సగం మందికి కూడా అందని ఆధార్ కార్డులు
Published Fri, Sep 6 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆధార్ ఆధారంగా నగదు బదిలీ పథకం అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులు అందజేయకముందే నగదు బదిలీ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 10 వేల మంది విద్యార్థులుండగా ఇంతవరకూ కేవలం 55 వేల మందికే ఆధార్, యూఐడీ నంబర్లు వచ్చాయి. మిగిలిన వారికి సంబంధించి డేటా సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది.
గ్యాస్ సబ్సిడీకి కూడా నగదు బదిలీ అమలు చేయనుండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటికే 13 జిల్లాల్లో ఈ పథకం అమలును ప్రారంభించగా, వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా కార్డులు జారీ చేయకుండా నగదు బదిలీ పథకం అమలు చేస్తే తాము నష్టపోవలసి వస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్, రేషన్‌కార్డు, గ్యాస్ కాండాక్ట్ ఫారం జిరాక్స్ కాపీలను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డీలర్లకు అందజేయాలి. అయితే జిల్లాలో ఇప్పటి వరకూ 75 వేల మంది గ్యాస్ వినియోగదారులు మాత్రమే పూర్తి వివరాలను అందజేశారు. 35వేల మంది వినియోగదారులకు ఆధార్ కార్డులు ఇప్పటీ అందలేదు. అయినప్పటీకీ గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులు అందజేయకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసలు జిల్లా లో కార్డుల జారీ ప్రక్రియ ఎంతవరకూ జరి గిందన్న వివరాలు కూడా అధికారుల వద్ద లేకపోవడం విశేషం. ప్రభుత్వం ఆర్భాటంగా కార్యక్రమం ప్రారంభించినప్పటీకీ దానిపై దృష్టి సారించక పోవడం విమర్శలకు తావి స్తోంది. జిల్లాలో 24 లక్షల మంది ఉండగా వారిలో 18 లక్షల మంది నుంచి వివరాలు సేకరించారు. వీరిలో ఇంతవరకూ కేవలం 11లక్షల మందికి మాత్రమే కార్డులు జారీ అయ్యాయి. జారీ అయిన కార్డులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. కార్డుల జారీలో ఇదేపరిస్థితి కొనసాగితే మరో మూడు నెల లైనా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయటానికి అవకాశం ఉండదు. యంత్రాంగం మాత్రం అక్టోబర్ 1 నుంచి నగదుబదిలీ అమలు చేయటానికి సన్నద్ధమవుతోంది.
Advertisement