నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్‌ | Aarogyasri Band From today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్‌

Published Mon, Dec 17 2018 5:40 AM | Last Updated on Mon, Dec 17 2018 5:40 AM

Aarogyasri Band From today - Sakshi

సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యానికి వరప్రదాయని ఆరోగ్యశ్రీ సేవలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోనున్నాయి. గత కొన్ని నెలలుగా తమకు బకాయిలు చెల్లించని కారణంగా సోమవారం నుంచి వైద్య సేవలను నిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీతో పాటు 5 లక్షల మంది ఉద్యోగులకు, 3 లక్షల మంది పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు మొత్తం 35 లక్షల మందికి వర్తించే ఉద్యోగుల వైద్యం కూడా ఆపేస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ నర్సింగ్‌ అసోసియేషన్‌ (అప్నా), సూపర్‌ స్పెషాలిటీ అసోసియేషన్‌ (ఆశా)ల నిర్ణయంతో నేటి నుంచి మెరుగైన వైద్యం కోసం వెళ్లే పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 630కి పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్నాయి. కోటి ముప్పయి లక్షల కుటుంబాలకు వర్తించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వస్తున్న ప్రభుత్వం.. గత కొంతకాలంగా పేద రోగుల వైద్యానికయ్యే ఖర్చులు ఆస్పత్రులకు చెల్లించడం లేదు. ఈ బకాయిలు కొండలా పెరిగి రూ. 500 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలు చెల్లించమని గత కొన్ని నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గత ఐదు నెలలుగా 90 వేల క్లెయిములను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కనీసం పరిశీలించలేదని, విధిలేని పరిస్థితుల్లోనే తాము వైద్య సేవలను ఆపేయాల్సి వచ్చిందని ఆ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కేన్సర్‌ పేషెంట్లకు కీమో థెరపీ, కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ వంటి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. 

ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసినా..
రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లు వైద్యం కోసం నెలకు కొందరు రూ. 90, మరికొందరు రూ.120 చెల్లిస్తున్నారు. ఈ సొమ్ము ఏడాదికి రూ. 200 కోట్లు అవుతుంది. మరో రూ. 200 కోట్లు ప్రభుత్వం ఇచ్చి మొత్తం రూ. 400 కోట్లతో ఉద్యోగులు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన డబ్బు కూడా ఆస్పత్రులకు ఇవ్వలేదు. ఏప్రిల్‌ నుంచి ఉద్యోగుల వైద్యానికి సంబంధించి పైసా ఇవ్వలేదని, దీంతో ఆస్పత్రులు మూత పడే పరిస్థితి చేరుకున్నాయని యాజమాన్యాలు పేర్కొన్నాయి. డబ్బులివ్వకపోవడంతో చిన్న చిన్న నర్సింగ్‌హోంలు మూతపడే దశకు వచ్చాయని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

జాప్యం చేసేందుకు తెరమీదకు క్లినికల్‌ ఆడిట్‌
ఆరోగ్యశ్రీ నిధులు జాప్యం చేసేందుకే దేశంలోనే ఎక్కడాలేని క్లినికల్‌ ఆడిట్‌ను తెరమీదకు తెచ్చారని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. 2017లో ఏప్రిల్‌లో ఈ పద్ధతి తేగా ఒక్క బిల్లును కూడా ఆడిట్‌ చెయ్యలేదన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టులో క్లెయిములు పరిష్కారానికి తగినంత మంది సిబ్బంది లేక పోవడం వల్లే జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే నియామకాలు చేస్తున్నట్టు వెల్లడించారు.

బకాయిలు నిజమే..
ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నది నిజమే. మేము బకాయిలు లేవని చెప్పడం లేదు. రెండు మూడు రోజుల్లో కొన్ని నిధులు ఇస్తామని చెప్పాం. వాళ్లు కూడా దానికి అంగీకరించారు. ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించుకుంటూ వెళతామని చెప్పాం. వీలైనంత త్వరలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం.
– డా.ఎన్‌.సుబ్బారావు, ఇన్‌చార్జి సీఈఓ, ఆరోగ్యశ్రీ

నిధుల కోసం బతిమలాడినా ఇవ్వలేదు
రోగికి వైద్యం చేసిన తర్వాత డబ్బుల కోసం సర్కారు చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. ట్రస్ట్‌ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు నిధులు వెళ్లడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఎన్నిసార్లు బతిమాలినా నిధులు రాకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో డిసెంబర్‌ 17వ నుంచి ఆరోగ్యశ్రీ , ఉద్యోగులకు వైద్యం ఆపేస్తున్నట్టు చెప్పాం. ఆదివారం సాయంత్రం మంత్రి ఫోన్‌  చేసి వారం రోజుల్లో రూ. 200 కోట్లు ఇస్తామని, సమ్మె విరమించమని కోరారు. కానీ నిధులిచ్చే వరకూ సమ్మె వాయిదా వేస్తాంగానీ, విరమణ చెయ్యలేమని చెప్పాం.
– ఏపీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం

డబ్బుకట్టే ఉద్యోగులకే దిక్కులేదు
నెలనెలా వైద్యానికి డబ్బుకట్టే ఉద్యోగులు, పెన్షనర్లకే దిక్కులేదు. ఇక ఉచితంగా చేయాల్సిన పేద రోగులకు నిధులిస్తారా. 

నేను ప్రభుత్వ డాక్టరుగా రిటైరయ్యాను. 
మా భార్యకు జబ్బుచేసి వైద్యం చేయించుకుంటే ఆరు నెలలైనా బిల్లులు ఇవ్వలేదు. పైగా డిసెంబర్‌ 31 తర్వాత రీయింబర్స్‌మెంట్‌ ఆపేయాలని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్యం బిల్లులు రాకపోతే ఆపెయ్యక ఎవరైనా ఏం చేస్తారు?
– డా.పి.శ్రీనివాస్, ఏపీ నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement