గృహాలు విలీనమయ్యే అవకాశాలు ఉన్నందున ఆయా హాస్టళ్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవద్దని డీడీ ఆదేశించారు. విలీనం అయ్యే వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చేర్పించే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, ఈ.నాగభూషణం, సిద్దరామయ్య, గోవిందప్ప, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జెడ్.దొరస్వామి, కార్యదర్శి కె.బాబు, కోశాధికారి రాముడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రుడు, సంయుక్త కార్యదర్శి పద్మకుమారితో పాటు జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.