ఆధార్ లింకు
Published Mon, Feb 3 2014 3:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: నగదు బదిలీ విషయంలో జిల్లాలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సిలిండర్ల సంఖ్య పెంచడంతోపాటు ఆధార్ లింకు తెంచేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు ఇంకా పాత పద్ధతినే అనుసరిస్తున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ఇక నుంచి ఆధార్‌తో సంబంధం లేకుండా అందరికీ నేరుగా సబ్సిడీ ధరకే సిలిండర్ సరఫరా చేస్తారని, అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలైన ఫిబ్రవరి, మార్చి నెల ల్లో ఒక్కో సిలిండర్ అదనంగా సబ్సిడీపై ఇస్తారని ప్రకటించింది. అదే సమయంలో సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ.105 తగ్గించింది. ధర తగ్గింపును ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెచ్చి రూ.1206కే సిలిండర్ సరఫరా చేస్తున్నారు.
సబ్సిడీ సిలిండర్ల పెంపు, నగదు బదిలీ ఉపసంహరణ విషయాన్ని మాత్రం ఇంధన సంస్థలు, ఏజెన్సీలు విస్మరించాయి. ఇప్పటివరకు ఉన్న విధానంలోనే ఆధార్ అనుసంధానం చేయించుకున్నవారికి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ అవుతుండగా, మిగిలిన వారందరికీ ఆధార్ అనుసంధానం చేయించుకోకున్నా గ్యాస్ సరఫరా చేస్తున్నారు. అయితే వీరికి సబ్సిడీ మొత్తం జమ కావడం లేదు. ధర పెంపు, తగ్గింపు నిర్ణయాలను గంటల వ్యవధిలోనే అమల్లోకి తెస్తున్న ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మాత్రం రోజుల తరబడి అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నాయి. ఇదేమిటని అడిగితే.. తమకు చమురు సంస్థల నుంచి ఉత్తర్వులు రాలేదని ఒకసారి, ప్రభుత్వం నుంచే చమురు సంస్థలకు ఉత్తర్వులు రాలేదని మరోసారి ఏజన్సీ ప్రతినిధులు చెబుతున్నారు.
వాణిజ్య సంస్థలకు ప్రయోజనం
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే.. మార్చి 31లోగా ప్రతి వినియోగదారునికి 12 సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేస్తామని మాత్రం చెబుతున్నారు. 2013 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మూడు సిలిండర్లనే విడిపించుకున్నవారు సైతం మార్చి 31లోగా మిగిలిన తొమ్మిది సిలిండర్లను విడిపించుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. ఇదివరలో ఓ సిలిండర్ విడిపించుకున్న 21 రోజుల తరువాత గాని మరో సిలిండర్ బుక్ చేసుకొనే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం అటువంటి గడువు ఏమీ లేకపోవడంతో వెంటవెంటనే విడిపించుకొనే సౌలభ్యం ఏర్పడింది. దీన్ని కొన్ని వాణిజ్యసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. వాణిజ్య సిలిండర్ స్థానంలో వినియోగదారుల నుంచి వంట గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ను రూ.900కు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల వినియోగదారునికి రూ.400 వరకు లాభం చేకూరుతుండగా వాణిజ్య సంస్థలకు కూడా రూ.500 పైగాఆదా అవుతోంది. అంతిమంగా చమురు సంస్థలు, ఏజెన్సీల విధానాలు అక్రమార్కులకే ప్రయోజనం చేకూర్చుతున్నాయి.
Advertisement