
దరఖాస్తులను రాయించుకుంటున్న లబ్ధిదారులు
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు మనోహర. ఇతనిది యల్లనూరు మండలం తిమ్మంపల్లి. ఇతని భార్య పేరు భవాని. వీరు తిమ్మంపల్లిలో తన తండ్రి పేరు బాల చిన్నయ్య పేరు మీద ఉన్న ఇంటిలో నివసిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ కూడా బాల చిన్నయ్య పేరు మీదే ఉంది. కాని భవాని పేరు మీదు అనంతపురం బళ్లారి బైపాస్ సబ్‌స్టేషన్ పరిధిలో ఒక కనెక్షన్, ఆర్ట్స్ కళాశాల సబ్‌స్టేషన్ పరిధిలో రెండు కనెక్షన్లు ఉన్నట్లు తేలింది.
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలో చాలామందికి అమ్మఒడి పథకం, రేషన్ కార్డులు, పింఛన్‌లకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో నయా దందా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ కనెక్షన్ లేకుండా కేవలం ఇతరుల ఆధార్‌కార్డులతో కొంతమంది లబ్ధి పొందుతున్న విషయం బయటపడింది. విద్యుత్ శాఖ పరిధిలో జిల్లా మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్ధిదారులు విద్యుత్ బిల్లుల కారణంగా రేషన్‌కార్డుల అనర్హుల జాబితాలో పేర్లు నమోదై ఉండడంతో వాటిని తొలగించుకునేందుకు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు.
అంతా తిరకాసు..
విద్యుత్ కనెక్షనే ఉండదు. కనీసం వారి పేరుతో మీటర్‌ను కూడా నమోదు చేసుకుని ఉండరు. అలాంటి వారి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉందని, మీరు వందల యూనిట్లు విద్యుత్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నారనే జాబితాల్లో నమోదవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎవరికి అంతుచిక్కడమే లేదు. 2016–17 నుంచి విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే తగినంత రుసుము చెల్లించిన తరువాతనే మంజూరు చేస్తున్నారు. ఇంత తతంగం మధ్య అసలు దరఖాస్తు చేసుకోని వారి వివరాలు వాటిలో నమోదు కావడం ఎలా సాధ్యమైందో తెలియక తికమక పడుతున్నారు. ఆయా విద్యుత్ శాఖ కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులను వారి పూర్తి వివరాలను తీసుకుని సంబంధిత దరఖాస్తును వారి ద్వారా రాయించుకుని వాటిని ఆయా జాబితాలో నుంచి తొలగించేస్తున్నారు.
తప్పెవరిది?..
ఇది ఇలా ఉండగా సంబంధిత జాబితాలను తాము చేయలేదని, ఆయా సచివాలయాల్లో ఉన్న వలంటీర్లే వాటిని చేసి ఉంటారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదైన వాటిని మాత్రమే అందిస్తున్నామని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఎవరి తప్పిదమో తెలియని తికమక పరిస్థితి నెలకొంది. ఆయా సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించడం ద్వారా అర్హులు, అనర్హులు పెద్ద ఎత్తున ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జాబితాలు ప్రదర్శించకపోతే ఆయా లబ్ధిదారుల పేర్లతోనే ఇవి కొనసాగుతూ ఉండేవి. ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారకులు ఎవరేనే అంశం ఇంకా తేలాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
ఇతరుల పేరుతో ఉన్న మీటర్ తమ పేరుపై చూపుతోందని నాలుగు రోజుల నుంచి రోజూ 500 మందికిపైగా పవర్ ఆఫీస్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నాం. 2016 నుంచి విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించి పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. కర్నూలు జిల్లాకు చెందిన కొలిమిగుండ్ల వాసికి అనంతలో కనెక్షన్ ఉందని తేలింది. దీంతో అతను అనంతకు వచ్చి తన పేరును తొలగించుకున్నాడు. ప్రస్తుతం వచ్చిన లబ్ధిదారులకు సత్వరమే సమస్యను పరిష్కరిస్తున్నాం.– మొహమ్మది, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment