సీబీఐ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ!  | ACB case against central officer | Sakshi
Sakshi News home page

సీబీఐ వర్సెస్‌ ఏసీబీ! 

Published Sat, Dec 1 2018 4:29 AM | Last Updated on Sat, Dec 1 2018 6:36 PM

ACB case against central officer - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం ఏసీబీల మధ్య రగడ మొదలైంది. లంచం డిమాండ్‌ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో సీబీఐ నేరుగా దర్యాప్తు జరిపేందుకు అనుమతి రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కేంద్ర సీజీఎస్టీ రేంజ్‌ అధికారి ముక్కు కాళీ రమణేశ్వర్‌పై లంచం తీసుకున్న కేసులో రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. (ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ)

వాస్తవానికి కాళీ రమణేశ్వర్‌పై విశాఖ సీబీఐ అధికారులకు ముందుగా ఫిర్యాదు అందింది. దీనిపై విచారించేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. అంతేకాక.. విశాఖ నుంచి సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని గురువారం వెలగపూడి సచివాలయంలో వ్యక్తిగతంగా కలిసి ఈ విషయంలో గోప్యత పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ వినతిని బేఖాతరు చేస్తూ సమాచారాన్ని ఏసీబీకి లీక్‌ చేసింది. దీంతో వారు రమణేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ కేసు నమోదు చేయడం ఇప్పుడు సీబీఐ, ఏసీబీలలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ వ్యవహరించిన తీరును సీబీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టింది. పరస్పర సహకారం లేకపోతే వ్యవస్థలోని అవినీతిని అరికట్టలేమని పేర్కొంది. ఫిర్యాదు తమకే నేరుగా వచ్చినట్లు ఏసీబీ ప్రకటించడంపై కూడా సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

నిబంధనలు ఉల్లంఘన 
రాష్ట్రంలో సీబీఐని అడ్డుకునే దిశగా కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా మచిలీపట్నంలో కేంద్ర జీఎస్టీ రేంజ్‌ అధికారిపై వ్యూహాత్మకంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాటించాల్సిన నిబంధనలను కూడా ఏసీబీ అధికారులు ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేశారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేయాలి. రాష్ట్ర  ప్రభుత్వ ఏసీబీ విభాగం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. తాము ఏ కేంద్ర ప్రభుత్వ అధికారిపై దాడి చేయనుందీ ముందుగా సీబీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా, రాష్ట్రంలోని ఆ కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఉన్నతాధికారికి కూడా ముందుగా తెలియజేసి అనుమతి పొందాలి.

ఈ నిబంధనలను  ఏసీబీ అధికారులు పట్టించుకోనే లేదు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన కాళీ రమణేశ్వర్‌ కేంద్ర సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ఉద్యోగి. ఆయనపై దాడిచేసి కేసు నమోదు చేయాలంటే ముందుగా రాష్ట్ర కస్టమ్స్‌ కమిషనర్‌కు సమచారం ఇచ్చి అనుమతి పొందాలి. కానీ, తమను ఎవరూ సంప్రదించలేదని కస్టమ్స్‌ కమిషనర్‌ ఆఫీసు వర్గాలు తెలిపాయి. తమకు సమచారం ఇచ్చినా సరే తాము అనుమతించి ఉండేవారం కాదని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులమైన తమపై సీబీఐనే విచారించాలన్నది తమ సర్వీసు నిబంధనల్లో ఉందన్నారు. అందుకు విరుద్ధంగా ఏసీబీని అనుమతించే ప్రశ్నేలేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోసిన సీబీఐ 
అవినీతి నిరోధక కేసులను విచారించడానికి అనుమతివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరును సీబీఐ ఖండించింది. లంచం అడిగిన కేంద్ర కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ కాళీ రమణేశ్వర్‌ను ట్రాప్‌చేసి పట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినా ఇవ్వకపోగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి లీక్‌ చేయడాన్ని ఖండిస్తూ సీబీఐ శుక్రవారం ఓ ప్రకటను విడుదల చేసింది. అవినీతిని నిరోధించే సంస్థల మధ్య పరస్పరం నమ్మకం లేకపోతే వ్యవస్థలో అవినీతిని అరికట్టలేమంది. ఇరువురి మధ్య సహకారం, నమ్మకం ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని పేర్కొంది. దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర పోలీసు విభాగం వ్యవహరించిన తీరును సీబీఐ తీవ్రంగా తప్పుబట్టింది. వాస్తవానికి మచిలీపట్నంకు చెందిన కాళీ రమణేశ్వర్‌ అవినీతిపై నవంబర్‌ 28న విశాఖపట్నంలోని సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు అందిందని, అందిన వెంటనే సీబీఐ విశాఖపట్నం ఎస్‌పీ.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అత్యంత రహస్యంగా లేఖ రాసినట్లు సీబీఐ తెలిపింది.

ఆ అధికారిని పట్టుకోవడానికి అనుమతివ్వమని కోరుతూ రాసిన ఈ లేఖను అదే రోజు మధ్యాహ్నం సీబీఐకి చెందిన డిప్యూటీ ఎస్‌పీ ర్యాంక్‌ అధికారి స్వయంగా వెళ్లి అందించడమే కాకుండా ఈ వివరాలను వేరొక్కరికి తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచమని కోరారని సీబీఐ ఆ ప్రకటనలో వివరించింది. అంతేకాకుండా 29న విశాఖ నుంచి సీబీఐ ఎస్‌పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని వెలగపూడి సచివాలయంలో స్వయంగా కలిశారు. తాము ట్రాప్‌ చేయడానికి వీలుగా నవంబరు 8న రద్దుచేసిన జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించుకోవాలని ఆ అధికారి కోరినట్లు సీబీఐ పేర్కొంది. తక్షణం అనుమతివ్వాల్సిందిగా మూడో రోజున ముఖ్య కార్యదర్శికి మరో లేఖ రాశామని, కానీ అందుకు అనుమతివ్వకపోగా రాష్ట్ర హోంశాఖ ఈ వివరాలను రాష్ట్ర ఏసీబీకి లీక్‌చేసి అదే రోజు సాయంత్రం ట్రాప్‌చేసి ఆ అధికారిని అరెస్ట్‌చేసినట్లు సీబీఐ ఆరోపించింది. కాగా, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి తాము చేసిన విజ్ఞప్తి గురించి సీబీఐ జోనల్‌ హెడ్‌కు కూడా సంబంధిత అధికారులు తెలియజేశారు.  కానీ, ఈ ఫిర్యాదు నేరుగా తమకే వచ్చినట్లు ఏసీబీ అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొనడాన్ని సీబీఐ తప్పుబట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement