
నేటి నుంచి వాహనాలకు ఆధార్ సీడింగ్
విజయవాడ : నగరంలోని ఐదు పెట్రోలు బంకుల ద్వారా బుధవారం నుంచి వాహనదారుల ఆధార్ సీడింగ్ నమోదు ప్రక్రియను అధికారి కంగా ప్రారంభిస్తున్నామని జిల్లా రవాణా కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. స్టేట్ గెస్ట్‌హౌస్ ఆవరణలో మెప్మా కార్యాలయంలో డేటా సేకరణకు నియమితులైన ఔత్సాహిక యువతకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రతి వాహనదారుడి ఆధార్ నంబర్ సేకరించి కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వివరాలను అందజేయాలని కోరారు. ఈ ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా నిరుద్యోగ యువతతో నెల రోజుల్లో డేటా సేకరణ పూర్తిచేస్తామన్నారు.
విజయవాడలో 4.50 లక్షల వాహహ హనాలు అధికారికంగా రోడ్లపై తిరుగుతున్నాయని డీటీసీ తెలి పారు. ప్రతి వాహన చోదకుడు తన వాహనం రిజిస్ట్రేషన్, లెసైన్స్, ఆధార్‌లకు సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. బెంజిసర్కిల్‌లో ఐవోసీ, చెన్నుపాటి, సీతారాంపురం, ఐలాపురం, గారపాటి, స్వగృహఫుడ్ ప్రాంతాల్లోని పెట్రోలు బంక్‌ల్లో ఈ కాపీలను అందించాలని కోరారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వివరాలు సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా ఒక బాక్స్ ఏర్పాటు చేసి, వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆధార్ నమోదు చేసే ప్రతి బంక్‌ను ఒక మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ సిబ్బంది సమన్వయం చేసుకుంటారని ఆయన తెలిపారు. మోప్మా ప్రాజెక్టు డెరైక్టర్ వి.హిమబిందు మాట్లాడుతూ ప్రథమంగా వికలాంగ సమాఖ్య సభ్యులను ఆధార్ సీడింగ్ నమోదుకు ఎంపిక చేశామని తెలిపారు. రవాణాశాఖ సిబ్బంది ఎం.శ్రీనివాస్, టి.వి.ఎన్.సుబ్బారావు, మెప్మా సిబ్బంది సిహెచ్.మాధవి, ఎం.దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.