అభయహస్తం డిజైన్ మారుస్తాం: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అభయహస్తం లబ్ధిదారులకు ఇకపై ప్రతినెలా పింఛన్లు చెల్లిస్తామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. వాటితోపాటు బకాయిలనూ చెల్లిస్తామన్నారు. అభయహస్తం పథకానికి మార్పులు చేసి, ఏప్రిల్ నుంచి మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాటర్‌గ్రిడ్, రోడ్లు, హరితహారం, ఉపాధిహామీ, పెన్షన్లు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.కాగా, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. వేసవిలో కరెంటు కోతలు భరించకతప్పదని అన్నారు. విభజనతో తెలంగాణకు విద్యుత్ సరఫరా తగ్గిందని చెప్పారు.