మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలి | Abdul kalam asks RCI to have higher goals | Sakshi
Sakshi News home page

మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలి

Published Tue, Aug 27 2013 6:24 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలి - Sakshi

మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలి

సాక్షి, హైదరాబాద్:  భారతదేశ రక్షణ రంగం స్వావలంబనలో కీలకపాత్ర పోషించిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని మాజీ రాష్ట్రపతి, ఆర్‌సీఐ వ్యవస్థాపక సంచాలకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. 1988లో దేశంలోనే మొట్టమొదటి క్షిపణి ఉత్పత్తి సంస్థగా ఆవిర్భవించిన ఆర్‌సీఐ పాతికేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌సీఐ రజతోత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలాం మాట్లాడుతూ ఆర్‌సీఐ శాస్త్రవేత్తలు భవిష్యత్తును అంచనాకట్టి తమ పరిశోధనలను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలని సూచించారు.
 
 సైబర్ యుద్ధ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశ రక్షణకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయడంలో దేశం వెనుకబడిపోరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. క్షిపణి రంగంలో ఆర్‌సీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని సంస్థ సంచాలకులు సతీశ్‌రెడ్డి తెలిపారు. ఈ సంస్థ పుట్టుకే పృథ్వీ క్షిపణి విజయవంత ప్రయోగంతో మొదలైందని, ఆ తరువాత అగ్రరాజ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో క్షిపణి వ్యవస్థలను తయారు చేయగలిగామని చెప్పారు. ఒకప్పుడు దాదాపు 50 కిలోల బరువుతో క్షిపణి నావిగేషన్ వ్యవస్థలు రూపొందించిన తాము ప్రస్తుతం వాటిని అత్యంత తక్కువ బరువుతోనే సిద్ధం చేయగలుగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి సలహాదారు, డీఆర్‌డీవో సంచాలకులు డాక్టర్ అవినాశ్ చందర్, డీఆర్‌డీవో ఆర్ అండ్ డీ చీఫ్ కంట్రోలర్ వి.జి.శేఖరన్, సంస్థ మాజీ సంచాలకులు కె.వి.ఎస్.ఎస్. ప్రసాదరావు, వి.కె.సారస్వత్, ఎస్.కే.రే తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవాల సందర్భంగా తయారు చేసిన సావనీర్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించగా, ఆర్‌సీఐ  విజయాల వీడియో సీడీని కలాం ఆవిష్కరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement