వైద్య విధాన్ పరిషత్ పెద్ద నాటక పరిషత్‌గా మారిపోయింది. మయసభ సీన్‌ను ఇక్కడ బాగా రక్తి కట్టించారు. ఉన్న పోస్టులు లేనట్టు, లేని పోస్టులను ఉన్నట్టు సృష్టించారు. కాసుల కోసం చాలా ఈజీగా కేటగిరీలు మార్చేశారు. వీరి కక్కుర్తి రోగుల పాలిట ప్రాణసంకటంగా మారినా పట్టించుకోవడంలేదు. దీంతో ఆస్పత్రి అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అధికారులు కాసుల కోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. తమ పేర్లు వెల్లడిస్తే పనిచేయడం కష్టమని, అందువల్ల అక్రమాలను మౌనంగా భరిస్తున్నామని వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న పరిణామాలు వారి ఆరోపణలకు ఊతమిస్తున్నాయి.
ఘోషా ఆస్పత్రిలోని పిల్లలు, గైనిక్, మత్తువిభాగాల వైద్యుల కేటగిరీలను మార్చేయడమే దీనికి నిదర్శనం. ఇక్కడ పిల్లలు వైద్యులు నలుగురు ఉండాలి. కానీ మూడు పోస్టులే మంజూరయినట్టు అధికారులు జాబితాలో చూపిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మాత్రమే పిల్లలు వైద్యులు ఉన్నారు. మరో పోస్టును రేడియాలజీ విభాగానికి మార్చేశారు. ఆ పోస్టులో డాక్టర్ వై.తిరుపతిరావును నియమించారు. ఇక్కడ పనిచేసిన పిల్లల వైద్యుడు చిన్నారావుకు గత ఏడాది కేజీహెచ్‌కు బదిలీ అయింది. ఆస్పత్రిలో ఆరు గైనకాలజిస్టులు( సివిల్ అసిస్టెంట్ సర్జన్) పోస్టులు ఉండాలి. కానీ ముగ్గురు గైనికాలజిస్టులు మాత్రమే ఉన్నారు. ఇద్దర్ని కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. మరొక పోస్టును కంటి విభాగానికి మార్చేశారు. ఆ పోస్టులో డాక్టర్ కె.త్రినాథరావును నియమించారు. మత్తు విభాగానికి సంబంధించి ముగ్గురు వైద్యులు ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. ఒక వైద్యున్ని కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. మరొక పోస్టును రేడియాలజీ విభాగానికి మార్చేశారు. ఆ పోస్టులో డాక్టర్ అరిఫ్ రహిమ్‌ను నియమించారు. అయితే ఇలా కేటగీరీలను మార్చడం వల్ల అవసరమైన విభాగాల్లో సక్రమంగా సేవలందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఘోషా ఆస్పత్రిలో గైనికాలజిస్టులు, పిల్లల వైద్యుల పోస్టులే చాలా అవసరం. ఇక్కడ నుంచి డాక్టర్లు బదిలీ అవడం వల్ల ఖాళీ అయిన ఆ పోస్టులను భర్తీ చేయడానికి వివరాలు పంపించాలని కొద్ది రోజుల క్రితం ఉన్నతాధికారులు జిల్లా అధికారులను కోరారు.
ఇక్కడే అసలు నాటకం నడిచిందని ఆరోపణ. తమ ఆస్పత్రిలో పిల్లలు, గైనిక్, మత్తు విభాగాలకు సంబంధించి పోస్టులు ఖాళీ లేవని నివేదిక పంపించినట్టు సమాచారం. జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఘోషా ఆస్పత్రిలోనే కేటగిరీలు మార్చేసి నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేటగిరీలు మార్చడానికి, బదిలీలకు రూ.50 వేల నుంచి రూ. 60 వేలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య విధాన్ పరిషత్ అధికారుల నిర్వాకం కారణంగా భవిష్యత్‌లో కూడా పిల్లల, గైనిక్, మత్తు వైద్యుల నియామకం జరిగే అవకాశం లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఘోషా ఆస్పత్రిలో ఇద్దరు శిశువుల మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి పిల్లలు వైద్యులు లేకపోవడం కూడా ఒక కారణం. పసిపిల్లలకు సక్రమంగా వైద్యసేవలను అందించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైద్య విధాన్ పరిషత్ విభాగంలో ఇష్టానుసారం కేటగిరీలు మార్చేశారని వస్తున్న ఆరోపణలపై కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అటువంటిది ఏమీ లేదని తెలిపారు.
వైద్య నాటక పరిషత్!
Published Sat, Jan 18 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement