సాక్షి, ఒంగోలు: ‘మేము సిద్ధం..లంచం అడిగేవారి సమాచారం అందించడంలో మీదే ఆలస్యం’ అన్నట్లుగానే చేసి చూపుతున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే ప్రజల నుంచి లంచాలు గుంజాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ విషయంలో తమకు ప్రజల నుంచి సహకారం అవసరమని చెబుతున్న ఏసీబీ అధికారులు ఇటీవల తమ దూకుడు పెంచారు. అవినీతి నిరోధకశాఖ ఏర్పడి 60ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు అవినీతి ఉద్యోగుల భరతం పట్టేందుకు విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఫలితాలు ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది. డీఎస్పీ భాస్కరరావు నేతృత్వంలోని ఆశాఖ సిబ్బంది లంచావతారాల ఆట కట్టిస్తున్నారు. గతేడాది కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో భారీగా కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఈ ఏడాది ప్రారంభం నుంచే తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై, తడలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై కేసులు నమోదు చేసిన ఏసీబీ గతనెల రోజుల కాలంలో ప్రకాశం జిల్లాలో లంచాలు తీసుకుంటున్న ముగ్గురు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండ్‌కు పంపారు.
ఇవీ కేసులు...
గతనెల 19న కొత్తపట్నం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ షేక్ షాజిదా, వెంకటేశ్వరమ్మ అనే మహిళ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈనెల 4న ప్రకాశం భవన్‌లోని సీనియర్ ఆడిట్ అధికారి విజయభాస్కర్, పొదిలికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. తాజాగా సోమవారం కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల వీఆర్‌వో శివప్రసాద్ పట్టాదారు పాస్‌పుస్తకం కోసం బరిగే గురువులు అనేవ్యక్తి నుంచి రూ.3,500 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ కార్యాలయంలో, ఓవైపు ప్రజావిజ్ఞప్తుల దినం కొనసాగుతుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేవలం నెల రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో జిల్లాలో పనిచేస్తూ లంచాల కోసం అర్రులు చాచే పలువురు అవినీతి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
ముఖ్యంగా ప్రకాశం భవనంలో సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం మిద్దెపైన, కొనకనమిట్ల తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగిన సంఘటనలు ఆయా ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని కలవరపెట్టాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు తమ పరిధిలో సేవ చేయాలే తప్పవారిని ఇబ్బందులకు గురిచేస్తూ లంచాల కోసం పీడిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఏసీబీ అధికారులు ఇతర ఉద్యోగులకు ఈ సంఘటనలు సంకేతాలు పంపినట్లయింది. అవినీతి అధికారులు, సిబ్బంది విషయంలో తాము నిరంతరం అప్రమత్తంగానే వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఏసీబీ దూకుడు
Published Wed, Jan 22 2014 3:46 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement