
రుణమాఫీకి ఆధార్ కొర్రీ
రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకో సాకు వెతుకుతూ రైతులను అయోమయంలో పడేస్తున్నారు.
సాక్షి, నెల్లూరు: రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకో సాకు వెతుకుతూ రైతులను అయోమయంలో పడేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ రైతుల బ్యాంకు రుణాలను రద్దు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదని చెప్పారు. ఇదే సమయంలో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రిజర్వ్‌బ్యాంకు ఒప్పుకోలేదంటూ కొత్త సాకులు చెప్పిన బాబు తాజాగా ఆధార్ కార్డుల ఆధారంగా రుణమాఫీ చేస్తామంటూ కొత్తపల్లవి అందుకొన్నారు. ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రకటించారు.
జిల్లాలో ఆధార్ ప్రక్రియ మొదలుపెట్టి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తికాలేదు. జిల్లాలో మొత్తం 29 లక్షల 65 వేల 553 మంది జనాభా ఉన్నారు. వీరందరికీ ఆధార కార్డులు అందించాల్సి ఉంది.ఇందుకోసం ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 23 లక్షల మంది మాత్రమే ఆధార్ కార్డుకోసం నమోదు చేసుకొన్నారు. వీరిలో 18 లక్షల మందికి మాత్రమే కార్డులు అంది ఉంటాయన్నది సమాచారం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డులు అందిన వారి సంఖ్య మరీ తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50 శాతానికి మించిలేదు. ఈ లెక్కన పూర్తిస్థాయిలో ఆధార్ కార్డు అందాలంటే మరో మూడేళ్లకు పైగా పట్టే పరిస్థితి ఉంది.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆధార్ ఉన్నవారికే రుణమాఫీ అన్న పక్షంలో దాదాపు 50 శాతం మందికి కూడా రుణమాఫీ అమలు జరిగే అవకాశంలేదు. రుణమాఫీ నుంచి వీలైనంతగా తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆధార్ పేరుతో కుచ్చుటోపీ పెట్టనుంది. దీంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది.
మరోవైపు ఖరీఫ్ ముంచుకు రావడంతో కొత్తరుణాలు అందక రైతాంగం ఆందోళనలో పడింది. ఈ డొంకతిరుగుడు వ్యవహారం చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ హామీ నుంచి తప్పించుకోజూస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఇప్పటికే రుణ మాఫీ అమలు నుంచి తప్పించుకునేందుకు బాబు ప్రభుత్వం కమిటీల పేరుతో పలురకాల పన్నాగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మూడురకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 2012 సెప్టెంబర్ నాటికి ఉన్న బకాయిలను మాత్రమే రద్దు చేయాలన్న ప్రతిపాదన ఒకటి కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో 2013 సెప్టెంబర్ 30 వరకూ ఉన్న పెండింగ్ రుణాలను మాఫీ చేయడం మరొకటి. మూడోది టీడీపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన 2014 మార్చి 31 వరకూ ఉన్న పెండింగ్ బకాయిలను మాఫీ చేయాలన్న ప్రతిపాదన. మూడో దానిని పరిగణలోకి తీసుకుంటే అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యే అవకాశముంది. వీటన్నింటిని పక్కన పెట్టి తాజాగా ఆధార్ లింకుపెట్టి అన్నదాతను అథోపాతాళానికి తొక్కేందుకు బాబు ప్రభుత్వం ఉక్కుపాదాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.