రేషన్ ఆపేస్తారా!! | Link AAdhar Ration, gas customers in Vizianagaram | Sakshi
Sakshi News home page

రేషన్ ఆపేస్తారా!!

Published Mon, Sep 1 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

రేషన్  ఆపేస్తారా!!

రేషన్ ఆపేస్తారా!!

విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ఏకకాలంలో చేపట్టిన రేషన్, గ్యాస్ వినియోగదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరగకుంటే రేషన్ నిలిపి వేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎం.డి. గత రెండు నెలలు గా లక్ష్యాలు విధిస్తూ ఆగస్టు 31వ తేదీని గడువుగా విధించారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని పౌర సరఫరాల శాఖ అధికారులు అదనపు సిబ్బందిని, మరిన్ని కంప్యూటర్లను వినియోగించి ఆధార్ అనుసంధాన ప్రక్రియ ను ఆగస్టు 31నాటికి 73 శాతానికి తీసుకువచ్చారు. దీంతో మిగతా 27శాతం కార్డులకు రేషన్ నిలుపుదల చేసే పరిస్థితి తప్పదనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆధార్ సీడింగ్‌పై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు.
 
 ఆధార్ అనుసంధానంపై వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించిన అధికారులు రేషన్ నిలుపుదల చేస్తున్నట్టు పదేపదే స్పష్టం చేశా రు. ఇంత వరకూ హెచ్చరికలు చేసిన ఉన్నతాధికారులు ఇక రేషన్ నిలుపుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని భావించిన జిల్లా అధికారులు ఆధార్ సీడింగ్‌పై గట్టిగా చర్యలు తీసుకుని రేషన్ నిలుపుదల చేస్తామని డీలర్లకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఆర్‌డీఓ జె.వెంకటరావు మరింత ముందుకు వెళ్లి ఒక డీలర్‌ను సస్పెండ్ చేసి మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న ప్రక్రియ మరింత వేగంగా సాగింది. దీంతో చివరకు 73 శాతం రేషన్ కార్డుల అనుసంధానం జరిగింది. ఇప్పటికే రచ్చబండ-3లో మంజూరైన సుమారు ఎనిమిది వేల రేషన్ కార్డుల ను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరిం త వేగవంతం చేయగలిగింది.
 
  అరుునా అనుసంధానం 73 శాతానికి మించలేదు. ఇప్పటికే పలు రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించిన యంత్రాంగం మిగ తా కార్డులు కూడా బోగస్‌వేనా! అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 6,82,913 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 24,16,367 మందికి వివిధ సరుకులిస్తున్నారు. ఇప్పటి వర కూ సుమారు 15.8లక్షల మంది వరకూ ఆధార్ అనుసంధానం చేశారు. అయితే ఇప్పటివరకూ జిల్లాలోని రేషన్ విని యోగదారుల సంఖ్యననుసరించి ఆధార్ అనుసంధానం జరుగుతుండగా ఇందులో సుమారు 2.40లక్షల మందికి ఆధార్ అనుసంధానం జరగడం లేదు. కంప్యూటర్లు వీరి నంబర్లను తిరస్కరిస్తున్నాయి. అంటే వీరికి మరో చోట ఆధార్ అనుసంధానం జరిగిపోయి ఉంటుంద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 జిల్లాలో చాలా మందికి రేషన్ కార్డులు స్వగ్రామాల్లోనూ వలస వెళ్లిన చోటా కూడా కార్డులున్నాయి. వీరికి దేశవ్యా ప్తంగా ఒకే నంబర్ గల విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుతో ఈ బోగస్ బయట పడుతుంది.  అన్ని కార్డులూ ఇలా ఉండకపోయినా చాలా మటుకు బోగస్‌వని తేలుతోంది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం కాని, లబ్ధిదారులు ముందుకు రాని ఎనిమిది వేల రచ్చబండ రేషన్ కార్డులు రద్దయినట్టే సాధారణ కార్డులు కూడా రద్దవుతాయనీ, లేదా నిజమైన రేషన్‌కార్డులకు ఇంకా ఆధార్ అనుసంధానం కాకపోతే వారికి రేషన్ నిలిచిపోతుందనీ భావిస్తున్నారు.   సోమవారం ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 
 గ్యాస్ అనుసంధానం కూడా...
 జిల్లాలో గతంలో జోరుగా సాగిన గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం ప్రక్రియ సుప్రీం కోర్టు తీర్పుతో ఆకస్మాత్తుగా నిలిచిపోయింది. కొద్ది రోజుల కిందట మళ్లీ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు. అయితే 40 శాతంతో పునఃప్రారంభమయిన ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా దాటలేదు. దీంతో 50 శాతం మందికి గ్యాస్ సరఫరా నిలిపివేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్‌ఓ హెచ్.వి ప్రసాదరావు  మాట్లాడుతూ ఎప్పుడయినా ప్రభుత్వం ఆధార్ అనుసంధానం కాని గ్యాస్ కనెక్షన్లకు సరఫరా నిలిపివేసే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రేషన్‌కార్డుల అనుసంధానానికి ఇచ్చిన గడువునే ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ల అనుసంధానానికి కూడా ఇవ్వడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. కేవలం 47 శాతం మాత్రమే గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement