ఆదారీతెన్నూలేక...
పార్వతీపురం: జిల్లాలోని 34 మండలాల్లో ఆధార్ ప్రక్రియ పూర్తి కాకుండానే, ఈ నెలాఖరులోగా ఆధార్ సీడింగ్ చేసుకోని పక్షంలో రేషన్, పింఛన్, స్కాలర్ షిప్పులు, భూములు, ఉపాధి తదితర ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజలకు ఇప్పటికే బెదిరింపులు జారీ చేశారు. దీంతో ఆధార్ కార్డులు పూర్తయినవారు సీడింగ్ కోసం పరుగులు తీస్తుండగా, ఆధార్ ప్రక్రియ పూర్తి కానివారు, గతంలో ఆధార్ తీసుకున్నా అవి ఫెయిల్ అయినవారు ఆధార్ (మీసేవ) కేంద్రాలకు క్యూలు కడుతున్నారు. అయితే ఆధార్ కేంద్రాలు(మీసేవ) సరిపడా లేకపోవడంతో నానా యాతన పడుతున్నారు.
జిల్లాలో కొత్తగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు వాటిని ఏర్పాటు చేయకపోవడంతో, అరకొరగా ఉన్న ‘మీసేవ’ కేంద్రాల వద్ద ప్రజల పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మేర ఆధార్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే మిగతా 30శాతం పూర్తి చేసేందుకుగాను సరిపడా చర్యలు చేపట్టలేదు. సీడింగ్ ప్రక్రియ పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఆధార్ ప్రక్రియపై చూపించడం లేదు. దీంతో చూపులేని, కదలలేని వృద్ధులు, బాలింతలు ఆధార్ కోసం మీసేవ కేంద్రాల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ ఆధార్ పూర్తి కావడం లేదు. కొంతమందికి ఆధార్ తీసినా కార్డులు రావడం లేదు. దీంతో వారు మళ్లీ,మళ్లీ ఆధార్ తీసుకునేందుకు వెళ్లాల్సి వస్తోంది.
జిల్లాలో వేపాడ, జామి, గుర్ల, కొమరాడ, సీతానగరం, బొండపల్లి, గజపతి నగరం తదితర మండలాల్లో 80 శాతం వరకు ఆధార్ ప్రక్రియ పూర్తి కాగా, కురుపాం, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం, పార్వతీపురం, డెంకాడ తదితర మండలాల్లో సరాసరి 65 శాతం వరకూ పూర్తయింది. అయితే ఈ నెలాఖరులోగా ఆధార్ తీసుకోవాలని లేదంటే వివిధ ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని అధికారులు చెబుతుండడంతో కార్డులు లేనివారు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు,పాలకులు స్పందించి అందరికీ ఆధార్ కార్డులిచ్చి, ఆపై సీడింగ్ చేపట్టాలని , అలాగే మంచాలపై నుంచి కదలలేని రోగులు, వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఆధార్ తీయాలని ప్రజలు కోరుతున్నారు.
పార్వతీపురం డివిజన్‌లో 72శాతం ఆధార్ పూర్తి:సబ్-కలెక్టర్
పార్వతీపురం డివిజన్‌లో దాదాపు 72శాతం ఆధార్ ప్రక్రియ పూర్తి చేసినట్టు సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. అలాగే ఆధార్ ఆయినవారికి 49.09 శాతం సీడింగ్ పూర్తి చేశామన్నారు. ఆధార్ ప్రక్రియ కోసం మీసేవల్లో ఏర్పా ట్లు చేశామని, మరికొన్ని కొత్త కేంద్రాలు ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్వతీపురం పట్టణంలో ఆధార్ ప్రక్రియ దాదాపు చాలా వరకూ అయినప్పటికీ కార్డులున్నవారంతా సీడింగ్‌కు ముందుకు రావడం లేదన్నారు. దీంతో అవన్నీ భోగస్‌గా పరిగణిస్తామన్నారు.
ఈ విద్యార్థి పేరు పి.సురేష్, పార్వతీపురం మండలం, సంగంవలస పం చాయతీలోని రంగంగూడ గ్రామం. ఆధార్ కార్డు లేదని గత శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారని వాపోయాడు. ఆధార్ కోసం ఇంటికి వెళ్తే ఎక్కడ ఆధార్ తీస్తారో కూడా తనకు, తన అమ్మానాన్నలకు తెలి యదని వాపోయాడు. ఆధార్ అనేది పాఠశాల లేదా గ్రామాలలోకి వచ్చి తీయాలన్నాడు.
ఈ వృద్ధుడి పేరు చింతాడ సూర్యనారాయణ. పార్వతీపురం పట్టణంలో ని జగన్నాథపురానికి చెందిన కృష్ణాకాలనీ నివాసి. తనకు ఆధార్ కార్డు లేదని పింఛన్‌ను ఆపేశారని వాపోతూ గత సోమవారం సబ్-కలెక్టర్ కార్యాలయానికి విన్నవించుకునేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ తీయలేదని, ఆధార్ కార్డు ఇవ్వకుండా ఎలా ఇవ్వగలనని వాపోయాడు. ఇలా వీరిద్దరే కాదు జిల్లాలో చాలా మంది దారీతెన్నూ తెలియక, పథకాలు ఆగిపోతాయేమోనన్న బెంగతో అల్లాడిపోతున్నారు. పరిష్కారమార్గం చూపవల సిన అధికారులు బెదిరిస్తూ వారినిమరింత భయపెడుతున్నారు.