
‘ఫీజుకు’ ఆధార్’ తప్పదు మంత్రుల బృందం
సమావేశంలో నిర్ణయం నర్సింగ్, పారామెడికల్, ఫార్మా కోర్సులపైనా చర్చ
వాటిపై ఏమీ తేల్చకుండానే ముగిసిన సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్‌సమెంట్ పథకం కింద లబ్ధి పొందేందుకు విద్యార్థులకు ‘ఆధార్’ తప్పనిసరి అనే నిబంధన కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్‌పీటర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చ జరిగింది. అయితే, సుప్రీం తీర్పుపై కేంద్రం అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నందున ప్రస్తుతానికి ఆ నిబంధనను కొనసాగించాలని నిర్ణయించారు.
ఆధార్ నంబర్ ఉంటేనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని సమావేశంలో తీర్మానించారు. సీమాంధ్రలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో.. ఫీజుల పథకం కింద అక్కడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్న అంశంపై కూడా చర్చ జరిగింది. దరఖాస్తులకు ఎలాంటి తుది గడువు లేనందున ఆ ప్రాంత విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సమావేశం అభిప్రాయపడింది. దాంతోపాటు నర్సింగ్, పారామెడికల్, ఫార్మా కోర్సులకు ఫీజుల పథకం అమలుపై కూడా మంత్రుల బృందం చర్చించినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జీవో నెం. 66 ప్రకారం యాజమాన్య కోటాలో చేరిన దాదాపు 2,100 మంది ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం విద్యార్థినులకు బకాయిల చెల్లింపు, జీఎన్‌ఎం విద్యార్థుల ఇంటర్‌నషిప్, డీఏహెచ్‌ల తరహాలో మెస్‌చార్జీల పెంపు అంశాలపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. ఫీజుల పథకం అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా, మంగళవారం జరిగిన సమావేశానికి కేవలం ముగ్గురు మాత్రమే వచ్చారు.
మైనార్టీ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పెంపు
కేంద్రం అందజేసే ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 వరకు గడువు పొడిగించామని, అర్హులైన విద్యార్థులు మైనార్టీ ఫైనాన్‌స కార్పొరేషన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.