సాక్షి, తిరుమల: శ్రీవారి టైంస్లాట్ దర్శనాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్ అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో రూ.300 టికెట్లతోపాటు కాలిబాట దర్శనాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
స్వామివారి దర్శన విధానాల్లో టీటీడీ ఇప్పటికే ఆధార్ కార్డు అమలు చేస్తోంది. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు భక్తులకు పారదర్శక సేవలు అందుతున్నాయి. అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయటం వల్ల డూబ్లికేషన్‌తోపాటు అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ఏ దర్శనంలో ఎంత మంది వెళ్లారు? ఎవరు? ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? అన్న సమగ్ర వివరాలు టీటీడీ వద్ద రికార్డు అవుతున్నాయి. దీనివల్ల భద్రతా పరంగా కూడా సంబంధిత భక్తుల వివరాలు సంక్షిప్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఆధార్‌కార్డు అనుసంధానంపై టీటీడీ నిర్వహించిన సర్వేలో 95 శాతంపైగా భక్తులు మద్దతు తెలిపారు.
టైం స్లాట్లలో 95వేల మందికి దర్శనం
తిరుమలేశుని దర్శన విధానంలో ఇప్పటి వరకు రద్దీని బట్టి రూ.300 టికెట్లు రోజూ 20 నుండి 25వేలు, కాలిబాట దివ్య దర్శనాలకు రోజూ 20 వేలు టైం స్లాట్ టికెట్లు కేటాయించి, అమలు చేస్తున్నారు. తాజాగా, సోమవారం నుండి ఆరంభమైన సర్వదర్శనంలోనూ రోజూ 20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తుల రద్దీ, పర్వదినాలు బట్టి అయా టైం స్లాట్ దర్శనాల్లో సంఖ్యను పెంచటం, తగ్గించటం వంటి నిర్ణయాలకు వెసులుబాటు కల్పించారు. వాటితోపాటు ఇక వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్లు, వీఐపీ దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐ భక్తులు కనిష్టంగా 10 వేలు నుండి గరిష్టంగా 15 వేల వరకు ఉంటారు. అంటే మొత్తం మీద ఒక రోజులో కనిష్టంగా 75వేలు , గరిష్టంగా 90 వేల మందికి మాత్రమే సాఫీగా స్వామి దర్శనం అమలు చేయాలని టీటీడీ ఉన‍్నతాధికారులు భావిస్తున్నారు. అన్నిరకాల టైం స్లాట్ దర్శనాలకు ఆధార్‌కార్డు తప్పనిసరిచేస్తే డూబ్లికేషన్ అవకాశం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment