సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ విభాగం మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన అవినీతి దందా దేశ రక్షణకే ముప్పు తెచ్చిపెట్టడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలే అవాక్కవుతున్నాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం.. మరోవైపు స్వకార్యం.. అంటే కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా కీలక కాంట్రాక్టును కట్టబెట్టడం ద్వారా భారీ అవినీతికి పాల్పడటం నివ్వెర పరుస్తోంది. ఇలా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా దేశ రక్షణ చట్టాలకే తూట్లు పొడవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం గా మారింది. ఇంటెలిజెన్స్ తరఫున అప్పట్లో ఆయన ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేశారు. రక్షణ, హోం, విమాన యాన శాఖల నుంచి లైసెన్స్ లేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం, దేశ రక్షణ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌కు విరుద్ధంగా విదేశీ ప్రైవేట్ కంపెనీకి చేరవేయడం కేంద్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ..
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారన్నది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల్లో అక్రమాల కు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లోనే ఓ పన్నాగం పన్నారు. ఇలా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్‌టీ ఇన్‌ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.అవేవీ పాటిం చలేదు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొడుకు కంపెనీకి ఫ్రాంచైజీతో అడ్డగోలు దోపిడీ
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టేలా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం సాగించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ‘ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందినది. సాయి కృష్ణే ఈ కంపెనీ సీఈవో. విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ అడ్రస్‌తో ఈ కంపెనీని నెలకొల్పారు. ఇది ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సృష్టించిన షెల్ కంపెనీ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్ ఆర్డర్’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్దేశ పూర్వకంగా మాయం చేయడం విస్మయపరుస్తోంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సమంజసమేనని కేంద్ర హోం శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
బినామీల పేరిట 171.39 ఎకరాల కొనుగోలు
యథేచ్చగా అవినీతికి పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట భారీగా అక్రమ ఆస్తులు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 171.39 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్ మండలం పస్పూల్ గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేశారు. వీటిరి రైతు బంధు కింద ప్రయోజనం కూడా పొందారు. గత ఖరీఫ్‌లో దాదాపు రూ.55 లక్షల ఆదాయం ఆర్జించినట్టు సమాచారం. జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి అందులో ఓ అధునాత గెస్ట్ హౌస్‌ను నిర్మించారని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment