ఏసీబీ వలలో హెడ్‌కానిస్టేబుల్
Published Thu, Mar 16 2017 12:35 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: జిల్లాలో పోలీసు శాఖ ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. కిందిస్ధాయి నుంచి అధికారుల వరకూ అవినీతికి పాల్పడుతున్నారు. వైన్ షాపుల నుంచి లంచాలను తీసుకుంటున్న బుచ్చిరెడ్డిపాలెం హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మా వైన్‌షాపుల యజమాని చల్లా వెంకటేశ్వర రెడ్డి పోలీసులు లంచం ఇవ్వమని తనను వేధిస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అవినీతికి పాల్పడుతున్న పోలీసులను పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. వెంకటేశ్వరరెడ్డితో అతని భార్య పద్మ వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని పోలీసులకు చెప్పించారు. దీంతో డబ్బును తీసుకోవడానికి బుచ్చిరెడ్డిపాలెం పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు మద్యం షాపుల యజమాని ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ నిఘా వేసిన ఏసీబీ అధికారులు రూ.26 వేల నగదును తీసుకుంటుండగా వెంకటేశ్వర్లును పట్టుకున్నారు.
డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు....
లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్‌కానిస్టేబుల్‌ను ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ విచారించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి నుంచి సీఐ సుబ్బారావు, ఎస్సై సుధాకర్ రెడ్డి, ఏఎస్సైలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ అందరికీ నెలసరి మామూళ్లలో భాగం ఉందని హెడ్ కానిస్టేబుల్ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. రైటర్‌గా చేరినప్పటి నుంచి తానే నగదు తీసుకెళ్లి అందరికీ పంచుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అంగీకరించారని చెప్పారు. అధికారులు చెబితేనే తాను లంచం తీసుకోవడానికి వచ్చినట్లు కూడా చెప్పారని వివరించారు. మండలంలోని పది దుకాణాలు రూ.13వేల చొప్పున ప్రతి నెలా మామూళ్లు ఇస్తారని విచారణలో వెల్లడైందని ప్రభాకర్ తెలిపారు.
విచారణ జరుపుతున్నాం
హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సేకరించిన మొత్తంలో అధికారుల భాగస్వామ్యం ఉన్నందున విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఎస్సైను విచారించేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేరని.. పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
25 లక్షలు నష్టపోయాను
బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మ మద్యం దుకాణాలు పెట్టి 25 లక్షలు నష్టపోయామని ఫిర్యాదుదారుడు చల్లా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మద్యం దుకాణాల నుంచి ప్రతి నెలా పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, మద్యం డిపో తదితరులందరికీ లంచం ఇవ్వాలని చెప్పారు. అలా తాను రూ.25 లక్షలు నష్టపోయానని వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. పోలీసులు లంచం ఇవ్వాలని వేధిస్తుండడంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించానని వివరించారు.
Advertisement