Govt hostels
-
బయోమెట్రిక్‌తో అక్రమాలకు చెల్లు..!
సాక్షి, నల్లగొండ: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇకనుంచి పిల్లల హాజరు అంతా బయోమెట్రిక్ పద్ధతిలోనే తీసుకుంటారు. ఏరోజు ఎంతమంది విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరువేస్తారో వారికే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో రిజిష్టర్ల ద్వారా హాజరు తీసుకునేవారు. దాంతో పిల్లలు ఉన్నా లేకున్నా ఎక్కువ రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ యంత్రాల కారణంగా అలాంటి వాటికి అవకాశాలు ఉండవు. ప్రస్తుతం కళాశాలల్లో చదవని విద్యార్థులు కూడా హాస్టళ్లలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇక నుంచి చెక్ పడనుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగలనుంది. జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 46 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉండగా 15 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు యంత్రాలను పంపించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలోని హాస్టళ్లన్నింటికీ బ యోమెట్రిక్ మిషన్లను బిగించగా దేవరకొండ డివిజన్లో ఇంకా కొనసాగుతోంది. వారం రోజుల్లోగా అన్ని హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషన్లను బిగించనున్నారు. బయోమెట్రిక్ ద్వారానే హాజరు.. గతంలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల ద్వా రా కొనసాగేది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల కంటే ఎ క్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా పేర్లు రాసుకోవడం.. వారు ఇళ్లకు వెళ్లినా ఉన్నట్లుగా నమోదు చేసి.. కొం దరు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పుడు బిల్లులు పొందేవారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంతో గండి పడేది. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ మిషన్ల కారణంగా అలాంటి వాటికి చెక్ పడనున్నాయి. ఏరోజు బిల్లు ఆరోజే జనరేట్ హాస్టల్లో విద్యార్థి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తారు. దాంతో ఆరోజులో ఎంతమంది విద్యార్థులు ఆ హాస్టల్ నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రవేస్తారో వారికి హాజరు ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఆ రోజే పిల్లలు చేసిన భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్ అవుతుంది. అలా నెల రోజులపాటు హాజరైనటువంటి విద్యార్థులకు సంబంధించి బిల్లులను నెలనాడు సంబంధింత హాస్టల్ వెల్ఫేర్ అధికారి తీసుకొని బిల్లుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదివే పిల్లలకే భోజనం.. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిన హాజరు తీసుకోవడం వల్ల కొన్ని హాస్టళ్లలో వార్డెన్లకు నచ్చజెప్పి కొందరు విద్యార్థులు ఉంటున్నారు. కొందరు చదువుకుంటుండగా మరికొందరు ఊరికే హాస్టల్లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హాస్టల్ అధికారులను కూడా బెదిరించిన హాస్టల్లో ఉంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బయోమెట్రిక్ విధానం అమలైతే.. ఇక బయటి వ్యక్తులు హాస్టల్లో ఉంటే వారికి భోజనం పెట్టలేని పరిస్థితి. ఒకవేళ పెట్టినా అతనికి సంబంధించిన బిల్లురాదు. దాంతో అధికారే జేబు లో నుంచి కట్టాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో వారు హాస్టల్లో భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. చదువుకునే పిల్లలే హాస్టల్లో ఉండే అవకాశం రానుంది. బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తున్నారు.. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో యాంత్రాల బిగింపు పూర్తయింది. దేవరకొండ డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తి కాగానే విద్యార్థులకు నెంబర్ అలాట్ చేసి ఆతర్వాత బయోమెట్రిక్ ద్వారా ప్రతి రోజూ హాజరు నమోదు చేస్తాం. – రాజ్‌కుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ -
మన ఆస్పత్రి భేష్..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొండాపూర్‌లోని మన జిల్లా ఆస్పత్రి వైద్య సేవల్లో ముందంజలో నిలిచింది. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, రోగులకు డాక్టర్ల మధ్య సంబంధాలు, రోగుల సంతృప్తి, ఆస్పత్రిలో శుభ్రత, మౌలిక వసతులు, సేవల్లో పారదర్శకత తదితర అంశాల్లో ఏ స్థాయిలో మెరుగ్గా ఉన్నాయో తెలుసుకునేందుకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ‘కాయకల్ప్–2018’ పేరిట సర్వే చేయించింది. గతేడాది డిసెంబర్లో ఈ సర్వే జరిగింది. ఒక జిల్లా ఆస్పత్రి వైద్యులతో ఇతర జిల్లాలోని ఆస్పత్రులను పరిశీలన చేయించి అంశాల వారీగా స్కోర్ కేటాయించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లా ఆస్పత్రులు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అధికారుల బృందాలు పరిశీలించాయి. వీరు ఇచ్చిన నివేదిక ప్రకారం మన జిల్లా ఆస్పత్రి అన్ని అంశాల్లోనూ మెరుగ్గా ఉంది. 81 శాతం స్కోర్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. అవార్డుకు అడుగు దూరంలో.. అత్యుత్తమ స్కోర్ సాధించిన జిల్లా ఆస్పత్రి అవార్డు అందుకోవడానికి అడుగు దూరంలో ఉంది. జిల్లాస్థాయిలో ఉత్తమంగా నిలవగా.. ఇక రాష్ట్రస్థాయిలో పోటీపడుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీంను ఈనెల 8న నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) జిల్లా ఆస్పత్రికి పంపించనుంది. ఈ అధికారులు మరింత సూక్ష్మంగా అన్ని అంశాలను పరిశీలించి స్కోర్‌ని కేటాయిస్తారు. ఈ స్కోర్ సాధించడంలో మన ఆస్పత్రి ముందుంటే ఎన్హెచ్ఎం అందజేసే అవార్డుకు అర్హత సాధించినట్లే. ఇది సాకారమైతే ప్రత్యేక నిధులు కూడా ఆస్పత్రికి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. క్రమంగా మెరుగు.. మన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు, వసతులు క్రమంగా మెరుగు పడుతూ వస్తున్నాయి. భవనాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ హాస్పిటల్‌ను తలపిస్తున్న ఈ ఆస్పత్రిలో రోగుల భద్రతకూ ప్రాధాన్యత ఇస్తుండడం విశేషం. 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆస్పత్రిని పూర్తిగా చిత్రీకరిస్తూ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రి ఆధ్వర్యంలో బయట సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య విద్య, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పురుషులు, స్త్రీ వ్యాధి సంబంధ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి కేటాయించిన కౌంటర్ వద్ద ఓపీ స్లిప్పులు రాయించుకుని సంబంధిత డాక్టర్‌ను సంప్రదించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విధానం వల్ల వేగంగా రోగుల రిజిస్ట్రేషన్ జరుగుతోంది. వరుసలో నిలబడాల్సిన పనికూడా లేదు. పెరుగుతున్న రోగుల తాకిడి.. ఇక్కడి వైద్య సేవలు, వసతులు రోగులను ఆకర్షిస్తున్నాయి. దీని ఫలితంగానే ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో నిత్యం 400 మంది అవుట్ పేషంట్లు వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 550 దాటుతోంది. నిత్యం 120 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. ప్రతి రోజు నాలుగు వరకు కాన్పులు అవుతున్నాయి. గైనకాలజీ, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థో విభాగాల సేవలు అందుతున్నాయి. అంతేగాకుండా ఆప్తమాలజీ విభాగాన్ని ఆధునీకరించారు. అవార్డు మనకే.. జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇక్కడున్న వసతులను పరిగణనలోకి తీసుకుంటే అవార్డు మనకే దక్కుతుందనడంలో సందేహం లేదు. అందరి సహకారంతోనే రాష్ట్రస్థాయిలో మన ఆస్పత్రికి మంచి స్కోర్ వచ్చింది. తొలుత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చడానికి ఎంతో శ్రమించాం. ఆయా విభాగాలను ఆధునీకరించి రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ ఎ.వరదాచారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బడుగు విద్యార్థుల సంక్షేమం పట్టదా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు సంక్షేమ హాస్టళ్ళను గాలికి వదిలేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 5,765 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 8,70,000 మంది పిల్లలు చేరి చదువుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా వార్షిక బడ్జెట్ వుంది. కానీ సంక్షేమ హాస్టళ్ళు మాత్రం నలభై రెండు శాతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒక్కొక్క గదిలో పది మంది పిల్లల్ని కుక్కారు. ఒక్కొక్క బాత్రూమ్ను ముప్పై మందిదాకా ఉపయోగిస్తున్నారు. బాత్రూమ్లు ఎప్పటివో. హాస్టళ్ళ క్యాంపస్‌లోకి వెళితే దుర్వాసన. వంటగది అంతా ఈగల మయం. పిల్లల శరీరం నిండా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులతో గోళ్ళు పెంచుకొని గీకటం వల్ల రక్తపు మరకలు వారి శరీరం మీద కనపడుతున్నాయి. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 52 మంది ఒక బాత్రూమ్ లోనే స్నానం చేయాలి. ఈ సంవత్సరం 10 వేలమంది ఆడపిల్లలు ఈ దుర్భర పరిస్ధితులు భరించలేక చదువు కూడా మానుకున్నారు. యాభైశాతం హాస్టళ్ళకు మంచి నీళ్ళు లేవు. హాస్టల్లో చదివే ఆడపిల్లలకు అయితే నూటికి తొంభైతొమ్మిది మందికి తగిన పాళ్లలో రక్తం లేదు. ఉడికీ ఉడకని అన్నంతో కడుపులో నొప్పి. చింతపండు బాగా పిసికిన చారు పోయడంతో విపరీతమైన కడుపు మంటలు, అల్సర్లు. పిల్లలకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. చంద్రబాబు తన మనవడికి పట్టువస్త్రాలు కట్టి, టోపీలు పెట్టి, రత్నాలతో కూడిన దండలు వేసి తిరుపతి వేంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శనలు చేయిస్తున్నారు. కానీ తన పరిపాలనలో ఉన్న పిల్లలకు దుప్పట్లు లేక చలికి గజగజవణుకుతూ ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాణ్ని కరుచుకొని పడుకుంటున్నారని తెలియదా! ఈ హాస్టళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలు వుంటారని వాళ్ళకు తెలుసు. ఈ పిల్లలు చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండటం పాలకులకు ఇష్టం లేదనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల వసతి గృహాలకు వినియోగించాల్సిన డబ్బు 33% ఖర్చుకాకుండా మిగిలిపోయింది. అంటే ఎస్సీ, ఎస్టీ పిల్లల సంక్షేమంపై ఖర్చు పెట్టకూడదు, వీళ్ళకు విద్య రాకూడదు, వీళ్ళు మెరుగ్గా ఉండకూడదు, వీళ్ళు కళగా ఉండకూడదు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండకూడదనే ఫ్యూడల్ భావజాలం సీఎంలిద్దరికీ ఉంది. 2017–18లో విషజ్వరాలతో హాస్టళ్ళ నుంచి పదివేల మంది విద్యార్థుల వరకు ఇళ్ళకు వెళ్ళిపోయారు. నలభై శాతం మంది విరోచనాల బారిన పడ్డారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళంటే బందెల దొడ్లనీ, కిటికీల తలుపులు సరిగా లేక కుక్కలు వచ్చి అక్కడ పడుకుంటాయని, మంచాలు దుప్పట్లు లేక గచ్చు బండల మీద ఒట్టి ఒంటితో విద్యార్ధులు పడుకుంటారని కాగ్, లోకాయుక్త సంస్ధలు తమ రిపోర్టులో పేర్కొన్నాయి. హైకోర్టు ఆరేళ్ళ క్రితమే హాస్టళ్ళ మీద దాఖలైన పిటిషన్ మీద విచారిస్తూ ‘ఈ పిల్లలు మనుషులు కాదా, పాలకులకు మానవత్వం లేదా?’ అని వాఖ్యానించింది. జ్ఞానం విషయం అలా ఉంచి, బడుగు పిల్లల పట్ల కనీసం కరుణ, మానవత్వం కూడా లేవని బాబు నిత్యం నిరూపించుకుంటున్నారు. ఏపీ రాష్ట్రంలో శిశువులను కనలేక తల్లులు, తల్లి ప్రసవంలోనే పిల్లలు వేలాది మంది చనిపోతున్నారు. వీరందరూ బడుగు జీవుల పిల్లలే కదా! కొందరు మరింత కోటీశ్వరులు కొందరు మరింత పేదలు అవ్వడానికి బాబు కారణం కాదా? పసుపు కుంకుమల పేరుతో డ్వాక్రా మహిళలకు 10 వేల ఫండ్ ఇస్తానంటున్నారు కానీ దాని కంటే మద్యపాన నిషేధం చేస్తే కుటుంబం, ఊళ్ళు బాగుపడతాయి కదా! తాను ఎన్నికల్లో గెలవడం కోసమే బెల్టు షాపులను ఉధృతంగా పెంచుతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో ఆరు లక్షల మంది అమ్మాయిలు లేత వయస్సులో భర్తలేని వారు కావడానికి బాబు మద్యవిధానం కారణం కాదా! అంబేడ్కర్ పాలకునికి సామాజిక న్యాయ దృష్టి ఉండాలని చెప్పాడు. రాజ్యాంగం బడుగుల విద్యా వ్యవస్ధకు పటిష్టమైన పునాదులు ఏర్పరచింది. సంక్షేమ రాజ్యం అంటే విద్యా, వైద్య రంగాల్ని నిరంతరం ప్రజ్వలింప జేయడం. కానీ లక్షల మంది బడుగు పిల్లల శరీర శక్తిని, మానసిక శక్తిని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు రాజ్యాంగ లక్ష్యాలనే నిరాకరిస్తున్నారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా బడుగు జీవుల సంక్షేమాన్ని తెలుగు నేలను పాలిస్తున్న పాలకులు తూట్లు పొడుస్తున్నారు. ఓటు పునాదిగా ఉన్న రాజకీయాలు, ఓట్లు లేనివారి జీవన విధ్వంసానికి పూనుకుంటున్నాయనే చారిత్రక సత్యాన్ని గమనించి నూతన సామాజిక విప్లవానికి అందరు సన్నద్ధం కావాల్సిన సమయం ఇది. చరిత్ర నియంతలను కూలుస్తుంది. ప్రజాస్వామ్య వాదులకు పట్టం గడుతుంది. అసలైన వ్యక్తిత్వ నిర్మాణానికి రాజ్యాంగమే గీటురాయి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు‘ 98497 41695 డా‘‘ కత్తి పద్మారావు -
పైసా విదల్చలేదు !
సాక్షి,హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతి గృహాలు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. నెలవారీ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వాటి నిర్వహణ గందరగోళంగా మారింది. నిధుల లేమితో హాస్టళ్లను నిర్వహించలేమని వసతిగృహ సంక్షేమాధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు 1,956 వసతిగృహాల్లో దాదాపు 2లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతిగృహాల్లో వీరికి ఉదయం పాలు, స్నాక్స్‌తో పాటు సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్నం మాత్రం పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటారు. ఈమేరకు ప్రభుత్వం నెలవారీగా వసతిగృహ సంక్షేమాధికారులకు నిధులు విడుదల చేస్తుంది. సాధారణంగా ఈ హాస్టళ్లకు ముందస్తు నిధులు కాకుండా నెల గడిచిన తర్వాత నిధులివ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి హాస్టల్‌కు కావాల్సిన సరుకులను అరువుపై తెచ్చి నిర్వహిస్తున్నారు. నెల గడిచిన వెంటనే బిల్లులు సమర్పిస్తే...ఆమేరకు ప్రభుత్వం నిధులిచ్చేది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నిధుల సమస్యతో హాస్టళ్లు సతమతమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లకు తొలి మూడు నెలలు అరకొరగా నిధులు విడుదలైనప్పటికీ...బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లకు మాత్రం ఇప్పటివరకూ పైసా అందకపోవడంతో ఆయా వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలకు నిలిచిపోయిన నిధులకు సంబంధించి మెస్‌చార్జీలే అధికంగా ఉన్నాయి. విద్యుత్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, తదితర నిర్వహణకు సంబంధించిన బిల్లులు కూడా పెడింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిలు దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్లు సంక్షేమాధికారులు అంచనా వేస్తున్నారు. కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో షాపు యాజమానులు సరుకులు నిలిపివేస్తున్నారని సంక్షేమాధికారులు చెబుతున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వడాన్ని నిలిపివేశారని మేడ్చల్ జిల్లాకు చెందిన వసతిగృహ సంక్షేమాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. -
విద్యార్థుల భోజనంలో ఎలుక చర్మం
సాక్షి, అమరావతి/ వైఎస్ఆర్ : ప్రభుత్వ పాఠశాలలో భోజన తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. జిల్లాలోని సరోజిని నగర్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వడ్డించే పప్పులో సోమవారం ఎలుక చర్మం, పేగులు వచ్చాయి. పిల్లలకు వడ్డించే భోజనంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీన్ని బట్టిచూస్తే అర్థమవుతోంది. భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 100 పాఠశాలలకు ఇదే సంస్థ భోజనాన్ని పంపిణీ చేస్తోంది. కాగా భోజన తయారిని ప్రభుత్వం ప్రయివేటీకరించడం ప్రజలు తీవ్రంగ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల మిడ్ డే మీల్స్‌లో ఎలుక చర్మం పేగులు
-
ఆధార్ ఉంటేనే హాస్టళ్లలో ప్రవేశం
కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి అని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావు తెలిపారు. ఆధార్‌కార్డుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లను నమోదు చేసుకున్న తర్వాతే ప్రవేశం కల్పించాలన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతు విద్యార్థుల రెండు ఫొటోలు, రేషన్‌కార్డులు తీసుకోవాలన్నారు. వసతి గృహాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఆయా వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలదేనన్నారు. అందరు వసతి గృహ సంక్షేమాధికారులు, నాల్గవ తరగతి సిబ్బంది, విద్యార్థులు తప్సనిసరిగా బయోమెట్రిక్ మిషన్ల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. బదిలీలకు సంబంధించి 3 నుంచి 5 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారి జాబితాలను, 5 సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారి జాబితాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. విలీనమయ్యే హాస్టళ్లలో ప్రవేశాలు వద్దు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23 వసతి గృహాలు విలీనమయ్యే అవకాశాలు ఉన్నందున ఆయా హాస్టళ్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవద్దని డీడీ ఆదేశించారు. విలీనం అయ్యే వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చేర్పించే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, ఈ.నాగభూషణం, సిద్దరామయ్య, గోవిందప్ప, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జెడ్.దొరస్వామి, కార్యదర్శి కె.బాబు, కోశాధికారి రాముడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రుడు, సంయుక్త కార్యదర్శి పద్మకుమారితో పాటు జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం
విజయవాడ: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను రావెల తనిఖీ చేశారు. అనంతరం రావెల మాట్లాడుతూ... వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 -425- 1352 కు కాల్ చేయాలని హాస్టల్ విద్యార్థులకు రావెల సూచించారు.