పశ్చిమ గోదావారి (మొగల్తూరు): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలను లంచాల పేరుతో పీడించుకు తింటున్న అధికారిని ఏసీబీ అధికారులు శనివారం అదుపులో తీసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల తహశీల్దారు కార్యలయంలో జరిగింది. కార్యలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్‌వీకే మల్లికార్జున్‌రావు పుట్టిన రోజు నిర్ధరణ పత్రం జారీచేయడానికి లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.
మండలంలోని కేటీ పాలానికి చెందిన మురళి కృష్ణ మోహన్ రావు పుట్టిన రోజు నిర్ధరణ పత్రం కోసం గత ఏడాది నవంబరు నెలలో అర్జీ పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో డీటీని సంప్రదిస్తే ఐదువేలు లేనిదే పని జరగదని అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని నాలుగు వేలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం మధ్యాహ్నం పథకం ప్రకారం ముందుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించి ఆతర్వాత డీటీకి డబ్బు అందించారు. డీఎస్‌పీ వి.గోపాలకృష్ణన్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి మల్లికార్జున్‌రావును అదుపులోకి తీసుకుంది. అతని నుంచి అదనపు సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.