సాక్షి, ఒంగోలు : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు లింకు పెట్టొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును కాదంటూ.. ప్రతీ పథకానికి ఆధార్(రం) ఉండాల్సిందేనంటూ పట్టుబడుతోంది. తాజాగా ప్రజా పంపిణీ సరుకులను ఆధార్ నమోదు ద్వారానే కొనసాగించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు.
ఈ మేరకు జిల్లా అధికారులు మంత్రి ఆదేశాలను తూ.చా తప్పకుండా అమలుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ ఏజెన్సీలు ఆధార్ నమోదు లేకుంటే బుకింగ్ చేయమంటూ వినియోగదారులకు చెబుతున్నాయి. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం సవాలక్ష మార్గాలను అన్వేషిస్తోందని సర్వత్రా విమర్శిస్తున్నారు. మీ-సేవా కేంద్రాల్లో ఆధార్ సీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినా వినియోగదారులు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ముందుకురాలేకపోతున్నారు. గతంలో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ కార్డు లేకపోయినా ఫర్వాలేదని భావించారు. మళ్లీ ఆధార్ అనుసంధాన ప్రక్రియ తెరమీదికి తేవడంతో పేదలు మీ-సేవా కేంద్రాలకు పరిగెడుతున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్లు వచ్చే వరకూ గ్యాస్ సిలిండర్‌లతో పాటు ప్రజా పంపిణీ సరుకులు నిలిపివేయరాదని కోరుతున్నారు.
సగానికి సగమే..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాల సంఖ్య నామమాత్రంగా ఉంది. జిల్లా జనాభా 33 లక్షలకు పైగా ఉండగా గ్రామాల్లో ఐరీష్ పరీక్షతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. చాలామంది మీ-సేవాకేంద్రాల్లో ఐరీష్ తీయించుకున్నా వారికి ఆధార్‌కార్డులు పోస్టల్ సర్వీసు ద్వారా చేరలేదు. తప్పులతడకతో జారీ అయిన కార్డులను మళ్లీ మార్చుకునే ప్రక్రియ గురించి వినియోగదారులకు సరైన సమాధానమిచ్చే అధికారి కరువయ్యాడు.
దీంతో చాలామంది లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆధార్‌కార్డు అనుసంధానం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు అనుసంధానమైన కార్డుదారుల వివరాల్లోకొస్తే.. జిల్లాలో మొత్తం 29 లక్షల 9 వేల 116 కుటుంబాలు ఉండగా జూలై ఆఖరు వరకు 16 లక్షల 24 వేల 981 కుటుంబాలు మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నాయి. అంటే 58శాతం మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా జిల్లాలో 59 ఎల్‌పీజీ గ్యాస్ కంపెనీలు ఉండగా వాటి పరిధిలో 6,1,115 మంది వినియోగదారులు ఉన్నారు.
వీరిలో 4,81,083 మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్‌కార్డుల ఆనుసంధాన ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకుమార్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. పేదలు మాత్రం ప్రస్తుతం ప్రజాపంపిణీ దుకాణాల నుంచి తీసుకున్న సరుకుల్ని ఆధార్ సాకుతో నిలిపివేయడం ఎంతవరకు సబబంటూ నిలదీస్తున్నారు. అనుసంధాన ప్రక్రియకు తమకు కొద్ది రోజులు గడువుఇవ్వాలని సర్వత్రా కోరుతున్నారు.
ఆధార్.. బేజార్
Published Fri, Aug 8 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement