
ఆర్టీఏకూ ‘ఆధార్’మే!
- రవాణా శాఖ సేవలకు ఆధార్ లింక్
- ప్రత్యేక కౌంటర్లలో నమోదు
- జిల్లాలో 9 లక్షల మంది వాహనదారులు
- ఆధార్ నమోదు చేసుకున్న వారు 5 వేల మంది మాత్రమే
సాక్షి, విజయవాడ : ఇకపై రవాణాశాఖ ద్వారా పొందే ప్రతి సేవకూ ఆధార్ నంబరు జతచేయాల్సిందే. ఆశాఖ అందించే పౌరసేవల్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ ద్వారా వినియోగించుకునే ప్రతి సేవకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే నిబంధన అమలుచేయడంతోపాటు గతంలో డ్రైవింగ్ లెసైన్స్ పొంది, వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి.
ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లా కొనసాగిస్తున్నారు. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రతి లెసైన్స్‌దారు, వాహన యజమాని ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయంచుకోవాలి. రవాణాశాఖ కార్యాలయాలతోపాటు నేరుగా ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు.
ఇప్పటివరకు జిల్లాలో ఐదు వేల మంది వాహనదారులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేసుకున్నారు. మొత్తం జిల్లాలో 9 లక్షల మంది వాహనదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా విజయవాడ నగరంలోనే 5 లక్షల మంది ఉన్నారు. మిగిలిన నాలుగు లక్షల మంది జిల్లాలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం ఆధార్ కార్డులపై నిర్వహించిన సర్వే ద్వారా జిల్లాలో సుమారు 95 శాతం మందికి ఆధార్ కార్డులున్నట్లు నిర్థారించారు.
ఈ క్రమంలో జిల్లాలో ఉన్న 9 లక్షల మంది వాహనదారులు విధిగా ఆధార్ నంబర్ నమోదు చేయించుకునేలా ఏర్పాట్లు చేయడంతోపాటు కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా రవాణాశాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి లైఫ్ టాక్స్ చెల్లింపు వరకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి.
డ్రైవింగ్ లెసైన్స్‌లు మొదలుకొని ఎన్‌వోసీ వరకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ప్రతి సేవకు సంబంధించి దరఖాస్తులో ఆధార్ నంబర్ నమోదు కాలమ్ తప్పనిసరిగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లెసైన్స్ నమోదు చేసుకునేప్పుడు, డీలర్ వద్ద కొత్తవాహనం కొనుగోలు చేసే సమయంలోనూ, ఇతర లావాదేవీలు నిర్వహించే సమయంలోనూ ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
వాహన రికార్డుల భద్రత కోసమే
వాహన రికార్డుల భద్రత కోసమే ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసినట్లు రవాణాశాఖ ప్రకటించింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఙానంతో నకిలీ సీబుక్‌లు సృష్టించి ఏటా వందల సంఖ్యలో వాహనాలను విక్రయిస్తున్నారు. ఆధార్ నంబర్ లింక్ చేయడం ద్వారా దీనిని కొంతమేరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆధార్ నంబర్ నమోదు చేశాక వినియోగదారుడికి రవాణాశాఖ కార్యాలయంలో అకౌంట్ ఏర్పడుతుంది.
తర్వాత నిర్వహించే ప్రతి లావాదేవీ సులభతరమవుతుంది. దీంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్ డాట్ ఆర్గనైజేషన్ వైబ్‌సెట్‌లో నేరుగా నమోదు చేసుకోవచ్చని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ సీహెచ్.శివలింగయ్య సాక్షికి తెలిపారు. దీనిపై జిల్లాలో రెండు ఆర్టీవో కార్యాలయాలు, నాలుగు యూనిట్ ఆఫీసుల ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు నమోదు కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు వేల మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని చెప్పారు.