Cooking gas consumers
-
నోటి మాటలే..ఉత్తర్వులేవీ..?
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ఆధార్ లింక్ వంటగ్యాస్ వినియోగదారులను అయోమయానికి గురిచేస్తోంది. కేంద్రం పూటకొక మాట చెబుతుండటంతో వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానం తొలగిస్తామని చెప్పిన కేంద్రం నేటికీ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో రాయితీ లేకుండా పూర్తిస్థాయిలో రూ. 1220.50 పెట్టి వంటగ్యాస్ కొనలేక పేదలు అల్లాడుతున్నారు. ఆధార్ అనుసంధానం అయినా కొంద రి బ్యాంకు ఖాతాలకు రాయితీ మొత్తం రావడం లేదు. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీలుండగా..5,86,128 కనెక్షన్లున్నాయి. వీటిలో రెండు లక్షలకుపైగా సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, మరో 2 లక్షల 11 వేల డబుల్ సిలిండర్ కనెక్షన్లు, దీపం కనెక్షన్లు లక్షా 12 వేల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,63,651 మంది వినియోగదారులకు ఆధార్ సీడింగ్ అయింది. 46,699 మందికి బ్యాంకులో అనుసంధానమైంది. మిగిలినవి అటు బ్యాంకులోనూ, ఇటు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఫీడింగ్‌కి నోచుకోలేదు. ‘ఈనెల నుంచి పాత పద్ధతిలోనే వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలిండర్ వర్తిస్తుంది. ఆధార్ లేకుండా కూడా గ్యాస్ సరఫరా చేస్తారు కానీ సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనాల్సి ఉంటుందని’ ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ఉత్తర్వులు నేటికీ అధికారులకుగానీ, గ్యాస్ ఏజెన్సీలకుగానీ రాలేదు. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దీపం కనెక్షన్లు తీసుకున్న మహిళలు చాలా మందికి ఆధార్ అనుసంధానం కాక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ ధరకు సిలిండర్ కొనలేక మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా కొంత మందికి ఆధార్ సంఖ్యే రాలేదు. ఆధార్ దిగిన వారికి ఆన్లైన్లో నమోదుకాక ఆధార్‌కార్డు డౌన్లోడ్ కావడం లేదు. ఆధార్ సంఖ్య రానివారిలో దీపం కనెక్షన్లు తీసుకున్న మహిళలున్నారు. వీరంతా రాయితీకి దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఆధార్ లింక్ తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు. -
బండ భారమే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.25 కోట్ల ‘బండ’ భారం పడనుంది. నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ పొందేందుకు గాను ఆన్‌లైన్‌తో లింకయ్యేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈనెల 31తో ముగుస్తుండగా, జిల్లాలో ఇప్పటివరకు 40 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఆన్లైన్ చేయించుకున్నారు. మిగిలిన 60 శాతం మంది వివిధ కారణాలతో ఆన్‌లైన్‌తో లింకు కాలేకపోయారు. ఇందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, జిల్లాలో అందరికీ ఆధార్ కార్డులు అందకపోవడం, ఉన్నవాటిలోనూ తప్పులు దొర్లడం, బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో దీనిపై అవగాహన లోపించడం వంటి కారణాలున్నాయి. అయితే ఈనెల 31 తర్వాత ఆన్‌లైన్‌తో లింకు కాకుండా గ్యాస్ కొనుగోలు చేయాలంటే రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీ కింద కేంద్రం ఇచ్చే రూ.870 రాదు. ఈ లెక్కన ఇప్పటి వరకు జిల్లాలో ఆన్‌లైన్‌తో లింక్ కాని మూడు లక్షల మంది వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు భారం మోయాల్సిందే. గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఆధార్‌కార్డు నకలును సమర్పించి ఆన్‌లైన్‌తో లింకయ్యేంతవరకు ఈ నష్టాన్ని భరించాల్సిందే. లింకు లెక్కలివే... జిల్లాలోని 39 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,16,386 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో మంగళవారం నాటికి ఆధార్ కార్డుతో లింకయిన వారి సంఖ్య 3, 20, 874 మాత్రమే. వీరిలోనూ అందరూ బ్యాంకుతో లింకు కాలేదు. బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, బ్యాంకులకు ఆధార్‌కార్డు నకలు సమర్పించని కారణంగా మరో లక్ష మంది ఇంకా బ్యాంకులకు లింక్ కాలేకపోయారు. ఇప్పటివరకు ఆధార్‌తో పాటు బ్యాంకులకు కూడా లింకయిన జిల్లా గ్యాస్ వినియోగదారుల సంఖ్య 2,06,846 మాత్రమే. అంటే మొత్తం వినియోగదారుల్లో ఇది కేవలం 40 శాతమే. మిగిలిన 60 శాతం వినియోగదారులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్యాస్ బండను సబ్సిడీ లేకుండా రూ.1350 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి కేవలం రూ.480కే గ్యాస్‌బండ లభిస్తుండగా, వచ్చే నెల ఒకటి నుంచి మాత్రం ఆన్‌లైన్‌తో లింకయిన వారి తరహాలోనే మొత్తం చెల్లించి కొనుక్కోవాల్సిందే. కానీ, ఆన్‌లైన్‌తో లింకులేని వారికి సబ్సిడీ రాదు. మొత్తం చెల్లించి కొనుక్కున్న తర్వాత ఆన్‌లైన్‌తో లింకు అయినప్పటికీ.. అప్పటి నుంచే సబ్సిడీ ఇస్తారు. అంటే ఒక నెల రూ.1350 పెట్టి బండ కొన్నా సబ్సిడీ కింద రావాల్సిన రూ.870 నష్టపోవాల్సిందే. ఈ లెక్కన ఆన్‌లైన్‌తో లింకు కాని 3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు నెలకు రూ.25 కోట్లు సబ్సిడీ పోగొట్టుకుంటారు. అంటే జిల్లాపై ఒక్క నెలలో పడే గ్యాస్‌బండ భారం రూ.25 కోట్లు అన్నమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ గ్యాస్ వినియోగదారులకు శాపంగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతుకు బండిని లాగలేకపోతుంటే ఇప్పుడు బండ భారం అదనంగా మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడువు పెంచే అవకాశం లేదు: డీఎస్వో గ్యాస్ సబ్సిడీ పొందేందుకు గాను ఆధార్, బ్యాంకు అకౌంట్లను ఆన్‌లైన్‌తో లింకు చేసుకునే గడువు పొడగించే అవకాశం లేదని జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గడువు పొడగింపు ఇతర జిల్లాల్లో కూడా జరగలేదని చెప్పారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వినయోగదారులంతా రూ.1350 పెట్టి గ్యాస్ కొనుక్కోవాల్సిందేనని, ఆన్‌లైన్‌తో లింకు కాని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రూ.870 సబ్సిడీ రాదని వెల్లడించారు. ఇప్పటికీ ఆన్‌లైన్‌తో లింకు కాని వారు వెంటనే తమ ఆధార్‌కార్డును సంబంధిత గ్యాస్ ఏజెన్సీతో పాటు బ్యాంకులో ఇవ్వాలని సూచించారు. -
పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం బండ బాదుడు బాదుతోంది. వినియోగదారులపై మోయలేని భారం వేస్తోంది. నెల కిందటే సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర పెరిగింది. మరోమారు గ్యాస్ ధర పెంచాయి. రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. దీం తో వినియోగదారుడు మొదట సి లిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. అదే సమయంలో బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.633 నుంచి రూ.843 కు పెరిగింది. సబ్సిడీ రూ.210 పెంచారు. ఈ లెక్కన వినియోగదారునిపై రూ.5 అదనపు భారం పడుతోంది. తొమ్మిది సిలిండర్లు దాటిన పక్షంలో అదనపు భారం మోయలేని పరిస్థితి. జిల్లావాసులపై ఏడాదికి రూ.1.50 కోట్ల వడ్డన జిల్లాలో 3,36,272 గ్యాస్ కనెక్షన్లు ఉన్నా యి. పెరిగిన రూ.5 లెక్కన సుమారుగా ఏడాదికి దాదాపు రూ.1.50 కోట్లపైన భా రం వినియోగదారులపై పడనుంది. సబ్సి డీ సిలిండర్లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండ ర్ పరంగా కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాలి. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. రూ.215 పెంచడం ద్వారా జిల్లాలోని కనెక్షన్ల సంఖ్యను బట్టి ప్రతీసారి అదనంగా తీసుకునే సిలిండర్‌ను బట్టి రూ.6.45 కోట్ల భారం వినియోగదారుడు భరించాల్సి వస్తుంది. ముగిసిన సీడింగ్ గడువు.. వంట గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ముడిపెట్ట వద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం మొండి పంతం వీడడం లేదు. బ్యాంక్ ఖాత, గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌కు అనుసంధానం చేయించుకొని వినియోగదారులకు జనవరి 1 నుంచి సబ్సిడీయేతర ధరకే కొనక తప్పదు. నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి విధితమే. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ పథకం అ మల్లోకి వచ్చింది. తాజాగా గడువును పెం చలేదు. ఇప్పటికీ సిలిండర్ తీసుకునేటప్పు డు సబ్సిడీ పోనూ మిగితా మొత్తంను కట్టి వినియోగదారులు తీసుకునేవారు. ఆ అవకాశం ఇకపై ఉండదు. పూర్తిస్థాయి సిలిండర్ ధరను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్న పక్షంలో వారికి సబ్సిడీ బ్యాంకులో జమ అయ్యే పరిస్థితి ఉంటుంది.