సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.25 కోట్ల ‘బండ’ భారం పడనుంది. నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ పొందేందుకు గాను ఆన్‌లైన్‌తో లింకయ్యేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈనెల 31తో ముగుస్తుండగా, జిల్లాలో ఇప్పటివరకు 40 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఆన్‌లైన్ చేయించుకున్నారు. మిగిలిన 60 శాతం మంది వివిధ కారణాలతో ఆన్‌లైన్‌తో లింకు కాలేకపోయారు. ఇందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, జిల్లాలో అందరికీ ఆధార్ కార్డులు అందకపోవడం, ఉన్నవాటిలోనూ తప్పులు దొర్లడం, బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపై అవగాహన లోపించడం వంటి కారణాలున్నాయి.
అయితే ఈనెల 31 తర్వాత ఆన్‌లైన్‌తో లింకు కాకుండా గ్యాస్ కొనుగోలు చేయాలంటే రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చే రూ.870 రాదు. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాలో ఆన్‌లైన్‌తో లింక్ కాని మూడు లక్షల మంది వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు భారం మోయాల్సిందే. గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఆధార్‌కార్డు నకలును సమర్పించి ఆన్‌లైన్‌తో లింకయ్యేంతవరకు ఈ నష్టాన్ని భరించాల్సిందే.
లింకు లెక్కలివే...
జిల్లాలోని 39 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,16,386 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో మంగళవారం నాటికి ఆధార్ కార్డుతో లింకయిన వారి సంఖ్య 3, 20, 874 మాత్రమే. వీరిలోనూ అందరూ బ్యాంకుతో లింకు కాలేదు. బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, బ్యాంకులకు ఆధార్‌కార్డు నకలు సమర్పించని కారణంగా మరో లక్ష మంది ఇంకా బ్యాంకులకు లింక్ కాలేకపోయారు. ఇప్పటివరకు ఆధార్‌తో పాటు బ్యాంకులకు కూడా లింకయిన జిల్లా గ్యాస్ వినియోగదారుల సంఖ్య 2,06,846 మాత్రమే. అంటే మొత్తం వినియోగదారుల్లో ఇది కేవలం 40 శాతమే.
మిగిలిన 60 శాతం వినియోగదారులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్యాస్ బండను సబ్సిడీ లేకుండా రూ.1350 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి కేవలం రూ.480కే గ్యాస్‌బండ లభిస్తుండగా, వచ్చే నెల ఒకటి నుంచి మాత్రం ఆన్‌లైన్‌తో లింకయిన వారి తరహాలోనే మొత్తం చెల్లించి కొనుక్కోవాల్సిందే. కానీ, ఆన్‌లైన్‌తో లింకులేని వారికి సబ్సిడీ రాదు. మొత్తం చెల్లించి కొనుక్కున్న తర్వాత ఆన్‌లైన్‌తో లింకు అయినప్పటికీ.. అప్పటి నుంచే సబ్సిడీ ఇస్తారు.
అంటే ఒక నెల రూ.1350 పెట్టి బండ కొన్నా సబ్సిడీ కింద రావాల్సిన రూ.870 నష్టపోవాల్సిందే. ఈ లెక్కన ఆన్‌లైన్‌తో లింకు కాని 3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు సబ్సిడీ పోగొట్టుకుంటారు. అంటే జిల్లాపై ఒక్క నెలలో పడే గ్యాస్‌బండ భారం రూ.25 కోట్లు అన్నమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ గ్యాస్ వినియోగదారులకు శాపంగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతుకు బండిని లాగలేకపోతుంటే ఇప్పుడు బండ భారం అదనంగా మోయాల్సిన దుస్థితి ఏర్పడింది.
గడువు పెంచే అవకాశం లేదు: డీఎస్‌వో
గ్యాస్ సబ్సిడీ పొందేందుకు గాను ఆధార్, బ్యాంకు అకౌంట్లను ఆన్‌లైన్‌తో లింకు చేసుకునే గడువు పొడగించే అవకాశం లేదని జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గడువు పొడగింపు ఇతర జిల్లాల్లో కూడా జరగలేదని చెప్పారు.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వినయోగదారులంతా రూ.1350 పెట్టి గ్యాస్ కొనుక్కోవాల్సిందేనని, ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రూ.870 సబ్సిడీ రాదని వెల్లడించారు. ఇప్పటికీ ఆన్‌లైన్‌తో లింకు కాని వారు వెంటనే తమ ఆధార్‌కార్డును సంబంధిత గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఇవ్వాలని సూచించారు.
బండ భారమే...
Published Wed, Jan 29 2014 3:55 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement