డీటీ..అవినీతిలో మేటి!  | Corrupt Official Caught by ACB In Kurnool | Sakshi
Sakshi News home page

డీటీ..అవినీతిలో మేటి! 

Published Fri, Sep 6 2019 6:51 AM | Last Updated on Fri, Sep 6 2019 6:52 AM

Corrupt Official Caught by ACB In Kurnool - Sakshi

సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పాణ్యం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కోవెలకుంట్లకు చెందిన శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నాడు. ఈ విషయం ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. కోవెలకుంట్లతోపాటు నంద్యాల, పాణ్యం మండలం కొండజూటూరు ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అందించిన సమాచారం మేరకు.. 2004లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన శ్రీనివాసులు.. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో ఆర్‌ఐగా, డీటీగా, సీఎస్‌డీటీగా, ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా పనిచేశారు.

ప్రస్తుతం పాణ్యం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో మూడు బృందాలుగా విడిపోయి కోవెలకుంట్లలో ఉన్న  సొంత ఇంటితోపాటు నంద్యాల ఎన్‌జీఓ కాలనీలో అద్దె ఇల్లు, అత్తగారి గ్రామమైన పాణ్యం మండలం కొండజూటూరులో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, ఆస్తులు, వివిధ బ్యాంకులకు చెందిన పాసుపుస్తకాలు, ఎల్‌ఐసీ బాండ్లు, క్రెడిట్, డెబిట్‌ కార్డులపై తనిఖీలు చేశారు.  

రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తింపు..  
డిప్యూటీ తహసీల్దార్‌ నివాసం ఉంటున్న నంద్యాలలోని అద్దె ఇంటిలో రూ. 18 లక్షలు విలువ చేసే ఇన్నోవా వాహనం, రూ. 1.60 లక్షల నగదును గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోవెలకుంట్లలో 2015వ సంవత్సరంలో దాదాపు రూ. కోటితో నిర్మించిన  మూడు అంతస్తుల భవనం, మరో రెండు పాత ఇళ్లు, 3 ప్రాంతాల్లో ఇళ్ల ఫ్లాట్లు, ట్రాక్టర్, రెండు బైక్‌లు, రూ. 25 లక్షల విలువ చేసే ఎల్‌ఐసీ బాండ్లు, రూ. 12 లక్షలు విలువ చేసే  ఒకటిన్నర ఎకరా పొలం, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఒక లాకరు ఉన్నట్లు ఏసీబీ అధికారులు  సోదాల్లో గుర్తించారు.

వీటి విలువ రూ. 1.50 కోట్లు అధికారులు చెబుతుండగా మార్కెట్‌ విలువ ›ప్రకారం  వీటి విలువ రూ.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాకర్‌లో నగదు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయా అన్న కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.  ఈ మేరకు శ్రీనివాసులను ఏసీబీ కస్టడీకి తీసుకుని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వివరించారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్‌  శ్రీనివాసులు భార్య హరిత పాణ్యం మండలంలో ఎన్నికల డీటీగా విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ఆ శాఖ ఇన్‌స్పెక్టర్లు గౌతమి, ప్రవీణ్‌కుమార్, ఖాదర్‌బాష, చక్రవర్తి, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement