ఏసీబీ కార్యాలయం
విజయనగరం టౌన్: అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ తనదైన శైలిలో నడుం బిగించింది. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించి, ఫలానా ప్రభుత్వ అధికారి తనను లంచం డిమాండ్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ వ్యక్తిపై ఏసీబీ నిఘా పెడుతుంది. మూడో కంటికి తెలి యకుండా గుట్టుచప్పుడుగా దాడులు నిర్వహిస్తుంది. బాధిత ఫిర్యాదుడి సమస్యను తామే దగ్గరుండి తీర్చడంతో పాటు ప్రత్యేక రక్షణ కల్పించడంలో తనదైన పాత్ర పోషిస్తుంది.
జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జనవరి 3న రాష్ట్రంలోనే తొలి కేసుగా నమోదైంది. అది కూడా 1981లో ఏర్పాటైనప్పటి నుంచి ఎక్కడా అవినీతి కేసు లేని గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్)లో, వ్యవసాయబోరు కనెక్షన్ కోసం మెరకముడిదాం మండలం లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మారోజు చక్రధర్ రూ.7300 లంచం తీసుకుంటుండగా చీపురుపల్లిలోని కొత్తగవిడి వీధిలో ఆయన నివాసంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఏసీబీకి ఈ ఏడాది బోణీ పడింది.
ఏసీబీని ఎలా ఆశ్రయించాలి
ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లినప్పుడు అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీని ఆశ్రయించవచ్చు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వెనుక దండుమారమ్మ ఆలయం వద్ద సొంత భవనం ఉంది. బాధితులు ఏ పని నిమిత్తం అధికారికి దరఖాస్తు చేయాలి. ఏ పనికి ఎంత మొత్తంలో లంచం అడిగారనేది స్పష్టంగా తెలియజేయాలి. ఫిర్యాదు చేయాలనుకునే వారు ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను (సెల్: 9440446174), సీఐ లక‌్ష్మోజి (సెల్: 9440446176), సీఐ కె. సతీష్‌కుమార్ (సెల్:9440446179), ల్యాండ్ లైన్ (08922–276404) నంబర్లను సంప్రదించాలి.
ఏసీబీ దాడులు జరిగే తీరిలా..
సాధారణంగా ఏసీబీ దాడులు మూడు రకాలుగా నిర్వహిస్తుంది. ప్రధానంగా ట్రాప్ చేసి పట్టుకున్నవి, అక్రమాస్తులు, ఆకస్మిక తనిఖీలు. ఇందులో నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాటిని ట్రాప్ కేసులు కింద నమోదు చేస్తారు. వసతిగృహాలపై ఆకస్మిక దాడులు, చెక్‌పోస్టులు దాడులు నిర్వహిస్తారు. ఆక్రమ ఆస్తుల కేసులు వివరాలను సేకరించి దాడులు చేస్తారు.
బాధితులకు భరోసా
ప్రభుత్వ పరంగా అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఎక్కడైనా ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఎటువంటి ఆలోచన లేకుండా నేరుగా తమను సంప్రదించవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. వారికి రక్షణ కల్పిస్తాం. ఫిర్యాదును పరిశీలించి అవినీతిపరుల ఆటకట్టిస్తాం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ధైర్యంగా సమాచారమివ్వండి. అవినీతిని పారద్రోలడానికి మీ వంతు ప్రోత్సాహాన్నివ్వండి.
– ఎస్‌కె. షకీలా భాను, ఏసీబీ ఏఎస్పీ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment