అధికార దుర్వినియోగాన్ని సహించం
సాక్షి, నెల్లూరు: ‘ప్రజాస్యామ్యాన్ని గౌరవించాం..అధికార పార్టీ కవ్విం చినా, మహిళలని కూడా చూడకుండా దాడులకు దిగినా ఓపికపట్టాం..మా సహనాన్ని జిల్లా ప్రజలందరూ చూశారు. ఇంకా అధికార దుర్వినియోగం జరుగుతుంటే సహించేది లేదు’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ ఆత్మపరిశీలన చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తే గౌరవం ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ పరిశీలకుడి సమక్షంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన రభస టీడీపీ దుర్మార్గానికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. జిల్లా పరిషత్‌లో 31 మంది సభ్యులతో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉండగా, టీడీపీకి 15 మంది సభ్యులు మాత్రమే ఉన్నారన్నా రు. టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో ఎన్నిక సమయానికి వైఎస్సార్‌సీపీ బ లం 25కి తగ్గిందన్నారు. అయినా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పూర్తి బలం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్, ఎస్పీ అధికార పార్టీకి దాసోహ మై ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. టీడీపీలోకి వెళ్లిన సభ్యులు తిరిగి వెనక్కురావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఎంపీ చెప్పారు.
అధికార పార్టీ తొత్తులుగా
అధికారులు
జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ వారు ఎంత స్థాయిలో కవ్వింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ నేతలు, సభ్యులు సహనంతో ఉన్నారన్నారు. అధికార పార్టీ అక్రమాలపై కలెక్టర్‌కు వివరించినా ఫలితం కరువైందన్నారు. జిల్లా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ అధికారపార్టీ నేతల దాడితో ఆత్మరక్ష ణలో పడడం దురదృష్టకరమన్నారు.
పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకొని జెడ్పీటీసీ సభ్యులను అధికారపార్టీ నేతలకు అప్పగించారని మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ సమక్షంలోనే దాడులు జరగడం దారుణమన్నారు. ఇలాంటి అధికారులు జిల్లాలో పనిచేయడానికి అర్హులా? వారు తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసినట్టా! ద్రోహం చేసినట్టా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సమర్థులైన అధికారులతో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధిష్టించడం ఖాయమన్నారు.
మాయని మచ్చ
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం చోటుచేసుకున్న ఘటన జిల్లా చరిత్రకు మాయనిమచ్చని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమమన్నారు. టీడీపీ నేతలు చేయిచేసుకున్నా ఊరుకున్నామన్నారు. కలెక్టర్, ఎస్పీ అధికార పార్టీకి తలొగ్గడం దారుణమన్నారు. ఎమ్మెల్యే మైకులు విరగ్గొట్టి ఏకంగా కలెక్టర్‌నే దుర్బాషలాడితే ఐఏఎస్‌ల సంఘం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. 13న జరిగే ఎన్నికను ఎన్నికల కమిషన్ పరిశీలకుడి సమక్షంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.