అవినీతికి అడ్డాగా మారింది కాకినాడ నగరపాలక సంస్థ. గడచిన ఏడు నెలల వ్యవధిలో ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు బిల్ కలెక్టర్‌లు ముడుపులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడమే దీనికి నిదర్శనం. కొత్తగా ఆస్తిపన్ను వేయాలన్నా.. ఖాళీ స్థలాలకు పన్ను కావాలన్నా, ఉన్న పన్నులను సవరించాలన్నా, టైటిల్ డీడ్స్ మారాలన్నా.. ఇక్కడ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసేశారు రెవెన్యూ అధికారులు. వారు కోరినట్టు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు పెట్టించడం వారి నైజం..
ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు రూ.30వేలు తీసుకుంటూ బిల్ కలెక్టర్ కృష్ణ ఏసీబీకి చిక్కడం ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
చిక్కుతూనే..
ఒకప్పుడు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన కాకాని సుబ్రహ్మణ్యం, అప్పటి టీపీఓ కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి ముడుపులు తీసుకుని రైలు, బస్సులో హైదరాబాద్ వెళుతున్నారన్న పక్కాసమాచారంతో కొన్నేళ్ల క్రితం ఏసీబీ వలపన్ని నగదుతో సహా వారిని పట్టుకుంది. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత గత ఏడాది ఆగస్టు 10న టైటిల్‌డీడ్ మార్పు కోసం బిల్ కలెక్టర్ విజయ్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రూ.10వేలు ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.
వీరి వ్యవహారం ఇంకా కొలిక్కిరాకముందే తాజాగా మరో బిల్‌కలెక్టర్ కృష్ణ ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు రూ.80వేలు డిమాండ్ చేసి చివరకు రూ.30వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు.నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి సొంతంగా ముడుపులు దండుకుంటున్న సిబ్బందిపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సిబ్బంది చివరి క్షణంలో తప్పించుకున్నారన్న అంశం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి సిబ్బంది ఆటలు కట్టించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు బిల్ కలెక్టర్ కృష్ణ ఏసీబీకి పట్టుబడడంతో ఆశాఖ అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. గతంలో నమోదైన ఏసీబీ కేసులు, ప్రస్తుత కేసుతో సహా వివిధ అంశాలపై వారు చర్చించారు.
కృష్ణ.. కృష్ణా!
Published Thu, Mar 10 2016 1:26 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement