త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కూడా...
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ అనుసంధానం పరంపరలో మరో అంశంకూడా వచ్చి చేరింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా ఆధార్‌నెంబర్ తో అనుసంధానం ప్రక్రియను అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. త్వరలోనే డ్రైవింగ్ లైసెన్సులతో ఆధార్‌ను అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు.
డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017లో శుక్రవారం మాట్లాడుతూ రవిశంకర్ ప్రసాద్ ఈ సంకేతాలిచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ తో కూడా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ లింకింగ్‌కు ఎలాంటి గుడువును కేంద్ర మంత్రి వెల్లడించలేదు. డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ లింకింగ్ పై ఆలోచిస్తున్నామని దీనిపై కేంద్ర మంత్రి నితిన్‌గడ్కర్‌తో చర్చించినట్టు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో డిజిటిల్ ఐడెంటిటీ ద్వారా వ్యక్తిగత గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. అలాగే నగదు అక్రమ లావాదేవీల నిరోధానికి పాన్‌తో ఆధార్ అనుసంధానం అవసరమని చెప్పారు. ఆధార్ అనుసంధానం, గోప్యత ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకముందే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.