దొర్నిపాడు : లంచం తీసుకుంటూ దొర్నిపాడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి, దొర్నిపాడు వీఆర్‌ఓ పుల్లారెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దొర్నిపాడులోని పయిడాల సుబ్బారెడ్డి కుమారుడు శివరామిరెడ్డి 925-1 సర్వే నెంబర్‌లో 5.30 ఎకరాలు మెట్టపొలం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1994లో 2 ఎకరాల పొలం తన భార్య పి.కళావతి పేరిట రిజిష్టర్ చేయించాడు.10 సంవత్సరాల తర్వాత పాస్‌బుక్‌లు, టైటిల్‌డీడ్స్ కోసం అప్పటి వీఆర్‌ఓ వెంకటస్వామి(ప్రస్తుతం ఆర్‌ఐ), వీఆర్‌ఓ పుల్లారెడ్డిని అడగడంతో కొంతకాలంగా రూ.5 వేలు ఇస్తేనే పట్టాదారుపాస్‌బుక్‌లు. టైటిల్‌డీడ్స్ ఇస్తామని చెప్పారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పుకున్నప్పటికి కనికరించకుండా తిప్పుకోవడంతో చివరకు రూ2000కు ఒప్పందం చేసుకున్నారు. విసుగు చెందిన శివరామిరెడ్డి చివరకు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సర్కిల్‌ఇన్‌స్పెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డితో కలిసి టీకొట్టు వద్ద మాటువేశారు.
రైతు శివరామిరెడ్డి డబ్బు తెచ్చి ఆర్‌ఐను సంప్రదించగా వీఆర్‌ఓ పుల్లారెడ్డికి ఇవ్వాలని సూచించడంతో రైతు వెంటనే వీఆర్‌ఓ పుల్లారెడ్డికి అందిస్తుండగా వెంటనే ఏసీబీ అధికారులు అప్రమతమై లంచం తీసుకుంటున్న వీఆర్‌ఓను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ వెంకటస్వామి కార్యాలయం వెనుకవైపు నుండి పారిపోయాడు. పరారీలో వున్న ఆర్‌ఐతోపాటు వీఆర్‌ఓపై కేసు నమోదు చేసిన ట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.
ఏసీబీ వలలో దొర్నిపాడు ఆర్‌ఐ, వీఆర్‌ఓ
Published Sun, Feb 8 2015 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement