సాక్షి, విజయనగరం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు గడ్డి కరిచాడు. డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానంటూ లంచానికి మరిగాడు. ఈ క్రమంలో శుక్రవారం విద్యార్థుల దగ్గర నుంచి లంచం వసూలు చేస్తూ డిప్యూటీ హెడ్ మాస్టర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాలు.. లక్కవరపు కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఓపెన్ స్కూలు)లో ఈ.సాయికృష్ణారావు డిప్యూటీ హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఓపెన్ స్కూలులో పదవ తరగతి పాసైన విద్యార్థులకు టీసీ, ఇతర సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆయన రూ.7 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ట్యూషన్ టీచర్ వెంకట రమణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 14400కు కాల్ చేసి ఏసీబీ అధికారులకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం లక్కవరపు కోటలోని చందులూరు గ్రామంలో విద్యార్థుల నుంచి ఏడు వేలు లంచం తీసుకుంటున్న సాయి కృష్ణారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment