ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: ఆధార్ లింక్ వంటగ్యాస్ వినియోగదారులను అయోమయానికి గురిచేస్తోంది. కేంద్రం పూటకొక మాట చెబుతుండటంతో వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానం తొలగిస్తామని చెప్పిన కేంద్రం నేటికీ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో రాయితీ లేకుండా పూర్తిస్థాయిలో రూ. 1220.50 పెట్టి వంటగ్యాస్ కొనలేక పేదలు అల్లాడుతున్నారు. ఆధార్ అనుసంధానం అయినా కొంద రి బ్యాంకు ఖాతాలకు రాయితీ మొత్తం రావడం లేదు. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీలుండగా..5,86,128 కనెక్షన్లున్నాయి.
వీటిలో రెండు లక్షలకుపైగా సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, మరో 2 లక్షల 11 వేల డబుల్ సిలిండర్ కనెక్షన్లు, దీపం కనెక్షన్లు లక్షా 12 వేల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,63,651 మంది వినియోగదారులకు ఆధార్ సీడింగ్ అయింది. 46,699 మందికి బ్యాంకులో అనుసంధానమైంది. మిగిలినవి అటు బ్యాంకులోనూ, ఇటు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఫీడింగ్‌కి నోచుకోలేదు. ‘ఈనెల నుంచి పాత పద్ధతిలోనే వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలిండర్ వర్తిస్తుంది. ఆధార్ లేకుండా కూడా గ్యాస్ సరఫరా చేస్తారు కానీ సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనాల్సి ఉంటుందని’ ఇటీవల కేంద్రం ప్రకటించింది.
అయితే ఈ ఉత్తర్వులు నేటికీ అధికారులకుగానీ, గ్యాస్ ఏజెన్సీలకుగానీ రాలేదు. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దీపం కనెక్షన్లు తీసుకున్న మహిళలు చాలా మందికి ఆధార్ అనుసంధానం కాక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ ధరకు సిలిండర్ కొనలేక మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా కొంత మందికి ఆధార్ సంఖ్యే రాలేదు. ఆధార్ దిగిన వారికి ఆన్‌లైన్‌లో నమోదుకాక ఆధార్‌కార్డు డౌన్‌లోడ్ కావడం లేదు. ఆధార్ సంఖ్య రానివారిలో దీపం కనెక్షన్లు తీసుకున్న మహిళలున్నారు. వీరంతా రాయితీకి దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఆధార్ లింక్ తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.
నోటి మాటలే..ఉత్తర్వులేవీ..?
Published Wed, Mar 5 2014 2:47 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement