నీరు పుష్కలం.. వదిలింది నామమాత్రం | Abundance of water .. Left the nominal | Sakshi
Sakshi News home page

నీరు పుష్కలం.. వదిలింది నామమాత్రం

Published Mon, Sep 23 2013 3:30 AM | Last Updated on Fri, Oct 19 2018 7:33 PM

Abundance of water .. Left the nominal

సాక్షి ప్రతినిధి, అనంతపురం : శ్రీశైలం జలాశయం పొంగిపొర్లుతున్నా... జీడిపల్లి రిజర్వాయర్  మాత్రం నోరెళ్లబెడుతోంది. హంద్రీ-నీవాకు అధికారికంగా కేటాయించిన మిగులు జలాలను విడుదల చేయడంలోనూ కిరణ్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. హంద్రీ-నీవాకు రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. 350 క్యూసెక్కులు మాత్రమే కాలువల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఫలితంగా జీడిపల్లి రిజర్వాయర్ నిండటం లేదు.
 
 శ్రీశైలం జలాశయం నుంచి రోజూ సగటున 1.2 లక్షల క్యూసెక్కుల జలాలు నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం పాలవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో సమృద్ధిగా జలాలు అందుబాటులో ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగాక కరువు పరిస్థితులు ఉత్పన్నమైతే హంద్రీ-నీవాకు చుక్క నీరు కూడా విడుదల చేసే అవకాశాలు ఉండవని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టీకరిస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.
 
 ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల మిగులు జలాలను కేటాయించారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరినప్పటి నుంచి 120 రోజుల్లోగా హంద్రీ-నీవాకు కేటాయించిన జలాలు విడుదల చేయాలని అప్పట్లోనే నిర్దేశించారు. ఆ ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం జూలై 9 నాటికే 854 అడుగులకు చేరుకుంది.  హంద్రీ-నీవాకు కేటాయించిన జలాలను అదే రోజు నుంచి విడుదల చేయాల్సివుంది. అయితే... సరిగ్గా నెల రోజుల తర్వాత ఆగస్టు 7న కేవలం 700 క్యూసెక్కుల నీటిని కాలువల్లోకి ఎత్తిపోశారు. వారం రోజుల క్రితం నీటి విడుదలను సగానికి తగ్గించారు. ప్రస్తుతం రోజుకు 350 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం 2,03,178 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా(ఇన్‌ఫ్లో).. 2,16,675 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల(అవుట్‌ఫ్లో) చేశారు. అయితే... హంద్రీ-నీవాకు మాత్రం 350 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఆదివారం నాటికి జీడిపల్లి రిజర్వాయర్‌లోకి 0.51 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఈ రిజర్వాయర్ నిండాలంటే మరో 1.184 టీఎంసీలు చేరాలి. ప్రస్తుత తరహాలోనే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తే జీడిపల్లి రిజర్వాయర్ నిండడానికి మరో 54 రోజులు పడుతుంది.
 
 అప్పటికి శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా తగ్గతుంది. వరద నీరు ఆగిపోతే హంద్రీ-నీవాకు నీటిని విడుదలను ఆపేస్తారు. అప్పుడు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉండదు. వరద నీరు  శ్రీశైలం డ్యాంలోకి భారీగా చేరే సమయంలోనే హంద్రీ-నీవాకు పూర్తి సామర్థ్యం మేరకు విడుదల చేసివుంటే.. కేవలం మూడు రోజుల్లోనే జీడిపల్లి రిజర్వాయర్ నిండేది. పూర్తి సామర్థ్యం మేరకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇప్పుడే ఇలా వుంటే,  రాష్ట్ర విభజన జరిగి.. జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి చుక్క నీటిని కూడా హంద్రీ-నీవాకు విడుదల చేసే అవకాశాలే ఉండవని నీటిపారుదలశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది హంద్రీ-నీవా ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement